Virat Kohli Angry:పుణె టెస్టులో ఔటైన కోపంలో వెళ్లి వాటర్ బాక్స్‌ని కొట్టిన విరాట్ కోహ్లీ, ఆలస్యంగా వీడియో బయటికి-former indian skipper virat kohli bursts anger on water box after getting out in 2nd test against new zealand ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Virat Kohli Angry:పుణె టెస్టులో ఔటైన కోపంలో వెళ్లి వాటర్ బాక్స్‌ని కొట్టిన విరాట్ కోహ్లీ, ఆలస్యంగా వీడియో బయటికి

Virat Kohli Angry:పుణె టెస్టులో ఔటైన కోపంలో వెళ్లి వాటర్ బాక్స్‌ని కొట్టిన విరాట్ కోహ్లీ, ఆలస్యంగా వీడియో బయటికి

Galeti Rajendra HT Telugu
Oct 27, 2024 05:32 AM IST

పుణె టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఒకే బౌలర్‌కి వికెట్ సమర్పించుకున్న విరాట్ కోహ్లీ సహనం కోల్పోయాడు. ఫీల్డ్ అంపైర్‌పై కోప్పడి.. అదే కోపంలో పెవిలియన్‌కి వెళ్తూ వాటర్‌ బాక్స్‌ను బ్యాట్‌తో గట్టిగా కొట్టాడు.

విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లీ

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అంచనాల్ని అందుకోలేకపోతున్నాడు. సిరీస్‌లో ఇప్పటికే బెంగళూరు, పుణెలో టెస్టులు ముగియగా రెండింటిలోనూ కీలక సమయంలో పేలవంగా విరాట్ కోహ్లీ వికెట్ చేజార్చుకున్నాడు. శనివారం పుణె టెస్టులో ఔటైన తర్వాత పెవిలియన్‌కి కోపంగా వెళ్తున్న విరాట్ కోహ్లీ అక్కడే ఉన్న వాటర్ బాటిల్స్ పెట్టే బాక్స్‌ని బ్యాట్‌తో గట్టిగా కొట్టాడు.

పుణెలో జరిగిన ఈ రెండో టెస్టులో భారత్‌పై 113 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించి.. మూడు టెస్టుల సిరీస్‌ని 2-0తో చేజిక్కించుకుంది. ఆరు దశాబ్దాల చరిత్రలో భారత్ గడ్డపై న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌ గెలవడం ఇదే తొలిసారి.

359 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన భారత్ జట్టు 245 పరుగులకే కుప్పకూలిపోయింది. విరాట్ కోహ్లీ 40 బంతుల్లో 17 పరుగులు చేసి మిచెల్ శాంట్నర్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. ఇదే శాంట్నర్‌కి తొలి ఇన్నింగ్స్‌లోనూ విరాట్ కోహ్లీ ఒక్క పరుగు వద్దే వికెట్ చేజార్చుకోవడం గమనార్హం.

 

మిచెల్ శాంట్నర్ విసిరిన లెంగ్త్ బాల్‌ని బ్యాక్‌ఫుట్‌పైకి వెళ్లి ఆడేందుకు విరాట్ కోహ్లీ ప్రయత్నించాడు. కానీ బ్యాట్‌కి దొరకని బంతి నేరుగా వెళ్లి ఫ్యాడ్‌ని తాకింది. దాంతో ఎల్బీడబ్ల్యూ కోసం న్యూజిలాండ్ అప్పీల్ చేయగా.. అంపైర్ వేలెత్తేశాడు. దాంతో విరాట్ కోహ్లీ డీఆర్‌ఎస్ కోరాడు. కానీ.. రీప్లేలో బంతి లెగ్ స్టంప్‌ను కొద్దిగా మాత్రమే తాకేలా వెళ్తున్నట్లు కనిపిస్తూ.. అంపైర్స్ కాల్‌‌గా పడింది. దాంతో విరాట్ కోహ్లీ పెవిలియన్‌ వెళ్లక తప్పలేదు.

బంతి లెగ్ స్టంప్‌కి కాస్త దూరంగా వెళ్తున్నట్లు కనిపించినా.. ఔట్ ఇచ్చినందుకు మైదానంలోనే ఫీల్డ్ అంపైర్ రిచర్డ్ ఇల్లింగ్ వర్త్‌పై విరాట్ కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ కోపంలోనే పెవిలియన్‌కి వెళ్తూ అక్కడ ఉన్న వాటర్ బాక్స్‌ను గట్టిగా బ్యాట్ కొట్టాడు. ఆ దృశ్యాన్ని వీడియో తీసిన ఓ అభిమాని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది వైరల్‌గా మారిపోయింది.

పుణె టెస్టులో విరాట్ కోహ్లీని రెండు సార్లు ఔట్ చేసిన మిచెల్ శాంట్నర్ .. తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. వాస్తవానికి బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టులో అతడ్ని ఆడించలేదు. కానీ.. రెండో టెస్టులో ఛాన్స్ దక్కగానే ఒంటిచేత్తో న్యూజిలాండ్ టీమ్‌కు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు.

కోహ్లీ కోపం కొత్తేమీ కాదు

వాస్తవానికి విరాట్ కోహ్లీ ఇలా సహనం కోల్పోవడం ఇదేమీ తొలిసారి కాదు. గతంలోనూ చాలా సందర్భాల్లో మైదానంలో ప్రత్యర్థి ఆటగాళ్లతో గొడవ పడిన వివాదాలు ఉన్నాయి. అలానే బౌండరీ రోప్‌ను బ్యాట్‌తో కొట్టడం, పెవిలియన్‌లో కుర్చీని కొట్టడం లాంటివి చేసి క్రమశిక్షణ చర్యలను ఎదుర్కొన్నాడు. గత కొంతకాలంగా టెస్టుల్లో సెంచరీ కోసం నిరీక్షిస్తున్న కోహ్లీ పుణె టెస్టులో ఒకే బౌలర్‌కి రెండు సార్లు వికెట్ ఇచ్చేయడంతో అసహనం మరింత పెరిగినట్లు కనిపించింది.

నవంబరు 1 నుంచి ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా భారత్ జట్టు ఆఖరి టెస్టు మ్యాచ్‌ను ఆడనుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకి ఐదు టెస్టుల సిరీస్‌ కోసం వెళ్లనుంది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ కనీసం వాంఖడేలోనైనా ఫామ్ అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.

Whats_app_banner