Medak News : మెదక్ లో రసవత్తర రాజకీయం- మోదీ, రేవంత్ రెడ్డి, కేసీఆర్ మధ్యే పోటీ?-medak lok sabha elections kcr modi reavanth reddy meeting held winning big challenge to brs ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Medak News : మెదక్ లో రసవత్తర రాజకీయం- మోదీ, రేవంత్ రెడ్డి, కేసీఆర్ మధ్యే పోటీ?

Medak News : మెదక్ లో రసవత్తర రాజకీయం- మోదీ, రేవంత్ రెడ్డి, కేసీఆర్ మధ్యే పోటీ?

HT Telugu Desk HT Telugu
May 12, 2024 10:16 PM IST

Medak News : మెదక్ లోక్ సభ ఎన్నికల్లో విజయం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావుకు పెద్ద ఛాలెంజ్ గా మారింది. పదేళ్లుగా ఎదురులేని ఈ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంటే...బీజేపీ, కాంగ్రెస్ గెలుపు కోసం వ్యూహాలు రచించాయి.

మోదీ, రేవంత్ రెడ్డి, కేసీఆర్ మధ్యే పోటీ?
మోదీ, రేవంత్ రెడ్డి, కేసీఆర్ మధ్యే పోటీ?

Medak News : మెదక్ లోక్ సభ ఎన్నికల్లో విజయం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావుకు తమ రాజకీయ జీవితంలోనే అతి పెద్ద ఛాలెంజ్ గా మారింది. తెలంగాణ సాధించిన తరవాత, పది సంవత్సరాలు రాష్ట్రంలో జరిగినా అన్ని ఎన్నికల్లో తమకు ఎదురులేనట్టుగా గెలుచుకుంటూ వచ్చిన బీఆర్ఎస్ పార్టీ, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి అధికారం కోల్పోవటంతో ఆ పార్టీ పరిస్థితి పూర్తిగా తలకిందులైయింది. బీఆర్ఎస్ పార్టీ 2001లో ఏర్పాటు చేసిన తర్వాత, జరిగిన అన్ని ఎన్నికల్లో కూడా ఆ పార్టీ అభ్యర్థులు మెదక్ నుంచి గెలిచారు. గత మూడు ఎన్నికల్లో, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలకు గెలుస్తామనే ఎటువంటి ఆశలు లేకుండానే బరిలోకి దిగాయి.

తొలిసారి ముక్కోణ పోటీ

ఈ సారి ఎన్నికల్లో మాత్రం, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కూడా ఇక్కడ గెలవడానికి తమ సర్వశక్తులు వడ్డుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో లేకపోవటం, కాంగ్రెస్ తెలంగాణలో అధికారం చేజిక్కుంచుకోవటం, బీజేపీ కూడా వరుసగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రావటం అనే లక్ష్యంతో ఇక్కడ పోరాడుతున్నాయి. ఈ నేపథ్యంలో, కేసీఆర్, హరీశ్ రావుకు కూడా ఈ సీటు గెలుచుకోవటం అంత సులువైన పనిగా కనపడటం లేదు. రెండు జాతీయపార్టీలు, తమ వనరులన్నింటిని ఇక్కడ మోహరించడంతో, ఈ ఎన్నిక తొలిసారిగా ముక్కోణ పోటీగా మారింది.

మోదీ, రాహుల్ గాంధీ సభలు

మెదక్ సీటుని ఎలాగైనా గెలుచుకోవాలని బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు మెదక్ లో మోదీతో బహిరంగ సభ ఏర్పాటు చేయిస్తే, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీతో నర్సాపూర్ లో బహిరంగ సభ ఏర్పాటు చేసింది. కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా సిద్దిపేట బహిరంగ సభ నిర్వహించగా... తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధిపేట, పటాన్ చెరులో బహిరంగ సభల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్, బీజేపీ మెదక్ ఎన్నికను ఎంత సీరియస్ గా తీసుకున్నాయి ఈ సభలను బట్టి అర్ధం చేసుకోవచ్చని ఎన్నికల విశ్లేషకులు అంటున్నారు. మెదక్ లో బీఆర్ఎస్ ను ఓడిస్తే, కేసీఆర్ పూర్తిగా బలహీనపడతారని ఆ రెండు జాతీయ పార్టీలు భావిస్తున్నాయని తేటతెల్లమవుతుంది.

సర్వశక్తులు వడ్డిన కేసీఆర్, హరీశ్ రావు

ఇలాంటి పరిస్థితుల్లో, బీఆర్ఎస్ పార్టీ కూడా మెదక్ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో తమ సర్వశక్తులు వడ్డింది. కేసీఆర్ దాదాపుగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో ప్రచారం చేయగా, హరీశ్ రావు ప్రతి మండలంలో ప్రచారం చేశారు. ఆ పార్టీకి ఇక్కడ ఆరుగురు ఎమ్మెల్యేలు ఉండటంతో, వారు గ్రామా గ్రామాన తిరిగి ప్రచారం చేశారు. ఈ ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసీఆర్, హరీశ్ రావు ఎన్నికల ప్రచారాన్ని ప్రతి నిమిషం పరిశీలించారు.మెదక్ ఎన్నిక బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామి రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు, బీజేపీ పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు కంటే, కూడా కేసీఆర్, రేవంత్ రెడ్డి, మోదీ మధ్యలోనే పోటీ లాగా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం