AP TS Election Campaign : నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం - మే 13న పోలింగ్
Election Campaign in AP Telangana :ఈరోజుతో నాల్గో విడత ఎన్నికల ప్రచారానికి తెర పడనుంది. దీంతో ఏపీ, తెలంగాణలోనూ సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగియనుంది. మే 13వ తేదీన పోలింగ్ జరగనుంది.
Election campaigning Close in Telugu States : ఇవాళ్టితో(మే 11) తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ముగియనుంది. నాల్గో విడత ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. ఈ రోజు సాయంత్రం 5 గంటలతో పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రచారం ముగించాల్సి ఉంటుంది.
ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు…
ఆంధ్రప్రదేశ్ లో చూస్తే మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని ఈసీ వెల్లడించింది. ఇందులో 65,707 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారు. ఏపీలో పోలింగ్ కోసం మొత్తం 46,389 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో కేంద్రంలో 1500 మంది ఓట్లు వేసే అవకాశం ఉంటుంది. ఓటర్ల సంఖ్య అంతకంటే పెరిగినప్పుడు ఆక్సిలరీ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఏపీలో 12,438 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని ఈసీ గుర్తించింది. రాష్ట్రంలో 64 శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ఉండేలా ఈసీ చర్యలు చేపట్టగా…. 14 నియోజకవర్గాల్లో పూర్తిగా వెబ్‍కాస్టింగ్ చేయనుంది. ఇందులో ఆళ్లగడ్డ, తిరుపతి, చంద్రగిరి, పుంగనూరు, పీలేరు, మాచర్ల, గురజాల, వినుకొండ, పెదకూరపాడు, ఒంగోలు, విజయవాడ సెంట్రల్, పలమనేరు, రాయచోటి, తంబళ్లపల్లి నియోజకవర్గాలు ఉన్నాయి.
తెలంగాణలో ఇలా…
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి ఇవాళ సాయంత్రంతో తెర పడనుంది. ఈనెల 13న రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. తెలంగాణలోని 13 నియోజకవర్గాల్లో ఇవాళ సాయంత్రం 4 గంటలకు.. మిగిలిన 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగుస్తుందని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో 25 లోక్‌సభ స్థానాలకు 454 మంది తలపడుతుంటే 175 అసెంబ్లీ స్థానాలకు 2387మంది పోటీలో నిలిచారు.13 న జరుగనున్న ఎన్నికల్లో వీరంతా వివిధ రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్ధులుగా ఎన్నికల్లో పోటీ పడనున్నారు.
అసెంబ్లీ స్థానాలకు సంబందించి అత్యధికంగా 46 మంది అభ్యర్థులు తిరుపతి నియోజక వర్గంలో పోటీ చేస్తున్నారు. అత్యల్పంగా 6గురు అభ్యర్థులు చోడవరం అసెంబ్లీ నియోజక వర్గంలో పోటీపడుతున్నారు.
పార్లమెంటు నియోజక వర్గాలకు సంబంధించి అత్యధికంగా విశాఖ పార్లమెంటు స్థానానికి 33 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. రాజమండ్రిలో అత్యల్పంగా 12 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు.
ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన తెలుగు ప్రజలు పోలింగ్ లో పాల్గొనేందుకు ప్రయాణమవుతున్నారు. తమిళనాడు, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఇప్పటికే ప్రయాణాలు మొదలయ్యాయి.
మే 13 పోలింగ్ తేదీకి ముందే ఏపీలోని తమ గ్రామాలకు వచ్చేందుకు ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రజల ప్రయత్నాలు చేస్తున్నారు. దసరా, సంక్రాంతి పండగల మాదిరిగా బస్ స్టాండ్ లు, రైల్వే స్టేషన్లలో రద్దీ మొదలైంది. ఏపీకి రేపు, ఎల్లుండి ప్రయాణాలకు పెద్ద ఎత్తున రిజర్వేషన్లు బుకింగ్ అయ్యాయి.
ట్రైన్ రిజర్వేషన్ల కోసం ప్రయాణికుల ప్రయత్నాలు చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ కు మంచి స్పందన రాగా…. మే 13వ తేదీన ఓటింగ్ భారీగా పెరిగే అవకాశం ఉందంటుందని అధికారులు భావిస్తున్నారు.
మూడు రోజులు సెలవు కావడంతో చాలా మంది ఓటర్లు సొంత ఊరు వెళ్లి ఓటు వెయ్యాలనే ఆలోచనతో ఉన్నారు. దీంతో సొంత గ్రామాలకు బయల్దేరుతున్నారు. సొంత వాహనాల్లో కూడా చాలా మంది ప్రజలు స్వగ్రామాకు వెళ్తున్నారు. దీంతో ఏపీ వైపు వెళ్లే వాహనాల సంఖ్య భారీగా పెరిగింది. మరోవైపు రోడ్లపై కూడా రద్దీ విపరీతంగా ఉంటోంది.