Karimnagar Politics : పోరు బాటలో ప్రధాన పార్టీలు - వేడెక్కిన ‘కరీంనగర్’ రాజకీయాలు-in the wake of the lok sabha elections three major parties are aggressively advancing in karimnagar ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Karimnagar Politics : పోరు బాటలో ప్రధాన పార్టీలు - వేడెక్కిన ‘కరీంనగర్’ రాజకీయాలు

Karimnagar Politics : పోరు బాటలో ప్రధాన పార్టీలు - వేడెక్కిన ‘కరీంనగర్’ రాజకీయాలు

HT Telugu Desk HT Telugu
Apr 13, 2024 12:58 PM IST

Loksabha Elections in Telangana 2024: లోక్ సభ ఎన్నికల వేళ కరీంనగర్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఓవైపు బీజేపీ, బీఆర్ఎస్ రైతుల వద్దకు వెళ్తుండగా… అధికార పార్టీలోని మంత్రి పొన్నం కూడా దీక్షకు రెడీ అయిపోయారు.

వేడెక్కిన కరీంనగర్ రాజకీయాలు
వేడెక్కిన కరీంనగర్ రాజకీయాలు

Karimnagar Lok Sabha constituency : పార్లమెంట్ ఎన్నికల వేళ కరీంనగర్ రాజకీయాలు(Karimnagar Politics) రక్తికట్టిస్తున్నాయి. వ్యూహ, ప్రతి వ్యూహాలతో ప్రచారాన్ని హోరెత్తించే పనిలో ప్రధాన రాజకీయ పార్టీలు నిమగ్నమయ్యాయి. విమర్శలు, ఆరోపణలు, నిరసన ఆందోళనలతో ప్రజలతో మమేకమయ్యేందుకు కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి పోటీ పడుతున్నాయి. రైతులు, ఓటర్ దేవుళ్ళ చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి. ఎండిన పంటలకు ఎకరాన 20వేల చొప్పున పరిహారం ఇవ్వాలని బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ పొలం బాట (KCR Polam Bata)పట్టగా, ఆ పార్టీ ఎమ్మెల్యేలు నాయకులు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకరోజు రైతుదీక్ష చేశారు. అటు బిజేపి జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సైతం రైతు దీక్ష చేయడమే కాకుండా కల్లాల బాట పట్టారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేసి క్వింటాల్ కు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఆ రెండు పార్టీల వైఖరిని ఎండగడుతూ రాష్ట్ర విభజన హామీలు అమలు చేయడంలో కేంద్ర వైఫల్యాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ దీక్షకు సిద్ధమైంది. ప్రధాన పార్టీలు పోటాపోటీ కార్యక్రమాలతో ప్రజలతో మమేకమయ్యే పనిలో నిమగ్నం కావడంతో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

14న కరీంనగర్ లో మంత్రి పొన్నం దీక్ష..

ఈనెల 14న కరీంనగర్ లోని కాంగ్రెస్ కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ దీక్ష చేపడుతున్నట్లు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. పదేళ్లలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విభజన హామీలను అమలు చేయకుండా కరీంనగర్ కు చేసింది ఏమీ లేదన్నారు. కేంద్రం వైఖరి, బండి సంజయ్ పనితీరును నిరసిస్తూ చేపట్టే దీక్షలో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్చార్జిలు పాల్గొంటారని తెలిపారు. విభజన హామీల్లో కాజీపేట కొచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు పింఛన్లు ఇస్తామన్నారు...ఇచ్చారా..? రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు.. చేశారా?.. దమ్ముంటే కరీంనగర్ చౌరస్తాలో మేనిఫెస్టో పై చర్చకు సిద్ధమా బండి సంజయ్... నీ 10 ఏళ్ళ పాలన పై మా 100 రోజుల ప్రజాపాలన పై ప్రజలే తెలుస్తారని స్పష్టం చేశారు. 14న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా చేపడుతున్న దీక్ష స్పూర్తిగా తెలంగాణలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో కేంద్ర ప్రభుత్వం వైఖరి నిరసిస్తూ దీక్షలు చేయాలని పొన్నం పిలుపునిచ్చారు.

పొన్నం దీక్ష పై బండి సంజయ్ ఫైర్..

14న కరీంనగర్ లో మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) దీక్షపై బిజేపి నేత ఎంపీ బండి సంజయ్ పైర్ అయ్యారు. పొన్నం దీక్ష ఎందుకు?..కాంగ్రెస్ ఇచ్చిన హామీలను విస్మరించినందుకా.. అవినీతికి తావు లేకుండా పదేళ్ళు దేశాన్ని బిజెపి పాలించినందుకా అని ప్రశ్నించారు. పొన్నం దీక్ష చేయాలంటే కాంగ్రెస్ ఇచ్చిన హామీలను విస్మరించినందుకు గాంధీభవన్ ముందు... లేకుంటే పదేళ్లు రాష్ట్రాన్ని పాలించి ప్రజల్ని అరిగోస పెట్టిన కెసిఆర్ ఫామ్ హౌస్ ముందు లేదా తెలంగాణ భవన్ ముందు దీక్ష చేయాలని హితవు పలికారు. 80 కోట్ల మంది పేదలకు మోదీ అన్నం పెడుతున్నందుకా.. కరోనా వ్యాక్సిన్ ఇచ్చినందుకా పొన్నం దీక్ష చేయడమని ప్రశ్నించారు. కేసీఆర్(KCR) పాలనలో అన్ని వర్గాలను దగా చేసినప్పుడు దీక్ష ఎందుకు చేయలేదన్నారు. ఐదేళ్ళలో 12 వేల కోట్ల వ్యయంకాగల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టానని అందుకు సంబంధించిన బుక్ లెట్ ప్రజలకు పంచుతున్నామని తెలిపారు. పొన్నం ప్రభాకర్, బోయినపల్లి వినోద్ కుమార్ ఎంపీలుగా ఉన్న సమయంలో చేయలేని పనులు తీసుకోరానన్ని నిధులు ఐదేళ్లలో తాను తెచ్చానని స్పష్టం చేశారు. వారి హయాంలో జరగలేనంత అభివృద్ధి జరిగినందుకా, లేక 370 ఆర్టికల్, త్రిబుల్ తలాక్ రద్దు చేసినందుకా.. హిందువుల చిరకాల వాంఛ అయోధ్యలో రామ మందిరం నిర్మాణం అయినందుకా.. దేనికోసం పొన్నం దీక్ష చేస్తున్నారని సంజయ్ ప్రశ్నించారు. అభ్యర్ధే దొరకని కాంగ్రెస్, అపర మేధావి కలిసి నన్ను ఓడించేందుకు కుట్ర చేస్తున్నారు బండి సంజయ్ (Bandi Sanjay) ఆరోపించారు.

అందరి లక్ష్యం ఓట్లే…

జెండాలు అజెండాలు..సమస్యలు వేరైనా రాజకీయ పార్టీల లక్ష్యం మాత్రం ఒక్కటే. మే 13న జరిగే ఎంపీ ఎన్నికల్లో ఓట్లు పొంది రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్ బిఆర్ఎస్ బిజెపి నేతలు చూస్తున్నారు. ఎత్తుకు పైఎత్తులతో ఓటర్ల ప్రసన్నం కోసం పడరాని పాట్లు పడుతున్నాయి. అయితే కాంగ్రెస్ ఇప్పటివరకు కరీంనగర్ (Karimnagar)అభ్యర్థిని ఎంపిక చేయకపోవడం ఆ పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం నెలకొంది. అధిష్టానం అభ్యర్థిని ఎంపిక చేయడంలో జాప్యం చేస్తుండడంతో ప్రజలను ఆకట్టుకునేందుకు రాజకీయంగా తాము వెనుకబడి లేమని చాటి చెప్పేందుకే కాంగ్రెస్ దీక్షకు సిద్ధమైందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా మూడు ప్రధాన పార్టీలు ఓటర్ల ప్రసన్న కోసం రోడ్డెక్కడం రాజకీయంగా దుమారం రేపుతుంది.

రిపోర్టింగ్ - HTTelugu Correspondent K.V.REDDY, Karimnagar

Whats_app_banner