Khammam TDP Votes: ఖమ్మంలో తెలుగు తమ్ముళ్ల ఓట్లు ఎటు వైపు? కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల గాలం-congress and brs candidates trying to get tdp cadre votes in khammam ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Khammam Tdp Votes: ఖమ్మంలో తెలుగు తమ్ముళ్ల ఓట్లు ఎటు వైపు? కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల గాలం

Khammam TDP Votes: ఖమ్మంలో తెలుగు తమ్ముళ్ల ఓట్లు ఎటు వైపు? కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల గాలం

HT Telugu Desk HT Telugu
May 09, 2024 01:34 PM IST

Khammam TDP Votes: ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల ఓట్లు ఎవరికి మొగ్గు చూపుతాయోనన్న ఆసక్తి నెలకొంది. టీడీపీ పోటీలో లేకపోవడంతో ఆ ఓట్లను దక్కించుకోడానికి ప్రధాన పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.

ఖమ్మంలో టీడీపీ ఓటు బ్యాంకు దక్కేది ఎవరికి
ఖమ్మంలో టీడీపీ ఓటు బ్యాంకు దక్కేది ఎవరికి

Khammam TDP Votes: తెలంగాణలో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయని పరిస్థితితో ఆ పార్టీకి చెందిన ఓట్ల కోసం పోటీలో ఉన్న అభ్యర్థులు కుస్తీ పడుతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో కొనసాగిన కాలంలో ఖమ్మం జిల్లాలో ఆ పార్టీ ప్రాబల్యం బలంగా ఉండేది.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్న చరిత్ర కూడా ఉంది. అయితే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి పరిమితం కావడంతో తెలంగాణ రాష్ట్రంలో పార్టీ క్రమంగా బలహీన పడుతూ వచ్చింది.

అయినప్పటికీ సామాజిక వర్గ కోణంలో ఆ పార్టీపై అభిమానాన్ని కురిపించే ప్రజలు ఇప్పటికీ లేకపోలేదు. కాగా ఈ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీకి నిలవని స్థితిలో ఆ ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారోనన్న రాజకీయ ఆసక్తి సర్వత్రా నెలకొంది.

ఆంధ్రాలో బీజేపీతో పొత్తు..

తెలుగుదేశం పార్టీ ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లోకి దిగుతోంది. అయితే తెలంగాణలో మాత్రం ఈ సమీకరణ కుదిరే పరిస్థితి లేనేలేదు. తెలంగాణలో బీజేపీ ప్రాభవం పెద్దగా లేని నేపధ్యంలో ఇక్కడ ఆ పొత్తును కొనసాగించే అవకాశం లేదు.

పోటీ చేయని పక్షంలో తెలుగు తమ్ముళ్లు ఎవరికి ఓట్లు వేయాలనే అంశంపై ఆ పార్టీ పెద్దల నుంచి ఎలాంటి ఆదేశాలు లేవు. ఏపీలో పొత్తుకు సమాంతరంగా తెలంగాణలో కూడా బీజేపీ అభ్యర్థులకు ఓట్లు వేయమంటారా..? లేదా..? అన్నదానిపై స్పష్టత లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలోనే తెలుగు తమ్ముళ్లు బాహాటంగా పాల్గొనడం గమనార్హం.

ఎన్నో ఏళ్లుగా జిల్లా రాజకీయాలను శాసించిన తుమ్మల నాగేశ్వరరావు ఆ ఎన్నికల్లో ఖమ్మం నుంచి పోటీలో ఉండటం అందుకు ఒక కారణం కావొచ్చు. కాగా తాజా ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ స్థానాలు కలిసి ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గంగా ఉంది. ఇలాంటి స్థితిలో తెలుగు తమ్ముళ్లకు చంద్రబాబు నాయుడు నుంచి స్పష్టమైన ఆదేశం ఉంటే తప్ప ఎవరికి ఓటేయాలో అంతు చిక్కని పరిస్థితి నెలకొంది.

ఖమ్మం లోక్ సభ స్థానంలో తాజాగా ముక్కోణపు పోటీ నెలకొంది. అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియ్యంకుడు రామసహాయం రఘురామ్ రెడ్డి పోటీలో ఉండగా, బీఆర్ఎస్ సిట్టింగ్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు బరిలో నిలిచారు. ఇక బీజేపీ పార్టీ అభ్యర్థిగా తాండ్ర వినోద్ రావు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే ఆంధ్రాలో తెలుగుదేశంతో పొత్తులో ఉన్న బీజేపీ పార్టీ ఇక్కడ తెలుగు తమ్ముళ్ల ఓట్ల కోసం తాపత్రయ పడకపోవడమే విచిత్రం.

కాంగ్రెస్, బీజేపీల ఎత్తులు..

ఏపీలో పొత్తు పెట్టుకున్న బీజేపీ తెలంగాణలో మాత్రం తెలుగుదేశం ఓట్ల కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయకపోగా అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మాత్రం తెలుగుదేశం ఓట్ల కోసం పోటీ పడుతున్నాయి. కాంగ్రెస్ రహస్యంగా తన ఎత్తుగడను అమలు చేస్తూ ముందుకు సాగుతుండగా బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు మాత్రం ఏకంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్లి తెలుగు తమ్ముళ్లతో మీటింగ్ పెట్టారు.

నాకు రాజకీయ జీవితాన్ని ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అని, తెలుగు తమ్ముళ్లతో తన బంధం విడదీయరానిదని చెప్పుకొచ్చారు. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లల్లో జిల్లా కేంద్రమైన ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలోనే టీడీపీ ఓట్లు అధికంగా ఉండటం విశేషం. సామాజిక వర్గ కోణాన్ని అనుసరించి ఇక్కడ తమ్ముళ్ల ఓట్ల శాతం ఎక్కువగా ఉండటం గమనార్హం.

దీంతో టీడీపీలో రాజకీయ ఓనమాలు దిద్దిన తుమ్మల నాగేశ్వరరావు అండతో కాంగ్రెస్ అభ్యర్థి ఆ ఓట్లకు గాలం వేస్తుండగా, నేనూ తెలుగుదేశంలో పుట్టిన వాడినేనని బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కొత్త పల్లవి అందుకున్నారు.

ఎవరికి తోచినట్లు వారే..

పరిస్థితి ఇలా ఉండగా అసలు టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణాలో తమ పార్టీని పూర్తిగా మర్చిపోయినట్లు వ్యవహరిస్తుందటమే విచారకరం. దీంతో స్థానికంగా ఉండే తెలుగు తమ్ముళ్లు ఎవరికి తోచినట్లు వారు ప్రకటనలు చేస్తున్నారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే ఈ ఎన్నికల్లోనూ తమ ఓట్లు కాంగ్రెస్ కేనని ఒక నాయకుడు ఉద్ఘాటిస్తే మరో నేత తాము ఆంధ్రాలో తమ పార్టీ పొత్తును గౌరవిస్తూ బీజేపీకి మద్దతిస్తామని చెబుతుండటం విడ్డూరంగా కనిపిస్తోంది.

మండల స్థాయిల్లో నాయకులు సైతం ఎవరికి ఇష్టం వచ్చిన రీతిలో వారికి మద్దతు ప్రకటిస్తూ అయోమయాన్ని సృష్టిస్తున్నారు. నాయకుల తీరు ఇలా ఉంటే ఆ పార్టీ ఓటర్లు మాత్రం తమ ఓట్లను ఎవరికి వేయాలోనన్న గందరగోళ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.

(రిపోర్టింగ్ కాపర్తి నరేంద్ర, ఖమ్మం)

Whats_app_banner

సంబంధిత కథనం