Rishabh Pant: ఐపీఎల్ ఆడేందుకు రిషబ్ పంత్‍కు గ్రీన్ సిగ్నల్!: వివరాలివే
IPL 2024 - Rishabh Pant: భారత యంగ్ స్టార్ రిషబ్ పంత్ మళ్లీ బరిలోకి దిగేందుకు లైన్ క్లియర్ అయింది. ఐపీఎల్ 2024 ఆడేందుకు పంత్‍కు ఎన్‍సీఏ గ్రీన్‍సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. ఆ వివరాలు ఇవే.
Rishabh Pant: భారత యంగ్ స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్‍పైనే ప్రస్తుతం క్రికెట్ అభిమానుల దృష్టి ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024లో పంత్ బరిలోకి దిగితే చూడాలని అందరూ ఎదురుచూస్తున్నారు. 2022 డిసెంబర్‌లో రోడ్డు ప్రమాదానికి గురైన పంత్.. ఆ తర్వాత మళ్లీ మైదానంలోకి దిగలేదు. అప్పటి నుంచి భారత జట్టుకు దూరమయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‍గా ఉన్న పంత్ గతేడాది ఐపీఎల్‍లోనూ బరిలోకి దిగలేదు. అయితే, ప్రస్తుతం పంత్ కోలుకున్నాడు. దీంతో ఐపీఎల్ 2024 సీజన్‍లో అతడు ఆడతాడని క్రికెట్ లవర్స్ ఎదురుచూస్తున్నారు.
బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లోనే రిషబ్ పంత్ కొంతకాలంగా ఉంటున్నాడు. అక్కడే కోలుకుంటున్నాడు. ఇటీవలే అతడు బ్యాటింగ్‍తో పాటు వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు. అయితే, ఐపీఎల్ 2024 ఆడేందుకు పంత్‍కు ఎన్‍సీఏ అనుమతి ఇస్తుందా అనే అంశంపై కొంతకాలంగా ఆసక్తి నెలకొంది. అయితే, ఈ విషయంలో ఎన్‍సీఏ నిర్ణయం తీసుకుందని సమాచారం బయటికి వచ్చింది. ఐపీఎల్ 2024 టోర్నీలో ఆడేందుకు పంత్‍కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం బయటికి వచ్చింది.
లైన్ క్లియర్!
ఐపీఎల్ 2024లో ఆడేందుకు రిషబ్ పంత్‍కు ఎన్‍సీఏ క్లియరెన్స్ ఇచ్చిందని స్పోర్ట్ తక్ రిపోర్ట్ వెల్లడించింది. పంత్ పూర్తి ఫిట్‍నెస్ సాధించాడని, అందుకు సంబంధించిన సర్టిఫికేట్‍ను పంత్‍కు ఎన్‍సీఏ ఇచ్చిందని పేర్కొంది. అయితే, ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఐపీఎల్ 2024 టోర్నీ మార్చి 22వ తేదీన ప్రారంభం కానుంది. ఢిల్లీ క్యాపిటల్స్ తన తొలి మ్యాచ్‍ను మార్చి 23న పంజాబ్ కింగ్స్ జట్టుతో ఆడనుంది. ఐపీఎల్‍కు ముందు వైజాగ్‍లో ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించనుంది ఢిల్లీ. అయితే, త్వరలోనే ఢిల్లీ క్యాంప్‍కు పంత్ వెళతాడని సమాచారం.
ఐపీఎల్ 2024కు సంబంధించిన తొలి దశ షెడ్యూల్‍ను బీసీసీఐ ప్రకటించింది. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో రెండు దశల్లో షెడ్యూల్‍ను వెల్లడించాలని నిర్ణయించింది. ముందుగా 21 మ్యాచ్‍ల షెడ్యూల్‍ను వెల్లడించింది. ఇందులో ఢిల్లీ ఐదు మ్యాచ్‍లు ఆడనుంది. వైజాగ్ వేదికగానే రెండు మ్యాచ్‍ల్లో బరిలోకి దిగనుంది ఢిల్లీ.
పంత్‍కు కెప్టెన్సీ మళ్లీ అప్పగిస్తారా?
ఈ ఏడాది ఐపీఎల్‍లో రిషబ్ పంత్ బరిలోకి దిగితే.. ఆ జట్టు కెప్టెన్సీ బాధ్యతలను మళ్లీ అతడికే అప్పగిస్తారా అనేది సందిగ్ధంగా ఉంది. పంత్ ట్రైనింగ్ క్యాంప్‍లోకి వచ్చాక.. పరిస్థితులను పరిశీలించి ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటామని ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ ఇటీవల చెప్పారు. పంత్ సారథ్యంలో 2021లో ఢిల్లీ జట్టు ప్లే ఆఫ్స్ చేరింది. 2022లో ఐదో స్థానంలో నిలిచింది. అయితే, రోడ్డు ప్రమాదం వల్ల గతేడాది పంత్ ఆడకపోవటంతో డేవిడ్ వార్నర్ ఢిల్లీకి కెప్టెన్సీ చేశాడు. అయితే, పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంతో నిరాశ పరిచింది. 2024 సీజన్‍లో పంత్‍కు మళ్లీ కెప్టెన్సీని ఢిల్లీ మేనేజ్‍మెంట్ ఆరంభంలోనే ఇస్తుందా.. కొన్ని మ్యాచ్‍ల్లో ఫిట్‍నెస్ చూశాక అప్పగిస్తుందా అనేది తేలాల్సి ఉంది.
ప్రాక్టీస్‍లో పంత్ భారీ హిట్టింగ్ చేసిన వీడియోలు కూడా ఇటీవల బయటికి వచ్చాయి. ఇటీవల, రోడ్డుపై సరదాగా పిల్లలతో రిషబ్ గోళీలాట ఆడాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.