Yashasvi Jaiswal: రోహిత్ శర్మను దాటేసిన యశస్వి జైస్వాల్-yashasvi jaiswal surpasses rohit sharma in latest icc test batting rank after two double centuries against england ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Yashasvi Jaiswal: రోహిత్ శర్మను దాటేసిన యశస్వి జైస్వాల్

Yashasvi Jaiswal: రోహిత్ శర్మను దాటేసిన యశస్వి జైస్వాల్

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 28, 2024 02:52 PM IST

ICC Rankings - Yashasvi Jaiswal: భీకర ఫామ్‍లో ఉన్న భారత యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్.. టెస్టు ర్యాంకింగ్‍‍ల్లోనూ పైకి దూసుకొస్తున్నాడు. టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్‍ల్లో కెప్టెన్ రోహిత్ శర్మను దాటేశాడు.

Yashasvi Jaiswal: రోహిత్ శర్మను దాటేసిన యశస్వి జైస్వాల్
Yashasvi Jaiswal: రోహిత్ శర్మను దాటేసిన యశస్వి జైస్వాల్ (REUTERS)

Yashasvi Jaiswal - ICC Rankings: ఇంగ్లండ్‍తో స్వదేశంలో జరుగుతున్న టెస్టు సిరీస్‍లో భారత స్టార్ యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ విజృంభిస్తున్నాడు. ఈ సిరీస్‍లోనే ఏకంగా రెండు డబుల్ సెంచరీలు చేసి సత్తాచాటాడు. తన కెరీర్లో 9 టెస్టుల్లోనే 2 ద్విశతకాలతో ఈ 22 ఏళ్ల స్టార్ అదరగొట్టాడు. దీంతో.. ఐసీసీ టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్‍ల్లోనూ యశస్వి జైస్వాల్ దూసుకొచ్చేస్తున్నాడు. తాజాగా వెల్లడించిన ర్యాంకింగ్‍ల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను దాటేసి పైకి వచ్చేశాడు యశస్వి.

ఇంగ్లండ్‍తో సిరీస్‍లో అద్భుత ప్రదర్శన చేసిన యశస్వి జైస్వాల్.. ఐసీసీ టెస్టు బ్యాటింగ్ ర్యాంకుల్లో మూడు స్థానాలను మెరుగుపరుచుకొని 12వ ర్యాంకుకు చేరుకున్నాడు. 727 రేటింగ్ పాయింట్లతో పైకి వచ్చేశాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ (720 పాయింట్లు) ఓ ర్యాంకు పడిపోయి 13వ స్థానానికి చేరుకున్నాడు. రోహిత్ స్థానానికి యశస్వి జైస్వాల్ ఎగబాకాడు.

కోహ్లీ ర్యాంక్ డౌన్.. అయినా టాప్-10లోనే..

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇంగ్లండ్‍తో టెస్టు సిరీస్‍కు దూరమయ్యాడు. రెండో సంతానాన్ని పొందుతుండటంతో అతడు ఈ సిరీస్‍ నుంచి తప్పుకున్నాడు. దీంతో టెస్టు బ్యాటింగ్ ర్యాంకుల్లో రెండో స్థానాలు పడిపోయాడు. ప్రస్తుతం 9వ ర్యాంకుకు కోహ్లీకి చేరుకున్నాడు. టెస్టు బ్యాటింగ్ ర్యాంకుల్లో టాప్-10లో కోహ్లీ ఒక్కడే ఉన్నాడు. ఆ తర్వాత భారత్ నుంచి బెస్ట్ ర్యాంక్ యశస్వి జైస్వాల్‍దే.

దూసుకొచ్చిన జురెల్

తన అరంగేట్ర సిరీస్‍లోనే అదరగొడుతున్న భారత వికెట్ కీపర్ బ్యాటర్ ధృవ్ జురెల్ కూడా ఐసీసీ టెస్టు బ్యాటింగ్ ర్యాంకుల్లో దూసుకొచ్చేశాడు. రాంచీలో జరిగిన నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 90 పరుగులు చేసి భారత్‍ను ఆదుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో అజేయంగా 39 రన్స్ చేసి టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించాడు. దీంతో ర్యాంకింగ్‍ల్లో 31 స్థానాలు ఎగబాకి జురెల్ 69వ ర్యాంకుకు చేరుకున్నాడు. తన కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించాడు. భారత ఓపెనర్ శుభ్‍మన్ గిల్ నాలుగు స్థానాలు మెరుగుపరుచుకొని 31వ ర్యాంకుకు వచ్చాడు.

రూట్ మూడో ప్లేస్‍కు..

టెస్టు బ్యాటింగ్ ర్యాంకుల్లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (893 పాయింట్లు) అగ్రస్థానంలో కొనసాగాడు. ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ స్మిత్ రెండో స్థానంలో ఉన్నాడు. భారత్‍తో నాలుగో టెస్టులో సెంచరీ చేసిన ఇంగ్లండ్ సీనియర్ జో రూట్ ఓ స్థానాన్ని మెరుగుపరుచుకొని మూడో ర్యాంకుకు ఎగబాకాడు. డారిల్ మిచెల్, బాబర్ ఆజమ్ నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు.

టెస్టు బౌలింగ్‍ ర్యాంకుల్లో భారత స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా ఫస్ట్ ర్యాంకులో ఉండగా.. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రెండో స్థానంలో కొనసాగాడు. కగిసో రబాడా, ప్యాట్ కమిన్స్, జోస్ హాజిల్‍వుడ్ మూడు, నాలుగు, ఐదో స్థానాల్లో కంటిన్యూ అయ్యారు. టెస్టు ఆల్ రౌండ్ ర్యాంకింగ్‍ల్లో భారత స్టార్ రవీంద్ర జడేజానే టాప్‍లో ఉన్నాడు. టెస్టు టీమ్ ర్యాంకింగ్‍ల్లో ఆస్ట్రేలియా టాప్‍లో ఉంటే.. రెండో స్థానంలో భారత్ ఉంది.

కాగా, ఇంగ్లండ్‍పై ఐదు టెస్టుల సిరీస్‍లో భారత్ 3-1తో ఆధిక్యం సాధించింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది. టీమిండియా, ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్టు ధర్మశాల వేదికగా మార్చి 7వ తేదీన ప్రారంభం కానుంది.

IPL_Entry_Point