IND vs NZ Trolls: టీమిండియాని ఏకిపారేస్తున్న నెటిజన్లు.. కోహ్లీ, రోహిత్, గంభీర్‌పై సెటైర్ల వర్షం
IND vs NZ 3rd Test Memes: న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఘోరంగా విఫలమయ్యారు. దాంతో ఈ ఇద్దరితో పాటు హెడ్ కోచ్ గంభీర్‌ని కూడా కలిపి టీమిండియా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఉతికారేస్తున్నారు.
భారత్ గడ్డపై 24 ఏళ్ల తర్వాత టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కి గురైన టీమిండియాని నెటిజన్లు సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు. ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా ఆదివారం ముగిసిన మూడో టెస్టులో కేవలం 147 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక.. భారత్ జట్టు 121 పరుగులకే ఆలౌటైంది. దాంతో మూడు టెస్టుల సిరీస్‌ని 3-0తో న్యూజిలాండ్ దక్కించుకుంది.
వికటించిన ప్రయోగాలు
న్యూజిలాండ్‌తో సిరీస్ ఆరంభం నుంచి భారత్ జట్టు వరుసగా తప్పులు చేస్తూనే ఉంది. బెంగళూరు టెస్టులో పేస్ పిచ్‌తో ప్రయోగం చేసి చతికిలపడింది. ఆ తర్వాత పుణె టెస్టులో స్పిన్ పిచ్‌తో ఉచ్చుని బిగించబోయి తానే చిక్కుకుంది. ఇక వాంఖడేలో ఆఖరి టెస్టులోనూ స్పిన్‌తో పడగొట్టబోయి భారత్ జట్టే బోల్తా కొట్టింది. ఈ మూడు టెస్టు ఓటములకి కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ని బాధ్యుడ్ని చేస్తున్న టీమిండియా అభిమానులు.. వెంటనే అతడ్ని బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
రోహిత్ చెత్త ప్రదర్శన
న్యూజిలాండ్‌తో సిరీస్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఘోరంగా విఫలమయ్యారు. కనీసం ఒక్క ఇన్నింగ్స్‌లో కూడా సాధికార ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. వన్డే, టీ20 తరహాలో షాట్స్ కోసం వెళ్లి అత్యంత పేలవంగా వికెట్ చేజార్చుకున్నాడు. ఈరోజు 147 పరుగుల ఛేదనలోనూ షార్ట్ పిచ్ బాల్‌కి నిర్లక్ష్యంగా సిక్స్ కొట్టబోయి ఔటయ్యాడు. దాంతో రోహిత్ శర్మ ఇక టెస్టులకి రిటైర్మెంట్‌కి ప్రకటించాలని భారత్ జట్టు ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.
కోహ్లీకి ఏమైంది?
న్యూజిలాండ్‌తో సిరీస్‌లో విరాట్ కోహ్లీ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. భారీ అంచనాల మధ్య సిరీస్‌లోకి అడుగుపెట్టిన కోహ్లీ పుల్ టాస్ బాల్‌కి ఔటవడం.. లేని పరుగు కోసం ప్రయత్నిస్తూ సిల్లీగా రనౌట్ అవ్వడం ఇలా ఒక్కటేమిటి.. సిరీస్‌లో ఆరు ఇన్నింగ్స్‌ల్లోనూ కోహ్లీ అత్యంత పేలవంగా వికెట్ చేజార్చుకున్నాడు. దాంతో కోహ్లీపై నెటిజన్లు మండిపడుతున్నారు.
గంభీర్ కంటే రవిశాస్త్రి బెటరట
భారత్ జట్టుకి గత 12 ఏళ్లుగా టెస్టు సిరీస్‌లో ఓటమి లేదు. మాజీ హెడ్ కోచ్‌లు రవిశాస్త్రి, రాహుల్ ద్రవిడ్.. భారత్ గడ్డపైకి ఏ జట్టు వచ్చినా ఓటమి రుచి చూపి పంపేలా జట్టుని సిద్ధం చేశారు. కానీ.. గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో మాత్రం టీమిండియా వరుసగా మూడు టెస్టుల్లోనూ ఓడిపోయింది. దాంతో గంభీర్ కంటే రవిశాస్త్రి చాలా బెటర్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
పరువు నిలిపిన పంత్
న్యూజిలాండ్‌తో ఈ సిరీస్‌లో రిషబ్ పంత్ తన పోరాట పటిమతో ఆకట్టుకున్నాడు. గాయం వేధిస్తున్నా బ్యాటింగ్, వికెట్ కీపింగ్‌లో పంత్ సత్తాచాటి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ఈరోజు ఛేదనలోనూ ఒంటరి పోరాటం చేసి 64 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కానీ.. వివాదాస్పదరీతిలో క్యాచ్ ఔట్ అయ్యాడు. దాంతో థర్డ్ అంపైర్‌పై కూడా నెటిజన్లు మండిపడుతున్నారు.
భారత్ జట్టు నవంబరు 22 నుంచి ఆస్ట్రేలియా గడ్డపైకి వెళ్లనుంది. అక్కడ బోర్డర్ -గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులను కంగారూలతో ఆడనుంది. అయితే.. ఈ సిరీస్ ఓటమి.. ఆ టూర్‌పై తీవ్రంగా పడే ప్రమాదం ఉంది.