Rahul Dravid: నాకు ఆ 5 కోట్లు వద్దు.. రాహుల్ ద్రవిడ్ షాకింగ్ నిర్ణయం.. ఎందుకంటే?
Rahul Dravid Refuse BCCI Bonus ₹5 Cr: టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ బీసీసీఐ అందించే బోనస్‌ను తిరస్కరించాడు. తనకు వచ్చే రూ. 5 కోట్లు వద్దని షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు రాహుల్ ద్రవిడ్. అయితే రాహుల్ ద్రవిడ్ అలా చేయడానికి గల కారణాల్లోకి వెళితే..

Rahul Dravid Refuse BCCI Extra Money: రాహుల్ ద్రవిడ్ మరోసారి తానేంటో నిరూపించాడు. తనకు బీసీసీఐ అందజేయాల్సిన రూ. 5 కోట్ల బోనస్‌ను తిరస్కరించాడు మిస్టర్ డిఫెండబుల్ రాహుల్ ద్రవిడ్. టీ20 వరల్డ్ కప్ గెలిచిన సందర్భంగా బీసీసీఐ రూ. 125 కోట్ల ప్రైజ్ మనీ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ 125 కోట్ల ప్రైజ్ మనీలో తన వాటాగా వచ్చిన 5 కోట్లలో సగం వదులుకునేందుకు నిర్ణయించుకున్నాడు రాహుల్ ద్రవిడ్. రూ. 125 కోట్ల ప్రైజ్ మనీలో భారత జట్టు, కోచింగ్ సిబ్బంది, సహాయక సిబ్బందికి ఆ నగదు పంచున్ననట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించారు. ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు అందులో నుంచి రూ. 5 కోట్లు దక్కాయి. కానీ, ఆ నగదు అంతమొత్తాన్ని రాహుల్ ద్రవిడ్ సున్నితంగా తిరస్కరించి కేవలం రూ. 2.5 కోట్ల వాటా మాత్రమే ఇవ్వాల్సిందిగా కోరాడు.
బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్‌లతో పోల్చితే తనకు ఎక్కువ డబ్బులు తీసుకోవాలనే ఉద్దేశం లేదని, వారితోపాటే సమానంగా రెండున్నర కోట్లు ఇవ్వాలని బీసీసీఐని ద్రవిడ్ కోరినట్లు పలు నేషనల్ వెబ్‌సైట్స్ తెలిపాయి. బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ దిలీప్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్‌కు బోనస్ ఇచ్చినట్లే తనకు కూడా అంతే వాటాగా రూ. 2.5 కోట్ల నగదే ఇవ్వాలని రాహుల్ ద్రవిడ్ అడిగినట్లు సమాచారం.
దాంతో ద్రవిడ్ మనోభావాలను గౌరవిస్తామని బీసీసీఐ వర్గాలు తెలిపినట్లు సమాచారం. అయితే, ఈ టాపిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాహుల్ ద్రవిడ్ ఔన్యత్యానికి అభిమానులు, క్రికెట్ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. రాహుల్ ద్రవిడ్ ట్రూ జెంటిల్‌మెన్ అంటూ ప్రశంసిస్తున్నారు. కాగా ఇదివరకు కూడా రాహుల్ ద్రవిడ్ ఇలాగే చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
2018లో భారత్ అండర్ 19 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన సందర్భంగా హెడ్ కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్ ఇలాగే చేశాడు. అప్పుడు అండర్ 19 వరల్డ్ కప్ గెలిచిన జట్టుకు బీసీసీఐ నజరానా ప్రకటించింది. ఆ బహుమతిలో రాహుల్ ద్రవిడ్‌కు రూ. 50 లక్షలు, మిగిలిన సహాయక సిబ్బందికి రూ. 20 లక్షలు, 30 లక్షలు ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అప్పుడు కూడా ఒకరికి ఎక్కువ మరొకరికి తక్కువ కాకుండా అందరికీ సమానంగా నజరానా పంచాలని రాహుల్ ద్రవిడ్ కోరారు.
నగదు పంపిణీ శాతాన్ని మార్చాలని, అందరికీ ఒకే రకమైన సమానమైన నజరానా ఇవ్వాల్సిందిగా బీసీసీఐని కోరారు రాహుల్ ద్రవిడ్. దాంతో సహాయక సిబ్బందిలోని ప్రతి సభ్యుడికి బీసీసీఐ రూ. 25 లక్షల నగదు అందజేసింది.
రాహుల్ ద్రవిడ్ ఎప్పటికప్పుడు నిస్వార్థంగా వ్యవహరిస్తూ నిజమైన జెంటిల్‌మెన్ అని నిరూపించుకుంటున్నాడు. ఇకపోతే ఇటీవల రాహుల్ ద్రవిడ్‌కు ఇండియన్ గవర్నమెంట్ భారతరత్న అవార్డ్ ప్రదానం చేయడం సముచితం అని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తెలిపారు.