IND vs AUS 3rd Test: ఆస్ట్రేలియాతో మూడో టెస్టుకి భారత్ జట్టులో 4 మార్పులు.. ప్రయోగాలకి ఇక చెక్!
India vs Australia 3rd Test: ఆస్ట్రేలియా గడ్డపై అడిలైడ్‌లో జరిగిన పింక్ బాల్ టెస్టులో ఓడిన తర్వాత భారత్ జట్టు ఆత్మరక్షణలో పడిపోయింది. డిసెంబరు 14 నుంచి మూడో టెస్టు ప్రారంభంకానుండగా.. ఈ మ్యాచ్‌కి భారీగా మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఐదు మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా డిసెంబర్ 14 నుంచి గబ్బా మైదానంలో మూడో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఆదివారం ముగిసిన అడిలైడ్ టెస్టులో 10 వికెట్ల తేడాతో ఓటమి భారత జట్టుకు సిరీస్‌లో పెద్ద ఎదురుదెబ్బగా చెప్పొచ్చు. ఈ మ్యాచ్‌లో ఓడిపోవడం ద్వారా ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ అవకాశాల్ని కూడా టీమిండియా సంక్లిష్టం చేసుకుంది. ఈ నేపథ్యంలో.. మూడో టెస్టులో పుంజుకోవాలంటే భారత్ జట్టు 4 మార్పులు చేయాల్సిన అవసరం ఉందని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. సిరీస్‌లో ఇక ప్రయోగాలు చేయకూడదని టీమిండియా మేనేజ్‌మెంట్ కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది.
రోహిత్ మళ్లీ ఓపెనర్‌గా
ఆస్ట్రేలియా టూర్‌లో ఓపెనర్‌గా ఆడుతున్న కేఎల్ రాహుల్ ఘోరంగా విఫలం అవ్వడం లేదు. అలా అని గెలిపించే ఇన్నింగ్స్ కూడా అతను ఆడలేకపోతున్నాడు. అయితే.. కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా ఆడుతుండటంతో.. రోహిత్ శర్మ మిడిలార్డ్‌లో ఆడాల్సి వస్తోంది. అయితే.. ఇన్నాళ్లు ఓపెనర్‌గా ఆడిన హిట్‌మ్యాన్.. మిడిలార్డర్‌లో అంత సౌకర్యంగా కనిపించడం లేదు.
అడిలైడ్ టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అతను సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితం అయ్యాడు. ఈ నేపథ్యంలో.. రోహిత్ శర్మని మళ్లీ ఓపెనర్‌గా ఆడించి.. కేఎల్ రాహుల్‌ని మిడిలార్డర్‌లోకి మార్చాలని మాజీ క్రికెటర్లతో పాటు టీమిండియా అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. దాంతో బ్యాటింగ్ ఆర్డర్‌లో ఈ రెండు మార్పులు ఖాయంగా కనిపిస్తోంది.
జడేజాకి ఛాన్స్
ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు పెర్త్ (తొలి) టెస్టులో భారత జట్టు అవకాశం ఇవ్వగా.. అడిలైడ్ టెస్టులో పింక్ బాల్‌తో అశ్విన్‌కి ఉన్న రికార్డ్ కారణంగా అతనికి ఛాన్స్ ఇచ్చారు. కానీ.. ఈ ఇద్దరూ అంచనాల్ని అందుకోవడంలో ఫెయిల్యయారు. దాంతో.. మూడో టెస్టుకి ఈ ఇద్దరినీ కాకుండా.. రవీంద్ర జడేజాకి ఛాన్స్ ఇవ్వాలని మాజీలు సూచిస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ జట్టుకి జడేజా సహాయపడతాడు. ఆస్ట్రేలియా బ్యాటర్లు స్టీవ్ స్మిత్, లబుషేన్‌లపై జడేజాకి మంచి రికార్డ్ కూడా ఉంది.
హర్షిత్ రాణాపై వేటు
ఆస్ట్రేలియా గడ్డపై భారత్ పేస్ దళం బలహీనంగా కనిపిస్తోంది. జస్‌ప్రీత్ బుమ్రా ఒక్కడే నిలకడగా రాణిస్తున్నాడు. కానీ.. మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా పరుగులిచ్చేస్తూ.. ఆస్ట్రేలియాకి పుంజుకునే అవకాశాల్ని కల్పిస్తున్నారు. మరీ ముఖ్యంగా.. వేగం ఉన్నా.. సరైన లైన్ అండ్ లెంగ్త్‌లో హర్షిత్ రాణా బౌలింగ్ చేయలేకపోతున్నాడు. ఎంతలా అంటే.. అడిలైడ్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 16 ఓవర్లు బౌలింగ్ చేసిన రాణా 5.40 ఎకానమీతో ఒక వికెట్ తీయకుండానే 86 పరుగులు సమర్పించుకున్నాడు. బ్యాటింగ్‌లోనూ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ డకౌట్ అయ్యాడు. దాంతో.. హర్షిత్ రాణా స్థానంలో ఆకాశ్ దీప్‌కి ఛాన్స్ ఇవ్వాలని డిమాండ్ వినిపిస్తోంది.
బ్యాటర్లు పాఠాలు నేర్చుకుంటారా?
భారత్ జట్టు బ్యాటింగ్ విధానంలోనూ మార్పులు రావాల్సిన అవసరం ఉంది. అడిలైడ్ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో ఏ బ్యాటర్ కూడా తొలి ఇన్నింగ్స్‌లో కనీసం 70 బంతులు కూడా ఎదుర్కోలేకపోయారు. అలానే రెండో ఇన్నింగ్స్‌లో ఒక్క బ్యాటర్ కూడా 50 బంతులు ఎదుర్కోలేదు. దాంతో.. కనీసం గబ్బా టెస్టులోనైనా బ్యాటర్‌లు పాఠాలు నేర్చుకోవాలని మాజీలు సూచిస్తున్నారు. డిసెంబరు 14 వరకూ సమయం దొరకడంతో.. హోటల్‌లో కూర్చోకుండా ప్రాక్టీస్ చేయాలని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఇప్పటికే సూచించిన విషయం తెలిసిందే.