Siraj vs Travis Head: నోరుజారిన ఇద్దరు క్రికెటర్లపై ఐసీసీ సీరియస్.. జరిమానాతో పాటు డీమెరిట్ పాయింట్స్
Mohammed Siraj vs Travis Head: సెంచరీ బాదిన ట్రావిస్ హెడ్‌ను యార్కర్‌తో క్లీన్ బౌల్డ్ చేసిన మహ్మద్ సిరాజ్.. పెవిలియన్‌కి వెళ్లు అన్నట్లు సైగలు చేశాడు. దాంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా..
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భాగంగా అడిలైడ్ వేదికగా ఆదివారం ముగిసిన రెండో టెస్టులో భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్, ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో శతకం బాదిన ట్రావిస్ హెడ్.. ఒంటిచేత్తో ఆస్ట్రేలియా విజయానిెకి బాటలు వేయగా.. ఆఖరికి భారత్‌పై 10 వికెట్ల తేడాతో విజయం సాధించిన ఆతిథ్య జట్టు 1-1తో సిరీస్‌ను సమం చేసింది.
నోరుజారిన సిరాజ్
మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ వికెట్ పడగొట్టిన మహ్మద్ సిరాజ్.. సహనం కోల్పోయి నోరుజారాడు. దాంతో ట్రావిస్ హెడ్ కూడా ఘాటుగా బదులిస్తూ పెవిలియన్ వైపు నడిచాడు. వాస్తవానికి ఇక్కడ మహ్మద్ సిరాజ్‌దే ఎక్కువ తప్పు ఉందని.. భారత మాజీ క్రికెటర్లు సైతం అభిప్రాయపడుతున్నారు. ఫీల్డ్ అంపైర్ల ఫిర్యాదు మేరకు మ్యాచ్ రిఫరీ సిరాజ్‌తో పాటు ట్రావిస్ హెడ్‌పై కూడా చర్యలు తీసుకున్నారు.
సిరాజ్‌కి 20 శాతం జరిమానా
మ్యాచ్‌లో ప్రత్యర్థి ఆటగాడిని రెచ్చగొట్టడం ద్వారా ఆర్టికల్ 2.5ను సిరాజ్ ఉల్లంఘించినట్లు తేలడంతో అతని మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధించారు. అలానే రెచ్చగొట్టేలా మాట్లాడిన ట్రావిస్ హెడ్‌పై కూడా మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకున్నారు. అతని ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్‌ను జత చేశారు. గత రెండేళ్ల వ్యవధిలో సిరాజ్, ట్రావిస్ హెడ్ ఇలా జరిమానా లేదా డీమెరిట్ పాయింట్ పొందడం ఇదే తొలిసారి.
సమర్థించుకున్న ఇద్దరు ఆటగాళ్లు
మ్యాచ్‌లో 141 బంతుల్లో 140 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్‌ను కళ్లుచెదిరే యార్కర్‌తో మహ్మద్ సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో ఆనందంలో పెవిలియన్ వైపు చేయి చూస్తూ.. ఇక వెళ్లు అన్నట్లు సిరాజ్ సైగలు చేశాడు. దాంతో.. ట్రావిస్ హెడ్ కూడా పెవిలియన్‌కి వెళ్తూ ఎదురుదాడి చేశాడు. అయితే.. మ్యాచ్ తర్వాత తాను సిరాజ్‌ను ఏమీ అనలేదని.. అతనే నోరుజారాడని ట్రావిస్ హెడ్ ఆరోపించాడు. దానికి సిరాజ్ కూడా గట్టిగానే బదులిచ్చాడు.
మూడో టెస్టు ఎప్పుడంటే?
భారత్, ఆస్ట్రేలియా మధ్య డిసెంబరు 14 నుంచి మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుంది. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో భారత్ జట్టు 295 పరుగుల తేడాతో విజయం సాధించగా.. అడిలైడ్ టెస్టులో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో గెలిచింది. దాంతో.. మూడో టెస్టుపై అందరిలోనూ అమితాసక్తి నెలకొంది.