Rahul Dravid IPL: మళ్లీ ఐపీఎల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న టీమిండియా మాజీ కోచ్.. అదే జట్టుతో డీలింగ్
Rahul Dravid IPL: టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మళ్లీ ఐపీఎల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. తాను కోచ్ గా కెరీర్ మొదలుపెట్టిన రాజస్థాన్ రాయల్స్ తోనే అతడు మళ్లీ జత కట్టే అవకాశం ఉంది.
Rahul Dravid IPL: టీమిండియా హెడ్ కోచ్ పదవిని రాహుల్ ద్రవిడ్ ఘనంగా ముగించాడు. టీ20 వరల్డ్ కప్ విజయంతో ద్రవిడ్ పదవీకాలం ముగిసింది. దీంతో ఇప్పుడతడు మళ్లీ ఐపీఎల్ వైపు చూస్తున్నాడు. ఇన్నాళ్లూ ఇండియన్ టీమ్ హెడ్ కోచ్ గా ఉండటంతో ఐపీఎల్ తోపాటు మిగిలిన అన్ని పదవులను వదులుకోవాల్సి వచ్చింది. ఇప్పుడా పదవి నుంచి తప్పుకోవడంతో మళ్లీ ఐపీఎల్ వెళ్లే అవకాశం అతనికి కలిగింది.
రాజస్థాన్ రాయల్స్‌తోనే ద్రవిడ్
ఐపీఎల్లో రాహుల్ ద్రవిడ్ మరోసారి రాజస్థాన్ రాయల్స్ తోనే కొనసాగే అవకాశాలు ఉన్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తన రిపోర్టులో వెల్లడించింది. ఆ టీమ్ హెడ్ కోచ్ గా డీల్ ఇప్పటికే దాదాపు పూర్తయిందని, త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని ఆ రిపోర్టు తెలిపింది. "రాజస్థాన్ రాయల్స్, ద్రవిడ్ మధ్య చర్చలు నడుస్తున్నాయి. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలోనే రానుంది" అని టైమ్స్ ఆఫ్ ఇండియా చెప్పింది.
అయితే ద్రవిడ్ మాత్రం ఈ విషయంపై నోరు విప్పలేదు. టీమిండియాకు హెడ్ కోచ్ పదవీకాలం ముగిసిన తర్వాత తానిక నిరుద్యోగిని అని, ఎలాంటి ఆఫర్లకైనా తాను సిద్ధంగా ఉన్నట్లు ద్రవిడ్ జోక్ చేశాడు. అయితే ఇప్పటికే అతడు తన భవిష్యత్తు ఏంటో తేల్చుకున్నట్లే కనిపిస్తోంది.
రాజస్థాన్ రాయల్స్‌తో బంధం
రాజస్థాన్ రాయల్స్ తోనే ద్రవిడ్ కోచింగ్ కెరీర్ మొదలైంది. 2011లో ఆ జట్టుకు కెప్టెన్ గా ద్రవిడ్ వెళ్లాడు. మూడు సీజన్ల పాటు కెప్టెన్ గా కొనసాగాడు. తర్వాత 2014లోనే ఆ జట్టుకు మెంటార్ గా నియమితుడయ్యాడు. అతని మెంటార్షిప్ లో రాయల్స్ టీమ్ బాగానే రాణించింది.
దీంతో ఇప్పుడు టీమిండియా కోచ్ పదవి ముగియగానే ఆ ఫ్రాంఛైజీ ద్రవిడ్ తో మరోసారి ఒప్పందానికి సిద్ధమైంది. మరి దీనిపై అధికారిక ప్రకటన ఎప్పుడు రిలీజవుతుందో చూడాలి. అదే జరిగితే మూడేళ్లుగా ఆ టీమ్ హెడ్ కోచ్ గా ఉన్న కుమార సంగక్కర తప్పుకోవాల్సి ఉంటుంది.
కేకేఆర్ కాదు రాయల్స్
రాహుల్ ద్రవిడ్ స్థానంలో టీమిండియా హెడ్ కోచ్ గా నియమితుడైన కేకేఆర్ మాజీ మెంటార్ గౌతమ్ గంభీర్ స్థానంలో అదే జట్టుకు ద్రవిడ్ వెళ్తాడని మొదట వార్తలు వచ్చాయి. గంభీర్ ను వదులుకున్నందుకు నేరుగా ద్రవిడ్ తో ఒప్పందం కోసం ఆ జట్టు ప్రయత్నించిందని న్యూస్ 18 బంగ్లా వెల్లడించింది. అయితే ద్రవిడ్ మాత్రం రాజస్థాన్ రాయల్స్ వైపు చూస్తున్నట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి.
రాయల్స్ తోనే కోచింగ్ కెరీర్ మొదలు పెట్టిన రాహుల్ ద్రవిడ్ ఆ జట్టుతోపాటు తర్వాత ఇండియా అండర్ 19 టీమ్ తోనూ మంచి ఫలితాలు సాధించాడు. 2016లో అతని కోచింగ్ లోనే ఇండియా అండర్ 19 టీమ్ వరల్డ్ కప్ ఫైనల్ చేరింది. 2018లో విజేతగా నిలిచింది. ఇక టీమిండియా హెడ్ కోచ్ గా వన్డే వరల్డ్ కప్ తోపాటు డబ్ల్యూటీసీ ఫైనల్ చేరింది. టీ20 వరల్డ్ కప్ గెలిచింది.