WestGodavari Suicide: అత్త మందలించిందని ఆత్మహత్య చేసుకున్న కోడలు.. పశ్చిమ గోదావరిలో విషాదం
WestGodavari Suicide: పశ్చిమ గోదావరి జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. అత్త మందలించడంతో కోడలు పురుగుల మంది తాగి ఆత్మహత్య చేసుకుంది. దీంతో మృతిరాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
WestGodavari Suicide: అత్త మందలించడంతో కోడలు ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం శివదేవునిచిక్కాల గ్రామంలో చోటు చేసుకుంది. సోమవారం పాలకొల్లు రూరల్ ఎస్ఐ బి.సురేంద్ర కుమార్ తెలిపిన వివరాల ప్రకారం శివదేవునిచిక్కాల గ్రామంలో భార్య భర్తలు గుబ్బల శ్రీనివాస్, కళ్యాణి (25) నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే ఇటీవలి స్నేహితులతో కలిసి కళ్యాణి బయటకు వెళ్లింది. ఇంటికి వచ్చిన కళ్యాణిని అత్త మందలించింది. అప్పుడు అత్త కోడళ్లిద్దరి మధ్య గొడవ జరిగింది.
దీంతో తీవ్ర మనస్తాపనకు గురైన కళ్యాణి శీతలపానీయంలో పురుగుమందు కలుపుకొని తాగి ఆత్మహత్య చేసుకుంది. అయితే కొన ఊపిరితో ఉన్న కళ్యాణిని కుటుంబ సభ్యులు చూసి వైద్యం నిమిత్తం పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించారు. అయితే కళ్యాణి పరిస్థితి విషమంగా ఉండటంతో భీమవరం ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి చికిత్స అందించి, ఇంకా మెరుగైన వైద్యం కోగు గుంటూరు ఆసుపత్రికి తీసుకెళ్లారు.
అక్కడ చికిత్స పొందుతూ శనివారం కళ్యాణి మృతి చెందింది. అయితే కళ్యాణి తల్లి కోడి మరియమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ బి.సురేంద్ర కుమార్ తెలిపారు. తల్లి మరణంతో ఇద్దరు పిల్లలు అనాథులయ్యారు.
క్షణికావేశంలో భార్యను హతమార్చి…
క్షణికావేశంలో భార్యను హతమార్చి భర్త, పశ్చాత్తాపంతో ఆమె సమాధి వద్దే ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం బైపరెడ్లపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్ఐ వెంకట మోహన్ తెలిపిన వివరాల ప్రకారం బైపరెడ్లపల్లి గ్రామంలో భార్య భర్తలు గంగిరెడ్డి (49), సుజాత నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరి కుటుంబం పదేళ్ల నుంచి బెంగళూరు వెళ్లి కూరగాయల వ్యాపారం చేస్తుంది.
ఈ క్రమంలో ఆరునెలల కింద ఇంట్లో చిన్న గొడవ జరిగింది. ఈ గొడవలో గంగిరెడ్డి క్షణికావేశంలో భార్య సుజాతపై కత్తితో దాడి చేయడంతో ఆమె మృతి చెందింది. భార్యను తానే చంపేశానని గంగరెడ్డి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. భార్య హత్య కేసులో ఆరు నెలల జైలు శిక్ష అనుభవించిన గంగిరెడ్డి, శనివారం బెయిల్‌పై విడుదల అయ్యాడు. జైలు నుంచి స్వగ్రామం బైపరెడ్లపల్లిలో ఉన్న కుమారుల వద్దకు వచ్చాడు.
ఆ రోజు రాత్రి కుమారులతో కలిసి భోజనం గంగిరెడ్డి చేశాడు. అయితే తన భార్యను తానే చంపేశానన్న భావంతో చూస్తారని, క్షణికావేశంలో భార్యను చంపుకున్నానని, తనకు బతకాలని లేదని కుమారుల వద్ద ఆవేదన చెందాడు. అనంతరం కుమారులతోనే రాత్రి పడుకున్నాడు. అందరూ గాఢ నిద్రలో ఉన్నప్పుడు గంగిరెడ్డి తన భార్య సమాధి వద్దకు వెళ్లి అక్కడ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తెల్లవారుజామున నిద్ర నుంచి మేలుకున్న కుమారులు చూస్తే, ఇంట్లో తండ్రి కనిపించటం లేదు. దీంతో కుమారులు, బంధువులు గ్రామంలో వెతికారు.
అయితే గంగిరెడ్డి ఎక్కడ కనబడలేదు. దీంతో గంగిరెడ్డి తన తండ్రి, భార్య సమాధుల వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని వేలాడుతున్నట్లు గమనించారు. వెంటనే అక్కడికి వెళ్లి చెట్టుకు వేలాడుతున్న గంగిరెడ్డి మృత దేహాన్ని కిందకు దింపారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ అంతా పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గంగిరెడ్డి కుమారుడు నవీన్ కుమార్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
(జగదీశ్వరరావు జరజాపు,హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)