KCR On Modi: మోదీ,రేవంత్ రెడ్డిపై BRS అధ్యక్షుడు కేసీఆర్ ఫైర్, మోదీ ఎమోషనల్ బ్లాక్‌మెయిలర్ అని ఆరోపణలు-brs president kcr fires on modi and revanth reddy alleging that modi is an emotional blackmailer ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Kcr On Modi: మోదీ,రేవంత్ రెడ్డిపై Brs అధ్యక్షుడు కేసీఆర్ ఫైర్, మోదీ ఎమోషనల్ బ్లాక్‌మెయిలర్ అని ఆరోపణలు

KCR On Modi: మోదీ,రేవంత్ రెడ్డిపై BRS అధ్యక్షుడు కేసీఆర్ ఫైర్, మోదీ ఎమోషనల్ బ్లాక్‌మెయిలర్ అని ఆరోపణలు

HT Telugu Desk HT Telugu
May 10, 2024 06:59 AM IST

KCR On Modi: బిఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసిఆర్ ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజల్నిమోసం చేస్తున్నారని ఆరోపించారు.

కరీంనగర్‌ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్
కరీంనగర్‌ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్

KCR On Modi: తెలంగాణలో కాంగ్రెస్ బీజేపి మోసాలను ప్రజలు గమనించారని కరీంనగర్ లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని కేసీఆర్‌ స్పష్టం చేశారు. తాజా సర్వే ప్రకారం బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ 8 శాతం ముందున్నారని తెలిపారు.

ఎన్నికల ప్రచారంలో బాగంగా కేసీఆర్ 16వ రోజు బస్సుయాత్ర కరీంనగర్ లో సాగింది. నగరంలో మానేర్ బ్రిడ్జి వద్దనుంచి కోతిరాంపూర్, కమాన్, బస్టాండ్ మీదుగా తెలంగాణ చౌక్ వరకు రోడ్ షో ప్రచారం నిర్వహించారు. ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ బానుప్రకాష్ రావు, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జి.వి.రామకృష్ణారావుతో కలిసి బస్సులో నుంచి ప్రజలకు అభివాదం చేస్తు తెలంగాణ చౌక్ చేరుకున్న కేసీఆర్ బీజేపి తీరు, కాంగ్రెస్ వైఖరిపై మండిపడ్డారు.

మోదీ ఎమోషనల్ బ్లాక్ మేయిల్ రాజకీయాలు చేస్తున్నాడని కేసీఆర్ ఆరోపించారు. పదేళ్ళ క్రితం ప్రధాని అయిన నరేంద్ర మోదీ 150 హామీలు ఇచ్చాడని అందులో ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని విమర్శించారు. రూపాయి విలువ డాలర్ తో పోల్చితే 80 పైసలకు పడిపోయిందన్నారు. దేశం అప్పుల పాలయ్యిందని విమర్శించారు. గతంలో 14 మంది ప్రధానమంత్రులు 55 లక్షల కోట్ల అప్పు చేస్తే మోదీ పదేళ్ళలో లక్ష కోట్ల అప్పు చేశాడని ఆరోపించారు.

సబ్ కా సాత్ సబ్ కా వికాస్..అచ్చె దిన్ అయిందా..అంటు ప్రశ్నించారు. అచ్చే దిన్ ఏమో కానీ, సచ్చే దిన్ మాత్రం వచ్చిందన్నారు. మేకిన్ ఇండియా అయ్యిందా.. వికసిత్ బారత్ అయిందా అంటు దివాళ భారత్ గా మార్చిండని విమర్శించారు. మేడీ మాటలు గ్యాస్.. ట్రాష్ తప్ప మరొకటి లేదన్నారు. బిజేపి గెలిపిస్తే ఇంటికి 15 లక్షలు ఇస్తానన్నాడు...కనీసం కరీంనగర్ కు 15 లక్షలైన ఇచ్చాడా.. బండి సంజయ్ తెచ్చాడా అని ప్రశ్నించారు.

గత ఎన్నికల్లో నలుగురు బీజేపి ఎంపీలను గెలిపిస్తే తెలంగాణకు పది రూపాయలు కూడా తేలేదన్నారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మాట్లాడే బాష ఎవరికైనా అర్థం అవుతుందా అని ప్రశ్నించారు. రెచ్చగొట్టి రాజకీయం పబ్బం గడుపుకోవడం తప్ప మరొకటి లేదన్నారు. కేంద్రం 150 మెడికల్ కళాశాలలు మంజూరు చేస్తే ఒక్కటైన తెలంగాణకు ఇచ్చారా.. తెలంగాణలోని ఒక్క ప్రాజెక్టుకైన జాతీయ హొదా కల్పించారా అని ప్రశ్నించారు.

ఇక కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఏమో జరిగిందని మాట్లాడుతున్నారని విమర్శించారు. బూటకపు హామీలతో మోసపోయామని తెలంగాణ ప్రజలు బాదపడుతున్నారని తెలిపారు. తొమ్మిదేళ్ళు రెప్పపాటు పోకుండా రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిన ఘతన బిఆర్ఎస్ ప్రభుత్వానిది అయితే కాంగ్రెస్ పాలనలో కరెంటు కోతలు మొదలయ్యాయని తెలిపారు.

ఐదెకరాలకంటే ఎక్కువ ఉన్న రైతులకు రైతుబందు ఇవ్వనని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడని అసలు రైతుబందును కిందిమీద చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా ఊడుతుందా తెలువదన్నారు. 420కి పైగా హామీలు ఇచ్చి అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేశారని ఆరోపించారు. రాహుల్ గాందీ చెబుతున్నాడు మహిళలకు 2500 రూపాయలు ఇస్తున్నామని ఎవ్వరికైనా వచ్చాయా అని కేసిఆర్ ప్రశ్నించారు. విజ్ఞతతో చెబుతున్న మంచివాళ్ళకు ఓటు వేయండి...విద్యావంతుడు వినోద్ కుమార్ ను ఎంపీగా గెలిపించాలని కోరారు.

కరీంనగర్ లో బస.. రెండోరోజు సిరిసిల్లలో రోడ్ షో

ఎన్నికల ప్రచారంలో బాగంగా కరీంనగర్ కు చేరుకున్న కేసిఆర్ రాత్రి తీగలగుట్టపల్లిలోని ఉత్తర తెలంగాణ భవన్ లో బస చేశారు. శుక్రవారం మద్యాహ్నం పార్టీ ముఖ్యనాయకులతో సమావేశమై ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం పై దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం సాయంత్రం బస్సుయాత్రతో సిరిసిల్లకు చేరుకుని కొత్త చెరువు నుంచి చేనేత స్థూపం వరకు రోడ్ షో తో ప్రచారం నిర్వహించనున్నారు.

నేతన్న విగ్రహం వద్ద ప్రజలను ఉద్దేశించి మాట్లాడి రాత్రి సిద్దిపేటలో బస చేయనున్నారు. సిద్దిపేట సభతో కేసిఆర్ బస్సుయాత్ర ప్రచారం ముగియనుంది. బస్సుయాత్రతో కేసిఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఐదు రోజుల పాటు ప్రచారం నిర్వహించి పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో వీణవంకలో ప్రజలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించిన కేసిఆర్, కరీంనగర్, సిరిసిల్లలో రోడో షో తో ప్రచారం సాగించారు.

(రిపోర్టింగ్ కేవీరెడ్డి, కరీంనగర్)

Whats_app_banner

సంబంధిత కథనం