Kohli vs Gambhir: కోహ్లితో గొడవపై హెడ్ కోచ్ గంభీర్ రియాక్షన్ ఇదీ.. వరల్డ్ కప్ ఆఫర్ కూడా ఇచ్చేశాడు
Kohli vs Gambhir: విరాట్ కోహ్లితో గొడవపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. అంతేకాదు కోహ్లితోపాటు రోహిత్ శర్మ కూడా 2027 వరల్డ్ కప్ ఆడొచ్చన్న హింట్ కూడా ఇవ్వడం విశేషం.
Kohli vs Gambhir: విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్ మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయో ప్రతి క్రికెట్ అభిమానికి తెలుసు. ఈ ఇద్దరు ఎప్పుడు ఫీల్డ్ లో ఎదురుపడినా గొడవలే. అలాంటి గంభీర్ ఇప్పుడు టీమిండియాకు హెడ్ కోచ్ కాగా.. విరాట్ కోహ్లి ఇంకా జట్టులో ప్రధాన ప్లేయర్ గా ఉన్నాడు. మరి ఈ ఇద్దరి మధ్య కోచ్, ప్లేయర్ రిలేషన్షిప్ ఎలా ఉండబోతోంది? దీనికి గంభీర్ సమాధానమిచ్చాడు.
అది మా వ్యక్తిగతం: గంభీర్
శ్రీలంక పర్యటన కోసం టీమిండియా బయలుదేరే ముందు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా కోహ్లితో గొడవ విషయాన్ని ప్రస్తావించగా.. అది కేవలం టీఆర్పీకి మాత్రమే పనికొస్తుందంటూ తేలిగ్గా తీసుకున్నాడు. "అది టీఆర్పీకి బాగుంటుంది. కానీ నా సంబంధం పబ్లిక్ కాదు. విరాట్ కోహ్లితో నాకున్న సంబంధం అనేది ఇద్దరు పరిణతి చెందిన వ్యక్తుల మధ్యలోనే ఉంటుంది.
ఫీల్డ్ లో ప్రతి ఒక్కరికీ తమ సొంత జెర్సీల కోసం ఫైట్ చేసే హక్కు ఉంది. కానీ ప్రస్తుతం మేము ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాం. 140 కోట్ల మంది ఇండియన్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాం. మేమిద్దరం ఒక్క జట్టుగా కలిసి ఉంటూ ఇండియాకు గర్వకారణంగా నిలుస్తామని అనుకుంటున్నాను. ఫీల్డ్ బయట అతనితో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. అవే కొనసాగుతాయి" అని గంభీర్ స్పష్టం చేశాడు.
"నా అపాయింట్‌మెంట్ తర్వాత మా ఇద్దరి మధ్య చాలా మెసేజెస్ షేర్ అయ్యాయి. కానీ ముఖ్యమైన విషయం మాత్రం ఇద్దరం కలిసి ఇండియాను ఎలా గర్వపడేలా చేయాలన్నదే ఉంటుంది. అదే మా పని. మేమిద్దరం ఏం మాట్లాడుకున్నామన్నదానితో పనిలేదు. కేవలం హెడ్ లైన్స్ కోసమే అయితే అది అస్సలు ముఖ్యం కాదు" అని గంభీర్ అన్నాడు.
కోహ్లి, రోహిత్ 2027 వరల్డ్ కప్ ఆడతారు: గంభీర్
ఇక విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలలో ఇంకా చాలా క్రికెట్ బాకీ ఉందని, వాళ్లు 2027 వరల్డ్ కప్ కూడా ఆడొచ్చంటూ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. "పెద్ద టోర్నీల్లో ఏం చేయగలమో వాళ్లు చూపించారు.
అది టీ20 వరల్డ్ కప్ అయినా, వన్డే వరల్డ్ కప్ అయినా. ఆ ఇద్దరిలోనూ ఇంకా చాలా క్రికెట్ ఉందని మాత్రం నేను చెప్పగలను. ముఖ్యంగా ఛాంపియన్స్ ట్రోఫీ, ఆస్ట్రేలియా పర్యటన వస్తున్న నేపథ్యంలో వాళ్ల పాత్ర చాలా కీలకం. ఆ తర్వాత కూడా వాళ్లు తమ ఫిట్‌నెస్ కాపాడుకుంటే 2027 వరల్డ్ కప్ కూడా ఆడగలరు. కానీ ఇది వ్యక్తిగత నిర్ణయం.
వాళ్లలో ఇంకా ఎంత క్రికెట్ ఉందని నేను చెప్పలేను. అది ఆ ప్లేయర్స్ నిర్ణయం. వాళ్లు టీమ్ విజయాల్లో ఎంత పాత్ర పోషించగలరన్నది వాళ్లకే తెలుసు. చివరికి జట్టే ముఖ్యం. కానీ కోహ్లి, రోహిత్ లను చూస్తుంటే.. వాళ్లలో చాలా క్రికెట్ ఉందనే అనిపిస్తోంది. వాళ్లు వరల్డ్ క్లాస్ ప్లేయర్స్. అలాంటి వాళ్లను సాధ్యమైనంత ఎక్కువ కాలం ఆడించాలని ఏ టీమ్ అయినా కోరుకుంటుంది" అని గంభీర్ అన్నాడు.