KCR Bus Checking: కేసీఆర్ ఎన్నికల ప్రచార బస్సులో పోలీసుల తనిఖీలు, వాహనాలపై పోలీసుల నిఘా నేత్రం
KCR Bus Checking: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో తనిఖీలు ముమ్మరం చేశారు. బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ బస్సులో సైతం చెక్‌పోస్టులో తనిఖీలు చేపట్టారు.
KCR Bus Checking: పార్లమెంట్ ఎన్నికల వేళ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. నిఘాను పటిష్టం చేసి నిరంతరం తనిఖీలు చేస్తున్నారు. జగిత్యాల నుంచి బస్సు యాత్రతో నిజామాబాద్ కు బయలు దేరిన మాజీ సీఎం బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ బస్సును సైతం అధికారులు తనిఖీ చేశారు.
జగిత్యాల సమీపంలోని చెల్ గల్ చెక్ పోస్ట్ వద్ద కేసిఆర్ బస్సును ఆపిన ఎన్నికల అధికారులు బస్సెక్కి క్షణంగా తినిఖీ చేశారు. ఆ బస్సులో కేసీఆర్ ఉన్నారు. కేసిఆర్ బ్యాగ్ లు బస్సులోని వస్తువులన్ని తనిఖీ చేయగా కేసిఆర్ ఎన్నికల అధికారులకు సహకరించారు. కేసీఆర్ ప్రయాణించే బస్సుతో పాటు.. ఆయన వెంట ఉన్న ఇతర వాహనాలను కూడా చెక్ చేశారు. తనిఖీ అనంతరం బస్సు నిజామాబాద్ కు బయలు దేరింది.
కరీంనగర్‌లో పట్టుబడ్డ నగదు…
ఎన్నికల నేపద్యంలో అక్రమంగా డబ్బులు, మద్యం సరఫరాను అరికట్టేందుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా తనిఖీ చేపట్టారు అధికారులు. కరీంనగర్ నగరంలో వాహనాల తనిఖీల్లో సరైన ఆధారాలు లేకుండ తరలిస్తున్న 5 లక్షల 32 వేల రుపాయలను పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు.
సుభాష్ నగర్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో తీగలగుట్టపల్లికి చెందిన వోడ్నాల రవీందర్ నుంచి 3 లక్షల 32 వేల రుపాయలు, వావిలాలపల్లి వద్ద నిర్వహించిన తనిఖీల్లో గౌతమి నగర్ కు చెందిన పింగిలి విష్ణువర్ధన్ రెడ్డి నుంచి రెండు లక్షల రుపాయలు స్వాదీనం చేసుకుని తదుపరి చర్యలకై సంబంధిత అధికారులకు అప్పగించామని త్రీ టౌన్ సిఐ జాన్ రెడ్డి తెలిపారు.
కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ వ్యాప్తంగా వాహనాల తనిఖీలతోపాటు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఎన్నికల కోడ్ పకడ్బందీగా అమలులో బాగంగా ఓటర్లను ప్రలోభ పెట్టకుండా ఉండేందుకు తనిఖీలు చేపట్టినట్లు సిపి అభిషేక్ మోహంతి తెలిపారు. సరైన అధారులు లేకుండా 50 వేల కంటే ఎక్కువ డబ్బులు వెంట తీసుకెళ్ళవద్దని పోలీసులు కోరారు.
సరైన ఆధారాలు ఉంటే పట్టుబడ్డ డబ్బును వెంటనే ఎన్నికల అధికారులు నిబంధనలకు లోబడి వదిలి పెడుతారని తెలిపారు. పోలింగ్ కు గడువు దగ్గర పడుతుండడంతో తనిఖీలు నిరంతరాయంగా కొనసాగుతాయని ప్రకటించారు. ఎన్నికల నియామవళిని ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.
(రిపోర్టింగ్ కేవీరెడ్డి, కరీంనగర్)
సంబంధిత కథనం