Goa Liquor Seize: ఏపీలో ఆ బ్రాండ్ లిక్కర్‌కు భలే క్రేజ్.. గోవా టూ అనంతపురం జోరుగా స్మగ్లింగ్
Goa Liquor Seize: ఆంధ్రప్రదేశ్‌లో ఓ ప్రముఖ బ్రాండ్ మద్యానికి ఉన్న క్రేజ్, డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని గోవా మద్యాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారు. ఏపీలో విక్రయించే ప్రముఖ మద్యం బ్రాండ్ ధరలు గోవాలో తక్కువ కావడంతో అక్రమ దందా ప్రారంభించారు. గోవా మద్యాన్ని దుకాణాల్లో అమ్మేందుకు రెడీ అయ్యారు.
Goa Liquor Seize: ఆంధ్రప్రదేశ్‌లో విక్రయించే మద్యం బ్రాండ్లలో కొన్ని బ్రాండ్లకు ఉన్న డిమాండ్‌ను సొమ్ము చేసుకోడానికి అక్రమార్కులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఏపీలో మద్యం ధరలు ఎక్కువగా ఉండటంతో అదే బ్రాండ్ మద్యం ధరలు గోవాలో తక్కువగా ఉండటంతో లాభపడేందుకు విక్రయిస్తున్న మద్యం బ్రాండ్లలో కొన్ని బ్రాండ్ల ధరలు ఎక్కువగా ఉంటంతో వాటిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు గోవా నుంచి మధ్య శ్రేణి మద్యం బ్రాండ్లను అక్రమ రవాణా చేస్తున్నారు.
అనంతపురం జిల్లాలో గోవా మద్యం గుట్టు రట్టైంది. రాప్తాడు శివార్లలోని రైల్వే వంతెన సమీపంలో గొర్రెల పెంపకం షెడ్డులో అక్రమంగా నిల్వ చేసిన 530 బాక్సుల గోవా మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులు సోమవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు.
అనంతపురానికి చెందిన బి. శివకుమార్ రెడ్డి గోవా నుంచి భారీగా మద్యం తీసుకొచ్చారు. అనంతపురానికి చెందిన ఓ వ్యక్తి సాయంతో జిల్లాలోని మద్యం షాపులు, గొలుసు దుకాణాలకు ఆ మద్యం సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు.
గోవా మద్యంపై సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం శివకుమార్ రెడ్డి, అతని స్నేహితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారు ఇచ్చిన సమాచారంతో రాప్తాడు సమీపంలో గొర్రెల షెడ్డులో నిల్వ చేసిన మద్యం బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు శివకుమార్ రెడ్డి గొర్రెల పెంపకం కోసం షెడ్లను ఏర్పాటు చేసుకున్నాడు.
గొర్రెల్ని పెంచేందుకు నిర్మించిన షెడ్లలో అక్రమంగా మద్యం వ్యాపారం చేసేందుకు గోవా మద్యం తెప్పించినట్లు గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. గొర్రెల షెడ్డు వద్ద కాపలా ఉన్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న మద్యం విలువ సుమారు రూ.60 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
గోవాలో మాన్షన్ హౌస్ మద్యం రూ.80కు విక్రయిస్తున్నారు. ఏపీలో కొద్ది రోజుల క్రితం వరకు రూ.220కు మాన్షన్ హౌస్ క్వార్టర్ విక్రయించారు. ఇటీవల దానిని రూ.190కు తగ్గించారు. కొత్త ధరలు ఇంకా అమల్లోకి రాలేదు. పాత ధరలతోనే విక్రయాలు జరుగుతున్నాయి. దీంతో గోవాలో రూ.80కు కొనుగోలు చేసిన మద్యాన్ని దుకాణాలకు రూ.130కు సరఫరా చేసేందుకు ఒప్పందం చేసుకుంటున్నారు. ప్రభుత్వం మద్యం విక్రయాలపై ఇచ్చే మార్జిన్‌తో పోలిస్తే క్వార్టర్‌పై రూ.50 వస్తుండటంతో మద్యం విక్రేతలు కూడా వీరితో కలిసినట్టు అనుమానిస్తున్నారు. కర్ణాటక ఏపీ సరిహద్దుల్లో ఉన్న మద్యం దుకాణాల్లో ఈ దందా సాగుతున్నట్టు అనుమానిస్తున్నారు.