Rishabh Pant: రిషబ్ పంతే కెప్టెన్.. అధికారికంగా ప్రకటించిన ఢిల్లీ క్యాపిటల్స్: వివరాలివే-rishabh pant set to lead delhi capitals in ipl 2024 franchise announced officially dc updates cricket news ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Rishabh Pant: రిషబ్ పంతే కెప్టెన్.. అధికారికంగా ప్రకటించిన ఢిల్లీ క్యాపిటల్స్: వివరాలివే

Rishabh Pant: రిషబ్ పంతే కెప్టెన్.. అధికారికంగా ప్రకటించిన ఢిల్లీ క్యాపిటల్స్: వివరాలివే

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 20, 2024 12:16 AM IST

Rishabh Pant - Delhi Capitals: ఐపీఎల్ 2024 సీజన్‍లో తమ జట్టుకు కెప్టెన్‍గా రిషబ్ పంత్‍ను ఢిల్లీ క్యాపిటల్స్ ప్రకటించింది. దీంతో సారథ్య బాధ్యతలను అతడు మళ్లీ చేపట్టనున్నాడు. ఆ వివరాలివే..

Rishabh Pant: రిషబ్ పంతే కెప్టెన్.. అధికారికంగా  ప్రకటించిన ఢిల్లీ క్యాపిటల్స్: వివరాలివే
Rishabh Pant: రిషబ్ పంతే కెప్టెన్.. అధికారికంగా  ప్రకటించిన ఢిల్లీ క్యాపిటల్స్: వివరాలివే

Rishabh Pant - IPL 2024: భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 సీజన్‍కు సిద్ధమయ్యాడు. 2022 డిసెంబర్‌లో రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలకు గురైన అతడు ఆ తర్వాత ఆటకు దూరమయ్యాడు. ఐపీఎల్‍లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కెప్టెన్ అయిన అతడు 2023 సీజన్ ఆడలేకపోయాడు. అయితే, ఇటీవలే రిషబ్ పంత్ పూర్తిగా ఫిట్‍నెస్ సాధించాడు. దీంతో ఐపీఎల్ 2024 ఆడేందుకు రెడీ అయ్యాడు. అయితే, చాలా విరామం తర్వాత ఆడుతుండటంతో వెంటనే ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీని అతడికి ఇస్తారా లేదా అనే టెన్షన్ నెలకొంది. అయితే, ఈ విషయంపై నేడు (మార్చి 19) అధికారిక ప్రకటన చేసింది ఢిల్లీ ఫ్రాంచైజీ.

పంతే కెప్టెన్

ఐపీఎల్ 2024 సీజన్‍కు రిషబ్ పంత్ కెప్టెన్ అని నేడు అధికారికంగా ప్రకటించింది ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ. దీంతో ఉత్కంఠకు తెరపడింది. ఓ సీజన్ గ్యాప్ తర్వాత మళ్లీ ఢిల్లీ సారథ్య బాధ్యతలను పంత్ చేపట్టనున్నాడు.

వెల్‍కమ్ బ్యాక్ కెప్టెన్ రిషబ్ పంత్ అంటూ సోషల్ మీడియాలో ఢిల్లీ ఫ్రాంచైజీ పోస్ట్ చేసింది. అలాగే, ర్యూబిక్‍లతో క్యూబ్‍లతో పంత్ ముఖాన్ని తయారు చేసిన వీడియోను పోస్ట్ చేసింది. రిషబ్ మళ్లీ కెప్టెన్‍ను చేయడంతో ఢిల్లీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

రిషబ్ పంత్ దూరమవడంతో ఐపీఎల్ 2023 సీజన్‍లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆస్ట్రేలియా స్టార్ డేవిడ్ వార్నర్ కెప్టెన్సీ చేశాడు. అయితే, గతేడాది ఏ మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచి నిరాశపరిచింది. ఈ ఏడాది ఐపీఎల్ 2024 సీజన్‍కు పంత్ తిరిగి రావటంతో ఢిల్లీ మళ్లీ బలం పుంజుకుంది.

2022 డిసెంబర్‌లో రోడ్డు ప్రమాదంలో గాయపడిన పంత్‍కు ఓ శస్త్రచికిత్స కూడా జరిగింది. చాలాకాలం అతడు కనీసం నడవలేకపోయాడు. ఆ తర్వాత క్రమంగా శ్రమిస్తూ అంచనాల కంటే ముందుగానే కోలుకున్నాడు. ఎన్‍సీఏలో తీవ్రంగా కష్టపడి పూర్తి ఫిట్‍నెస్ సాధించాడు. ఇటీవలే అతడికి ఎన్‍సీఏ పూర్తి ఫిట్‍నెస్ క్లియరెన్స్ ఇచ్చింది. దీంతో ఐపీఎల్ 2024 ఆడేందుకు పంత్‍కు లైన్ క్లియర్ అయింది. ఢిల్లీ క్యాపిటల్స్ ట్రైనింగ్ క్యాంప్‍లో కూడా అతడు జాయిన్ అయ్యాడు. ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ప్రాక్టీస్‍లో ఇటీవల పంత్ సిక్సర్లు బాదిన వీడియోలు కూడా బయటికి వచ్చాయి. మొత్తంగా అతడు ఫిట్‍గా కనిపిస్తున్నాడు.

ఐపీఎల్‍లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఇప్పటి వరకు ఒక్క టైటిల్ కూడా లేదు. అయితే, ఈసారైనా కప్పు కొట్టాలని కసితో బరిలోకి దిగుతోంది. సుమారు 14 నెలల తర్వాత మళ్లీ బరిలోకి దిగనుండటంతో రిషబ్ పంత్‍పైనే అందరి దృష్టి ఉండనుంది. అతడు ఈ సీజన్‍లో వికెట్ కీపింగ్ చేస్తాడా.. బ్యాటర్‌గానే ఆడతాడా అనేది చూడాలి.

ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22వ తేదీన మొదలుకానుంది. ఢిల్లీ క్యాపిటల్స్ తన మొదటి మ్యాచ్‍ను మార్చి 23వ తేదీన పంజాబ్ కింగ్స్ టీమ్‍తో ఆడనుంది.