YS Vijayamma Supports Sharmila : కడప ఎంపీగా షర్మిలను గెలిపించండి- వైఎస్ విజయమ్మ
YS Vijayamma Supports Sharmila : ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలకు ఆమె తల్లి వైఎస్ విజయమ్మ మద్దతు తెలిపారు. కడప ఎంపీగా గెలిపించాలని విజయమ్మ వీడియో విడుదల చేశారు.
YS Vijayamma Supports Sharmila : ఏపీలో పోలింగ్ సమయం దగ్గర పడుతుండడంతో పార్టీలో టెన్షన్ మొదలైంది. ప్రచారం ముగిసే చివర క్షణం వరకు అవకాశాలను ఉపయోగించుకోవాలని పార్టీలు భావిస్తున్నాయి. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు మద్దతుగా...ఆమె తల్లి విజయమ్మ వీడియో విడుదల చేశారు. కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న షర్మిలను గెలిపించాలని విజయమ్మ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
మీకు సేవ చేసే అవకాశం షర్మిలకు ఇవ్వండి
“వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ప్రేమించే వారికి, అభిమానించే వారికి, యావత్ కడప లోక్ సభ నియోజకవర్గ ప్రజలందరికీ నా విన్నపం. రాజశేఖర్ రెడ్డిని మీరు ఏ విధంగా అభిమానించారో, ఏ విధంగా అక్కున చేర్చుకున్నారో, ఏ విధంగా నిలబెట్టుకున్నారో, ఆయన చివరి శ్వాస వరకు ప్రజాసేవకు అంకితమయ్యారు. ఆయన ముద్దుబిడ్డ కడప పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తుంది. ఆమెను ఆశీర్వదించి పార్లమెంట్ కు పంపమని వేడుకుంటున్నాను. ఆయన లాగా షర్మిల సేవ చేస్తుంది. మీకు సేవ చేసే అవకాశం షర్మిలకు ఇమ్మని మిమ్మలందరినీ ప్రార్థిస్తున్నాను”-వైఎస్ విజయమ్మ
అమ్మ ప్రార్థన, నాన్న ఆశీస్సులు, కడప ప్రజలు నన్ను గెలిపిస్తారనే దృఢమైన విశ్వాసంతో ఉన్నానని వైఎస్ షర్మిల అన్నారు. తనకు మద్దతు తెలిపిన విజయమ్మ వీడియోను షర్మిల ట్వీట్ చేశారు.
కడప తీర్పు చిరస్థాయిగా నిలిచిపోతుంది - సునీతారెడ్డి
ఏపీ ఎన్నికల్లో కడప ప్రజల తీర్పు చిరస్థాయిగా నిలిచిపోతుందని వైఎస్ వివేకా కుమార్తె సునీతారెడ్డి అన్నారు. శనివారం ఆమె కడపలో మీడియాతో మాట్లాడుతూ...తనకు న్యాయం జరగాలని అందరి మనస్సుల్లో ఉందన్నారు. కడపలో హస్తం గుర్తుకు ఓటు వేసి న్యాయాన్ని గెలిపిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నానన్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రజల స్పందన చూసి తాను భావోద్వేగానికి లోనయ్యాయని సునీత గుర్తుచేసుకున్నారు. ప్రజలు తమ మనస్సాక్షి ప్రకారం ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్ విజయమ్మ కూడా న్యాయం వైపే ఉన్నారని, షర్మిలకు మద్దతు తెలిపారన్నారు. పార్టీలకతీతంగా తమకు మద్దతివ్వాలని సునీత విజ్ఞప్తి చేశారు.
సంబంధిత కథనం