YS Sunitha Legal Fight:అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని సుప్రీంని ఆశ్రయించిన సునీతారెడ్డి-mp avinash reddy s sunitha reddy has approached the supreme court to cancel his anticipatory bail ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ys Sunitha Legal Fight:అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని సుప్రీంని ఆశ్రయించిన సునీతారెడ్డి

YS Sunitha Legal Fight:అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని సుప్రీంని ఆశ్రయించిన సునీతారెడ్డి

HT Telugu Desk HT Telugu
Apr 20, 2023 12:47 PM IST

YS Sunitha Legal Fight: వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్‌ రెడ్డికి తెలంగాణ హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ రద్దు చేయాలని వివేకా కుమార్తె సునీతారెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

<p>వైఎస్ సునీతా రెడ్డి(ఫైల్ పొటో)</p>
వైఎస్ సునీతా రెడ్డి(ఫైల్ పొటో)

YS Sunitha Legal Fight: వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో మధ్యంతర బెయిల్ మంజూరు చేయడానికి వ్యతిరేకంగా వివేకా కుమార్తె సునీతారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సునీత పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. చీఫ్‌ జస్టిస్ డివై చంద్రచూడ్ ధర్మాసనం ఎదుట సునీత దాఖలు చేసిన పిటీషన్‌ను సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ లూద్రా ప్రస్తావించారు. పిటిషన్‌ రేపు విచారణకు స్వీకరిస్తామని సిజెఐ డివై చంద్రచూడ్ తెలిపారు.

వివేకా హత్య కేసులో మధ్యంతర బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి, 25వ తేదీ వరకు అరెస్ట్ కాకుండా అవినాష్ రెడ్డి ఉపశమనం పొందారు. ఈ నెల 25వ తేదీ వరకూ అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని హైకోర్టు మధ్యంతర తీర్పు వెలువరించింది. 25వ తేదీన తుది తీర్పు తెలంగాణ హైకోర్టు వెలువరించనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీం కోర్టులో సునీత సవాలు చేశారు.

మరోవైపు వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాశ్‌ రెడ్డిని ఈనెల 25వ తేదీదాకా ప్రతి రోజూ సీబీఐ విచారణకు హాజరు కావాలంటూ హైకోర్టు ఆదేశించింది. దీంతో అవినాశ్ రెడ్డి మధ్యంతర బెయిల్ కు వ్యతిరేకంగా వివేకా కుమార్తె వైఎస్ సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్‌ను సుప్రీం విచారణకు స్వీకరించింది.

హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై వివేకా కుమార్తె సునీతారెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది ఎల్‌.రవిచందర్‌ వాదనలు వినిపించారు. వివేకా హత్యలో అవినాశ్‌ రెడ్డి పాత్ర ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలున్నాయని పేర్కొన్నారు. ‘‘హత్య చేసినట్లుగా ఒప్పుకొంటే కోట్లు ఇస్తామని గంగాధర్‌ రెడ్డికి ఆఫర్‌ ఇచ్చారు. వివేకా గుండెపోటుతో చనిపోయారని అవినాశ్‌ రెడ్డి చెప్పినట్లు అప్పటి సీఐ శంకరయ్య స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. పిటిషనర్‌ ఆధారాలను నాశనం చేశారు. హత్య వెనుక విస్తృత కుట్ర ఉందని స్వయంగా సుప్రీంకోర్టు కూడా గుర్తించింది.

పిటిషనర్‌కు వ్యతిరేకంగా కొలేటరల్‌ ఎవిడెన్స్‌ ఉందని కోర్టులో వివరించారు. అయితే హత్యకు కారణాలను సిబిఐ వివరించకపోవడంతో ముందస్తు బెయిల్ మంజూరైంది. అవినా‌ష్ రెడ్డి గతంలో దాఖలు చేసిన ఒక పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసిందని, సిబిఐ దర్యాప్తు సవ్యంగా సాగుతోందని స్పష్టం చేసిందని రవిచందర్‌ గుర్తు చేశారు. సిబిఐ, సునీతా తరపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేసినా ముందస్తు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ సునీత సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

Whats_app_banner