Ranji Trophy: 13 ఏళ్లకే రంజీ ట్రోఫీ ఆడుతున్న వైభవ్.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో సరికొత్త రికార్డు
Ranji Trophy: బీహార్ కు చెందిన వైభవ్ సూర్యవన్షి ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో కొత్త రికార్డు క్రియేట్ చేశాడు. కేవలం 12 ఏళ్ల 284 రోజుల వయసులోనే అతడు రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడుతుండటం విశేషం.
Ranji Trophy: ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఓ కొత్త రికార్డు నమోదైంది. బీహార్ కు చెందిన వైభవ్ సూర్యవన్షి ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడుతున్న నాలుగో పిన్న వయస్కుడైన ఇండియన్ ప్లేయర్ గా నిలిచాడు. కేవలం 12 ఏళ్ల 284 రోజుల వయసులోనే అతడు బీహార్ తరఫున రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడుతుండటం విశేషం. ముంబైతో శుక్రవారం (జనవరి 5) ఈ మ్యాచ్ ప్రారంభమైంది.
రంజీ ట్రోఫీ 2023-24 సీజన్ శుక్రవారం నుంచే ప్రారంభం కాగా.. తొలి మ్యాచ్ లో బీహార్ టీమ్ శామ్స్ ములానీ కెప్టెన్సీలోని ముంబైతో తలపడుతోంది. బీహార్ టీమ్ తరఫున వైభవ్ సూర్యవన్షిని తుది జట్టులోకి ఎంపిక చేయడంతో అతడు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడుతున్న నాలుగో అతి పిన్న వయసు ఇండియన్ గా నిలిచాడు. గతంలో 12 ఏళ్ల 73 రోజుల వయసులోనే ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడి అత్యంత పిన్న వయస్కుడైన ఇండియన్ గా అలీముద్దీన్ రికార్డు క్రియేట్ చేశాడు.
అలీముద్దీన్ 1942-43 రంజీ సీజన్ లో రాజ్‌పుతానా టీమ్ తరఫున బరోడాతో సెమీఫైనల్లో ఆడాడు. బరోడాలోని జింఖానా గ్రౌండ్ లో ఈ మ్యాచ్ జరిగింది. ఇప్పటికీ అలీముద్దీన్ రికార్డు అలాగే ఉంది. ఇక అతని తర్వాతి స్థానంలో ఎస్‌కే బోస్ ఉన్నాడు. అతడు 1959-60 రంజీ సీజన్ లో 12 ఏళ్ల 76 రోజుల వయసులోనే ఫస్ట్ క్లాస్ డెబ్యూ చేశాడు.
బీహార్, అస్సాం మధ్య జంషెడ్‌పూర్ లో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్ లో బోస్ ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. ఇక 1937లో మహ్మద్ రంజాన్ 12 ఏళ్ల 247 రోజుల వయసులో ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడాడు. ఈ ముగ్గురి తర్వాత ఇప్పుడు వైభవ్ సూర్యవన్షి 12 ఏళ్ల 284 రోజుల వయసులో రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడుతున్నాడు. ఇండియా చివరిసారి వన్డే వరల్డ్ కప్ గెలవడానికి సరిగ్గా ఐదు రోజుల ముందు అంటే 2011, మార్చి 27న వైభవ్ జన్మించాడు.
13 ఏళ్లు కూడా నిండకుండానే ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన ప్లేయర్స్ ప్రపంచవ్యాప్తంగా కేవలం 9 మందే ఉన్నారు. ఈ నలుగురు ఇండియన్స్ కాకుండా.. పాకిస్థాన్ కు చెందిన ఆఖిబ్ జావెద్ (1984-85), మహ్మద్ అక్రమ్ (1968-69), రిజ్వాన్ సత్తార్ (1985-86), సలీముద్దీన్ (1954-55), ఖాసిం ఫిరోజ్ (1970-71)లు 13 ఏళ్లు కూడా నిండకుండానే ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడారు.
ఎవరీ వైభవ్ సూర్యవన్షి?
వైభవ్ సూర్యవన్షి బీహార్ కు చెందిన ప్లేయర్. అతడు కూచ్ బేహార్ ట్రోఫీ 2023 ఎడిషన్ లో బీహార్ తరఫున ఆడాడు. జార్ఖండ్ తో జరిగిన ఓ మ్యాచ్ లో అతడు కేవలం 128 బంతుల్లోనే 151 రన్స్ చేశాడు. అదే మ్యాచ్ లో మరో ఇన్నింగ్స్ లో 76 రన్స్ చేయడం విశేషం. ఇండియా అండర్ 19కు చెందిన నాలుగు జట్లతో నిర్వహించిన టోర్నీలోనూ అండర్ 19బి టీమ్ కు ఆడాడు. అందులో అతడు 53, 74, 0, 41, 0 రన్స్ చేశాడు.