Shubman Gill No.1: శుభ్‌మన్ గిల్ వరల్డ్ నంబర్ 1.. బాబర్ వెనక్కి.. సచిన్ టెండూల్కర్ రికార్డు బ్రేక్-shubman gill number 1 in latest odi rankings breaks sachin tendulkar record ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Shubman Gill No.1: శుభ్‌మన్ గిల్ వరల్డ్ నంబర్ 1.. బాబర్ వెనక్కి.. సచిన్ టెండూల్కర్ రికార్డు బ్రేక్

Shubman Gill No.1: శుభ్‌మన్ గిల్ వరల్డ్ నంబర్ 1.. బాబర్ వెనక్కి.. సచిన్ టెండూల్కర్ రికార్డు బ్రేక్

Hari Prasad S HT Telugu
Nov 08, 2023 02:14 PM IST

Shubman Gill No.1: శుభ్‌మన్ గిల్ వరల్డ్ నంబర్ 1 ర్యాంక్ సొంతం చేసుకున్నాడు. తాజా వన్డే ర్యాంకుల్లో బాబర్ ఆజంను వెనక్కి నెట్టడంతోపాటు సచిన్ టెండూల్కర్ రికార్డు బ్రేక్ చేయడం విశేషం.

వన్డేల్లో నంబర్ వన్ ర్యాంకు అందుకున్న అత్యంత పిన్న వయసు ఇండియన్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్
వన్డేల్లో నంబర్ వన్ ర్యాంకు అందుకున్న అత్యంత పిన్న వయసు ఇండియన్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్ (BCCI Twitter)

Shubman Gill No.1: టీమిండియా స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ వన్డేల్లో నంబర్ వన్ ర్యాంకు సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో ఇండియా తరఫున అత్యంత పిన్న వయసులో నంబర్ వన్ ర్యాంక్ సొంతం చేసుకున్న బ్యాటర్ గా చరిత్ర సృష్టించాడు. గతంలో ఈ రికార్డు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉండగా.. దానిని గిల్ బ్రేక్ చేశాడు. ఇక సచిన్, ధోనీ, కోహ్లి తర్వాత వన్డేల్లో నంబర్ వన్ అయిన ఇండియన్ గా కూడా నిలిచాడు.

బుధవారం (నవంబర్ 8) ఐసీసీ రిలీజ్ చేసిన వన్డే ర్యాంకుల్లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజంను వెనక్కి నెట్టి శుభ్‌మన్ గిల్ నంబర్ వన్ ర్యాంక్ సాధించడం విశేషం. గిల్ ప్రస్తుతం 830 రేటింగ్ పాయింట్లతో నంబర్ వన్ గా నిలవగా.. బాబర్ 824 పాయింట్లతో రెండోస్థానానికి పడిపోయాడు. వరల్డ్ కప్ 2023లో శ్రీలంకతో మ్యాచ్ లో 92 రన్స్ చేసిన తర్వాత రెండో ర్యాంక్ లో ఉన్న గిల్.. టాప్ లోకి దూసుకెళ్లాడు.

ఈ మ్యాచ్ లో టీమిండియా ఏకంగా 302 పరుగులతో గెలిచిన విషయం తెలిసిందే. 24 ఏళ్ల రెండు నెలల వయసున్న గిల్.. ఇండియా తరఫున వన్డేల్లో నంబర్ వన్ ర్యాంక్ అందుకున్న అత్యంత పిన్న వయసు ప్లేయర్ గా నిలిచాడు. చాలా రోజులుగా బాబర్ తర్వాత రెండో స్థానంలో ఉన్న గిల్.. మొత్తానికి వరల్డ్ కప్ జరుగుతున్న సమయంలోనే ఈ ఘనత అందుకున్నాడు.

ఈ ఏడాది టాప్ ఫామ్ లో ఉన్న గిల్.. వరల్డ్ కప్ 2023లో తన స్థాయికి తగిన ఆట ఆడకపోయినా నిలకడగా రాణిస్తున్నాడు. మొదట్లో డెంగ్యూతో బాధపడినా కోలుకున్న తర్వాత మళ్లీ టీమ్ విజయాల్లో కీలకంగా మారాడు. ఇక తాజా ర్యాంకుల్లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికూడా 770 పాయింట్లతో నాలుగో ర్యాంకులోకి దూసుకొచ్చాడు.

ఈ మెగా టోర్నీలో టాప్ ఫామ్ లో ఉన్న కోహ్లి.. ఇప్పటికే రెండు సెంచరీలు చేశాడు. ఇక ఈ టోర్నీలో టాప్ స్కోరర్ గా డికాక్ తాజా ర్యాంకుల్లో మూడోస్థానంలో ఉన్నాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 739 పాయింట్లతో ఆరో స్థానానికి ఎగబాకాడు. బౌలర్లలో సిరాజ్ నంబర్ వన్ ర్యాంకు తిరిగి పొందగా.. రెండో స్థానంలో సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్ ఉన్నాడు.

Whats_app_banner