Khammam Politics :ఖమ్మంలో త్రిముఖ పోటీ- కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య హోరాహోరీ!-khammam lok sabha elections three parties congress brs bjp fighting for win ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Khammam Politics :ఖమ్మంలో త్రిముఖ పోటీ- కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య హోరాహోరీ!

Khammam Politics :ఖమ్మంలో త్రిముఖ పోటీ- కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య హోరాహోరీ!

HT Telugu Desk HT Telugu
Apr 28, 2024 10:33 PM IST

Khammam Politics : ఖమ్మంలో త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపు ధీమాతో ఉన్నారు. ఖమ్మం ఖిల్లాపై జెండా ఎగుర వేయాలని మూడు పార్టీలు పోటీ పడుతున్నాయి.

ఖమ్మంలో త్రిముఖ పోటీ
ఖమ్మంలో త్రిముఖ పోటీ

Khammam Politics : ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో త్రిముఖ పోటీ అనివార్యమైంది. అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల నడుమ పోటాపోటీ పోరు సాగనుంది. మూడు పార్టీల అభ్యర్థులు నియోజకవర్గాన్ని చుట్టేస్తూ ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఈసారి ఎలాగైనా ఖమ్మం సీటును దక్కించుకోవాలని ఎత్తులు వేస్తోంది. బీఆర్ఎస్ సిట్టింగ్ సీటుని తిరిగి కైవసం చేసుకోవాలని ఆరాటపడుతుండగా బీజేపీ ఈసారి ఖమ్మంలో పట్టు సాధించాలని పాకులాడుతోంది.

కాంగ్రెస్ అభ్యర్థికి అధికారం.. ఎమ్మెల్యేల బలం..

రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉండటం ఖమ్మంలో ఎంపీ సీటు(MP Seat)ను గెలుచుకునేందుకు కాంగ్రెస్ కు కలిసి వచ్చే అంశంగా మారుతుంది. అలాగే అభ్యర్థి రామసహాయం రఘురామ్ రెడ్డి వరంగల్ కి చెందిన మాజీ ఎంపీ సురేందర్ రెడ్డి కుమారుడు కావడంతో పాటు అంగ, అర్థ బలం రెండూ కలిగి ఉన్నారు. దీంతో పాటు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది స్థానాల్లో తొమ్మిది నియోజకవర్గాలను కాంగ్రెస్, సీపీఐ కూటమి గెలుచుకుంది. కాగా భద్రాచలంలో గెలిచిన ఏకైక బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సైతం ఇటీవల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఖమ్మం నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలైన ఖమ్మం, పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లి, మధిర, అశ్వారావుపేటల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ పాతిక వేల పైచిలుకు భారీ మెజారిటీతోనే గెలవడం తాజాగా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థికి కలిసి వచ్చే అంశంగా మారింది. అంతేకాకుండా ఎంపీ సీటు కోసం పార్టీలో జరిగిన అంతర్గత పోరులో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పట్టు పట్టి మరీ స్వయానా తన వియ్యంకుడైన రామసహాయం రఘురామ్ రెడ్డి(Raghuram Reddy)కి టిక్కెట్ ఇప్పించుకున్నారు. పొంగులేటి గత ఎన్నికల్లో కేసీఆర్ తో సవాల్ చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్యేలను గెలిపించుకుని పంతం నెగ్గించుకున్నారు. ఈ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి(MP Candidate) గెలుపు బాధ్యతను పొంగులేటి తన భుజస్కంధాలపై వేసుకోవడం అభ్యర్థికి మరింత అండగా మారింది. కాగా రాష్ట్ర కేబినెట్ లో కీలకంగా వ్యవహరిస్తున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి(Ponguleti Srinivas Reddy), వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లాకు చెందిన వారే కావడం కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం గెలుపునకు దోహదపడే అంశాలుగా కనిపిస్తున్నాయి.

సిట్టింగ్ సీటు కోసం బీఆర్ఎస్ పాట్లు

అధికారం కోల్పోయి రోజు రోజుకూ పలుచన పడుతున్న బీఆర్ఎస్ పార్టీకి ఖమ్మం స్థానం సిట్టింగ్ సీటు కావడంతో కొత్తవి కాకపోయినా కనీసం సిట్టింగ్ సీట్లను అయినా కాపాడుకోవాలన్న తలంపుతో బీఆర్ఎస్ పార్టీ కుస్తీ పడుతుంది. ఈక్రమంలో ఖమ్మం స్థానాన్ని మళ్లీ దక్కించుకోవాలన్న అధినేత ఆదేశాల మేరకు స్థానిక గులాబీ నేతలు పడరాని పాట్లు పడుతున్నారు. సోమవారం గులాబీ బాస్ కేసీఆర్(KCR) ఖమ్మంలో బస్ యాత్ర(Bus Yatra)ను సైతం చేపట్టనున్నారు. అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే స్థానాన్ని కూడా బీఆర్ఎస్ దక్కించుకోలేకపోయింది. దీంతో ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు(Nama Nageswara Rao)కు ఒక్క ఎమ్మెల్యే బలం కూడా లేకపోవడం గులాబీ పార్టీ బలహీనతను స్పష్టం చేస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఖమ్మం నుంచి మంత్రిగా పని చేసిన పువ్వాడ అజయ్ కుమార్ అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోయి ప్రజా మద్దతు కోల్పోవడం కూడా అభ్యర్థి నామాకి ఇబ్బందికర పరిస్థితిని తెచ్చిపెట్టాయి. అలాగే క్షేత్ర స్థాయిలో పార్టీకి అండగా ఉంటున్న జిల్లాలోని స్థానిక ప్రజా ప్రతినిధులైన జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ లు గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్ లోకి వరుస కడుతున్న పరిస్థితి ఎంపీ అభ్యర్థి బలాన్ని రోజు రోజుకూ నిర్వీర్యం చేస్తున్నాయి. దీంతో బీఆర్ఎస్ కు ఖమ్మం(Khammam) సిట్టింగ్ స్థానంలోనూ ఎదురీత తప్పనట్లే కనిపిస్తోంది.

పట్టు కోసం బీజేపీ ఎత్తులు

ఇప్పటి దాకా జిల్లాలో ఒక్క సర్పంచ్ స్థానాన్ని కూడా కైవసం చేసుకోని బీజేపీ(BJP) ఏకంగా ఈసారి ఖమ్మంలో కాషాయ జెండా ఎగరేస్తామన్న ధీమాను వ్యక్తం చేస్తోంది. బలమైన కేడర్, జిల్లాలో స్థానికంగా పార్టీ నిర్మాణం లేకపోయినా ఖమ్మం(Khammam) ఖిల్లా పై తమ జెండా ఎగరేస్తామని ఆ పార్టీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు(Tandra Vinod Rao) గట్టిగా చెబుతున్నారు. కేంద్రంలో నరేంద్ర మోదీ సారథ్యంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే తనను గెలిపిస్తాయని తాండ్ర తన ప్రచార పర్వాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. మొత్తంమీద ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం 45 మంది అభ్యర్థులు బరిలో నిలవగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల నడుమే త్రిముఖ పోటీ స్పష్టంగా కనిపిస్తోంది.

రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఖమ్మం ఉమ్మడి జిల్లా ప్రతినిధి

Whats_app_banner

సంబంధిత కథనం