Gautam Gambhir: హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ని వెంటాడిన బ్యాడ్ లక్, 12 ఏళ్ల క్రితం సంగతిని తెరపైకి తెచ్చిన నెటిజన్లు
Team India Records: భారత్ గడ్డపై టీమిండియా 4,332 రోజుల పాటు టెస్టు సిరీస్‌లో ఓడిందే లేదు. అయితే.. చివరిగా భారత్ జట్టు టెస్టు సిరీస్ ఓడిపోయినప్పుడు జట్టులో ఉన్న గంభీర్.. ఇప్పుడు కూడా టీమ్‌తోనే ఉన్నాడు.
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై భారత్ అభిమానులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. న్యూజిలాండ్ చేతిలో వరుసగా రెండు టెస్టుల్లోనూ ఓడిపోయిన భారత్ జట్టు.. 12 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై టెస్టు సిరీస్‌ని చేజార్చుకుంది. దానికి కారణం గౌతమ్ గంభీర్ అనాలోచిత నిర్ణయాలేనని అభిప్రాయపడుతున్న అభిమానులు.. 12 ఏళ్ల క్రితం భారత్ జట్టు ఆఖరిగా టెస్టు సిరీస్ ఓడిపోయినప్పుడు కూడా గంభీర్ టీమ్‌లో ఉన్నాడని గుర్తు చేసుకుంటున్నారు.
12 ఏళ్లు జైత్రయాత్ర
2012-13లో భారత్ గడ్డపై ఇంగ్లాండ్ టీమ్‌కి టెస్టు సిరీస్‌ని చేజార్చుకున్న టీమిండియా.. ఆ తర్వాత ఈ 12 ఏళ్లల్లో వరుసగా 18 టెస్టు సిరీస్‌లు గెలిచి జైత్రయాత్ర సాగించింది. ఒక విధంగా చెప్పాలంటే సొంతగడ్డపై ఏకంగా 4,332 రోజుల అప్రతిహాతంగా భారత్ జట్టు వరుసగా 18 సిరీస్‌లు గెలిచి రికార్డు సృష్టించింది. క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు భారత్ మినహా మరే జట్టు కూడా ఈ ఘనత సాధించలేకపోయింది.
భారత్ జట్టు చివరి సారిగా స్వదేశంలో టెస్టు సిరీస్ కోల్పోయినప్పుడు గౌతమ్ గంభీర్ ఆ జట్టులో సభ్యుడిగా ఉండగా, ఇప్పుడు అదే గంభీర్ టీమిండియాకి హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. అప్పట్లో ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ఆడిన ప్లేయర్లలో కేవలం ఇద్దరు మాత్రమే ప్రస్తుతం భారత్ టెస్టు జట్టులో ఉన్నారు. వారే.. రవిచంద్రన్ అశ్విన్, విరాట్ కోహ్లీ. మిగిలిన వాళ్లందరూ రిటైరైపోవడం లేదా భారత్ జట్టుకి దూరమైపోయారు.
బంగ్లాపై హిట్, కివీస్‌పై డిజాస్టర్
వాస్తవానికి హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ గంభీర్.. ఇటీవల బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో తన వ్యూహాలను చక్కగానే అమలు చేశాడు. ఆ సిరీస్‌లో కచ్చితంగా డ్రా అవుతుంది అనుకున్న మ్యాచ్‌ని సైతం భారత్ జట్టు తన దూకుడుతో విజయంగా మలుచుకుంది. అలానే బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లోనూ తిరుగులేని విజయాల్ని అందుకుంది. అయితే.. న్యూజిలాండ్ టీమ్‌పై వచ్చేసరికి అన్నీ రివర్స్ అయ్యాయి.
బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో గత వారం ముగిసిన తొలి టెస్టు మ్యాచ్‌లో పేస్‌కి అనుకూలించే పిచ్‌ను గౌతమ్ గంభీర్ తయారు చేయించాడు. దాంతో తమకి స్వదేశం లాంటి పిచ్ దొరకడంతో న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్లు వికెట్ల పండగ చేసుకున్నారు. దెబ్బకి టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే ఆలౌటై.. చివరికి మ్యాచ్‌ని కూడా చేజార్చుకుంది. ఆ మ్యాచ్‌లో భారత్ జట్టు టాస్ గెలిచినా.. ఉపయోగం లేకపోయింది.
స్పిన్ ఉచ్చు పన్ని.. చివరికి చిక్కి
బెంగళూరు టెస్టులో ప్లాన్ బెడిసికొట్టడంతో.. పుణె టెస్టుకి ప్లాన్ మార్చి స్పిన్ పిచ్‌ను సిద్ధం చేయించాడు. అయితే.. ఇక్కడా పరిస్థితులు కలిసి రాలేదు. న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ ఏకంగా 13 వికెట్లు పడగొట్టగా.. భారత్ బ్యాటర్లు స్పిన్‌ను ఎదుర్కోలేక వరుసగా వికెట్లు చేజార్చుకున్నారు. దెబ్బకి భారత్ జట్టుకి 113 పరుగల తేడాతో ఓటమి తప్పలేదు.
న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల్లో ఓటమి తర్వాత గంభీర్‌పై ఒత్తిడి పతాక స్థాయికి చేరిపోయింది. ఇక నవంబరు 1 నుంచి ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా మూడో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే మూడు టెస్టుల సిరీస్‌ని 0-2తో చేజార్చుకున్న టీమిండియా.. ఆఖరి టెస్టులో ఎలాంటి వ్యూహంతో బరిలోకి దిగుతుందో చూడాలి.