Sunil Gavaskar Virat Kohli: విరాట్ కోహ్లీపై మళ్లీ అక్కసు వెళ్లగక్కిన గవాస్కర్.. స్టార్ స్పోర్ట్స్‌పై ఆగ్రహం-sunil gavaskar slams star sports broadcasters over repeatedly playing virat kohli interview about his strike rate ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Sunil Gavaskar Virat Kohli: విరాట్ కోహ్లీపై మళ్లీ అక్కసు వెళ్లగక్కిన గవాస్కర్.. స్టార్ స్పోర్ట్స్‌పై ఆగ్రహం

Sunil Gavaskar Virat Kohli: విరాట్ కోహ్లీపై మళ్లీ అక్కసు వెళ్లగక్కిన గవాస్కర్.. స్టార్ స్పోర్ట్స్‌పై ఆగ్రహం

Sanjiv Kumar HT Telugu
May 05, 2024 11:37 AM IST

Sunil Gavaskar Slams Star Sports About Virat Kohli: ప్రస్తుతం ఐపీఎల్ 2024 సీజన్‌లో క్రికెట్ నిపుణుడిగా పనిచేస్తున్న భారత మాజీ కెప్టెన్, క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ శనివారం మే 4న స్టార్ స్పోర్ట్స్‌పై తీవ్ర విమర్శలు గుప్పించాడు. మరోసారి విరాట్‌పై తన అక్కసు వెళ్లగక్కాడు.

విరాట్ కోహ్లీపై మళ్లీ అక్కసు వెళ్లగక్కిన గవాస్కర్.. స్టార్ స్పోర్ట్స్‌పై ఆగ్రహం
విరాట్ కోహ్లీపై మళ్లీ అక్కసు వెళ్లగక్కిన గవాస్కర్.. స్టార్ స్పోర్ట్స్‌పై ఆగ్రహం

Sunil Gavaskar Virat Kohli Star Sports: భారత మాజీ కెప్టెన్, క్రికెట్ లెజెండ్ సనీల్ గవాస్కర్ శనివారం (మే 4) నాడు స్టార్ స్పోర్ట్స్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2024 సీజన్‌లో క్రికెట్ నిపుణుడిగా పనిచేస్తున్న గవాస్కర్ ఒక్కసారిగా స్టార్ స్పోర్ట్స్‌పై విరుచుకుపడ్డాడు. అందుకు కారణం మ్యాచ్ మధ్యలో అరడజను సార్లు విరాట్ కోహ్లీ ఇంటర్వ్యూ వీడియోను స్టార్ స్పోర్ట్స్ ప్లే చేయడమే.

టీ20 ప్రపంచకప్ కోసం భారత క్రికెటర్స్ సన్నద్ధం అవుతున్న తరుణంలో స్పిన్నర్లపై కోహ్లీ స్ట్రైక్ రేట్ వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. టీ20 వరల్డ్ కప్ కోసం తనకు ఇష్టమైన భారత జట్టు నుంచి కోహ్లీని తప్పించడంపై అభిమానులు, నిపుణుల నుంచి సైతం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమకు నచ్చిన క్రికెటర్లపై అభిమానం చూపిస్తూ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని గవాస్కర్‌పై కోహ్లీ అభిమానులు ఫైర్ అవుతున్నారు.

అయితే, గత వారం అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 44 బంతుల్లో కేవలం 70 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. అలా స్పిన్నర్లు వేసిన బాల్స్‌కి 179 స్ట్రైక్ రేట్‌తో 61 పరుగులు చేశాడు విరాట్. దాంతో విరాట్ స్ట్రైక్ రేట్‌పై సునీల్ గవాస్కర్ పలు విమర్శలు చేశాడు. కేవలం తన వ్యక్తిగత స్కోర్ నిలబెట్టుకునేందుకు అతి నెమ్మదిగా పరుగులు చేశాడంటూ ఫైర్ అయ్యాడు.

ఈ విషయంపై విరాట్ కోహ్లీ ఇన్ డైరెక్ట్‌గా స్పందిస్తూ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. "నా స్ట్రైక్ రేట్ గురించి, నేను స్పిన్ బాగా ఆడకపోవడం గురించి మాట్లాడే వారందరూ దాని గురించి మాట్లాడటానికి ఇష్టపడతారు. కానీ, నా దృష్టిలో జట్టుకు మ్యాచ్ గెలవడమే ముఖ్యం" అని విరాట్ కోహ్లీ ఇంటర్వ్యూలో చెప్పాడు.

అయితే, ఈ ఇంటర్వ్యూ వీడియోను శనివారం జీటీతో ఆర్సీబీమ్యాచ్ ప్రారంభానికి ముందు స్టార్ స్పోర్ట్స్ పదేపదే ప్లే చేసింది. ఇది చూసి విసుగు చెందిన గవాస్కర్ స్టార్ స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టర్స్‌పై విరుచుకుపడ్డారు. అలా చేయడంతో వారు తమ సొంత కామెంటరీ టీమ్‌ను విమర్శిస్తున్నారని ఫైర్ అయ్యారు.

గతంలో కూడా ఈ ఛానల్‌లో పోస్ట్ గేమ్ ఇంటర్వ్యూను ప్రసారం చేశారని, ప్రస్తుతం ఈ ప్రత్యేక కార్యక్రమంలో అరడజను సార్లు చూపించారని ఆయన అన్నారు. అది చూపిస్తూ విమర్శకులు ఎక్కడున్నారని బ్రాడ్ కాస్టర్స్ అడిగితే కామెంటేటర్లే విమర్శకులు అవ్వాల్సి వస్తుందని, మీ స్టార్ స్పోర్ట్స్ కామెంటేటర్స్ కూడా ప్రశ్నలు అడిగేవాళ్లను మర్చిపోకూడదని గవాస్కర్ చెప్పుకొచ్చారు.

స్పిన్నర్లపై స్ట్రైక్ రేట్ ప్రస్తుత సంఖ్య కంటే తక్కువగా ఉందని కోహ్లీపై తాను చేసిన విమర్శలను ఈ లెజెండరీ బ్యాట్స్ మన్ సమర్థించుకున్నాడు. కామెంటేటర్లకు ఆటగాళ్లపై వ్యక్తిగత అజెండాలు లేవని, వారు చేసేవన్నీ పనిలో భాగమేనని ఆయన అన్నారు.

"118 స్ట్రైక్ రేట్ ఉంటే మొదటి బంతిని ఎదుర్కొని, ఆ తర్వాత 14 లేదా 15వ ఓవర్‌లో అవుట్ అవుతాడు. అప్పుడు కూడా మీ స్ట్రైక్ రేట్ 118 అని, అందుకు క్లాప్స్ కొట్టాలనుకోవడం కాస్త భిన్నంగా ఉంటుంది. కానీ స్టార్ స్పోర్ట్స్ తమ కామెంటేటర్లను కించపరిచే విధంగా చూపించడం మంచి విషయం కాదు. కాబట్టి స్టార్ స్పోర్ట్స్ వారు దానిని అవసరానికి మించి చూపించారని, దీన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి" అని సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చారు.

"మేమందరం కొంత క్రికెట్ ఆడాం. ఎక్కువగా క్రికెట్ ఆడలేదు. కానీ మేము చూసే దాని గురించి మాట్లాడతాము. మాకు పనిగట్టుకునే ఇష్టాయిష్టాలు ఉండవు. ఒకవేళ ఉన్నా జరిగేదాని గురించే మాట్లాడుకుంటాం. ఏం జరుగుతోందో మాట్లాడుకుంటాం. కాబట్టి, స్టార్ స్పోర్ట్స్ దీనిని మరోసారి చూపిస్తే నేను చాలా నిరాశ చెందుతాను. ఎందుకంటే ఇది మా కామెంటేటర్లందరినీ ప్రశ్నిస్తుంది" అని సునీల్ అన్నారు.

ఇలా విరాట్‌పై ఇప్పటికీ పలు మార్లు విమర్శలు చేసిన సునీల్ మరోసారి అక్కసు వెళ్లగక్కాడని అభిమానులు, నెటిజన్స్ అనుకుంటున్నారు.

Whats_app_banner