Medak : మెదక్ లో ఒక అభ్యర్థి అనుచరుడి కారులో రూ.88 లక్షలు సీజ్
Medak : తెలంగాణలో లోక్ సభ పోలింగ్ నేపథ్యంలో జోరుగా పంపిణీలు సాగుతున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు భారీగా నగదు, మద్యం పంపిణీ చేస్తున్నారు. అయితే మెదక్ లో ఓ పార్టీకి చెందిన అభ్యర్థి అనుచరుల కారులో రూ.88 లక్షలు సీజ్ చేశారు.
Medak : తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ 24 గంటలు మాత్రమే ఉండటంతో, ఓటర్లను ప్రలోభపెట్టడానికి అభ్యర్థులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రోజు తెల్లవారుజామున, ఒక ప్రధాన పార్టీకి చెందిన అభ్యర్థి అనుచరులు పెద్ద ఎత్తున డబ్బులు దుబ్బాక వైపు కారులో తరలిస్తుండగా, చేగుంట పోలీసులు మాసాయిపేట వద్ద ఆ కారుని చెక్ చేయటంతో అందులో రూ 88.43 లక్షలు పట్టుబడ్డాయి. ఆ డబ్బును 27 చిన్న చిన్న కవర్లలో పెట్టి ఉంచారని పోలీసులు తెలిపారు. అదే అభ్యర్థికి చెందిన మరొక కారు, ఆ కారుని వెనుక నుంచి ఫాలో అవుతుండగా రెండు కార్లను, ఇద్దరు డ్రైవర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు. అయితే, ఆ డబ్బు ఏ పార్టీ అభ్యర్థికి చెందినది అనేది విచారణ తరువాత వెల్లడిస్తామని పోలీసులు ప్రకటించారు.
ఆ కారులో 1 కోటి 10 లక్షలు- బీజేపీ
ఈ సంఘటనపై స్పందించిస్తూ నియోజకవర్గానికి చెందిన బీజేపీ నాయకులు అసలు ఆ కారులో 1 కోటి 10 లక్షలు ఉన్నాయని ఆరోపించారు. మిగతా డబ్బుల వివరాలు పోలీసులు ఎందుకు చెప్పటం లేదో చెప్పాలని, బీజేపీ నాయకులు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. అదే విధంగా, ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా, మూడు ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఓటర్లను ప్రలోభపెట్టడానికి సకల ప్రయత్నాలు చేస్తున్నారు. డబ్బులు, మందు అన్ని కూడా గ్రామా గ్రామానికి ఇప్పటికే చేరుకున్నాయన్నారు. చివరి రోజు, ఓటర్లకు డబ్బులు పంచడం, మందు పంచడం గెలుపు ఓటములను ప్రభావితం చేస్తాయని ఎన్నికల విశ్లేషకులు అంటున్నారు.
ప్రత్యర్థుల డబ్బు, మందు పంపిణీ పైన సమాచారం ఇస్తున్న నాయకులు
అదే విధంగా తమ ప్రత్యర్థి పార్టీ పంపిణీ చేస్తున్న డబ్బులు, మందు వివరాలను మరొక అభ్యర్థి పోలీసులకు అందించిన సంఘటనలు కూడా జరుగుతున్నాయి. నిన్న సాయంత్రం ఒక పార్టీకి చెందిన నాయకులు పటాన్ చెరు అసెంబ్లీ నియోజకవర్గంలోని రామచంద్రపురంలో డబ్బులు పంచుతుండగా మరొక పార్టీ వారు పట్టుకుని, పోలీసులకు సమాచారం అందించారు. రెండు రోజుల క్రితం ఒక పార్టీ వారు డబ్బును తరలిస్తుండుగా, మరొక పార్టీ వారు సమాచారం ఇవ్వటంతో పోలీసులు 6 లక్షలకు పైగా డబ్బును స్వాధీనం చేసుకున్నారు. పోలింగ్ సోమవారం జరగనుండటంతో, మూడు పార్టీల అభ్యర్థులు ప్రత్యర్థి కంటే ఎక్కువ డబ్బులు పంచటంపైన దృష్టి పెట్టారు. మందు పంపిణీకి కూడా అన్ని ఏర్పాట్లు ఇప్పటికే చేసుకున్నారు. ఆ మూడు పార్టీలకు చెందిన నాయకులు ప్రత్యేకంగా నమ్మకం ఉన్న నాయకులతో కలిసి ఎప్పటికప్పుడు డబ్బు పంపిణీ పైన దృష్టి పెట్టారని తెలుస్తుంది.
సంబంధిత కథనం