Virat Kohli: కోహ్లీకి కుమారుడు.. పాకిస్థాన్‍లో సంబరాలు చేసుకున్న ఫ్యాన్స్.. రికార్డులు బద్దలు కొట్టాలంటూ..: వీడియో-pakistani fans rejoices over birth of virat kohli son distributed sweets video goes viral on social medai ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Virat Kohli: కోహ్లీకి కుమారుడు.. పాకిస్థాన్‍లో సంబరాలు చేసుకున్న ఫ్యాన్స్.. రికార్డులు బద్దలు కొట్టాలంటూ..: వీడియో

Virat Kohli: కోహ్లీకి కుమారుడు.. పాకిస్థాన్‍లో సంబరాలు చేసుకున్న ఫ్యాన్స్.. రికార్డులు బద్దలు కొట్టాలంటూ..: వీడియో

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 21, 2024 03:47 PM IST

Virat Kohli - Akaay: విరాట్ కోహ్లీ, అనుష్క దంపతులకు కుమారుడు జన్మించారు. అతడికి అకాయ్ అని పేరు పెట్టారు. కాగా, కోహ్లీకి కుమారుడు జన్మించటంతో పాకిస్థాన్‍లోనూ అతడి ఫ్యాన్స్ సెలెబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Virat Kohli: విరాట్ కోహ్లీకి కుమారుడు.. పాకిస్థాన్‍లో సంబరాలు చేసిన ఫ్యాన్స్
Virat Kohli: విరాట్ కోహ్లీకి కుమారుడు.. పాకిస్థాన్‍లో సంబరాలు చేసిన ఫ్యాన్స్

Virat Kohli: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. చాలా దేశాల్లో క్రికెట్ ఫ్యాన్స్ కోహ్లీని ఆరాధిస్తారు. అతడి ఆటతో పాటు అంకిత భావాన్ని కూడా అమితంగా ఇష్టపడతారు. చిరకాల ప్రత్యర్థిగా భావించే పాకిస్థాన్‍లోనూ విరాట్ కోహ్లీకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ విషయం తాజాగా మరోసారి స్పష్టమైంది. విరాట్ కోహ్లీ, బాలీవుడ్ స్టార్ అనుష్క శర్మ దంపతులకు కుమారుడు అకాయ్ జన్మించారు. ఈ విషయాన్ని వారు సోషల్ మీడియాలో మంగళవారం వెల్లడించారు. ఈ సందర్భంగా పాక్‍లోని కోహ్లీ అభిమానులు సంబరం చేసుకున్నారు.

విరాట్ కోహ్లీకి కుమారుడు పుట్టిన సందర్భంగా పాకిస్థాన్‍లోని అతడి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ స్వీట్లు పంచుకున్నారు. తమకు చాలా ఆనందంగా ఉందని, విరాట్ రికార్డులను అకాయ్ బద్దలుకొట్టాలని కోరుకుంటున్నామని చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తండ్రి రికార్డు అధిగమించాలి

“విరాట్ కోహ్లీకి కుమారుడు పుట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. అతడు కోహ్లీ రికార్డులను కూడా బద్దలుకొడతాడు” ఆ వీడియోలో ఓ అభిమాని అన్నారు. “తండ్రి రికార్డులను మొత్తం అధిగమించాలి. ఇండియాలో నెక్ట్స్ జనరేషన్‍కు స్ఫూర్తిగా ఉండాలి” అని అకాయ్‍ను ఉద్దేశించి అభిమాని చెప్పారు. క్రికెట్ గురించి తెలిసిన ప్రతీ ఒక్కరూ విరాట్ కోహ్లీనే ఇష్టపడాల్సిందేనని, తనకు చాలా సంతోషంగా ఉందని మరో అభిమాని అన్నారు. విరాట్ కోహ్లీ.. పిల్లలకు మంచి పేర్లు పెట్టారని మరో ఫ్యాన్ అభిప్రాయపడ్డారు.

ఫిబ్రవరి 15వ తేదీన తమకు కుమారుడు జన్మించారని విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ మంగళవారం (ఫిబ్రవరి 20) వెల్లడించారు. దీంతో వారు రెండో సంతానాన్ని పొందారు. గుండెల నిండా ప్రేమతో, ఆనందంతో అకాయ్‍ను తాము స్వాగతించామని చెప్పేందుకు సంతోషిస్తున్నామని కోహ్లీ, అనుష్క ఇద్దరూ సోషల్ మీడియా ద్వారా చెప్పారు. వామికా తమ్ముడిని ప్రపంచంలోకి ఆహ్వానించామని సంతోషం వ్యక్తం చేశారు. ఈ అందమైన సమయంలో తమకు ఆశీర్వాదాలు ఇవ్వాలని, తమ ప్రైవసీని గౌరవించాలని అభ్యర్థించారు.

రెండో సంతానాన్ని పొందిన విరాట్ కోహ్లీ, అనుష్కకు క్రికెటర్లు, సినీ సెలెబ్రిటీలతో పాటు చాలా మంది ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. నెటిజన్లు శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు. జూనియర్ విరాట్ కోహ్లీ వచ్చేశాడంటూ సంబరంగా పోస్టులు చేస్తున్నారు.

2017లో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ వివాహం ఇటలీలో జరిగింది. 2021లో వారికి వామిక అనే అమ్మాయి పుట్టారు. ఇప్పుడు కుమారుడు అకాయ్ జన్మించారు. ప్రస్తుతం కోహ్లీ, అనుష్క లండన్‍లో ఉన్నారని తెలుస్తోంది.

కోహ్లీ ఐదో టెస్టు ఆడతాడా?

స్వదేశంలో ఇంగ్లండ్‍తో టెస్టు సిరీస్ మొదలుకాక ముందే భారత జట్టు నుంచి విరాట్ కోహ్లీ వైదొలిగారు. వ్యక్తిగత కారణాల వల్ల ఈ సిరీస్‍లో తొలి రెండు టెస్టులు ఆడలేనని బీసీసీఐకు చెప్పారు. ఆ తర్వాత మూడు టెస్టులకు ఎంపిక చేసిన జట్టులోనూ లేరు. దీంతో విరాట్ కోహ్లీ, అనుష్క రెండో సంతానం పొందనున్నారనే రూమర్లు వచ్చాయి. అదే నిజమైంది. అయితే, ధర్మశాలలో మార్చి 7వ తేదీ నుంచి ఇంగ్లండ్‍తో జరిగే ఐదో టెస్టుకు కోహ్లీ అందుబాటులోకి వస్తాడని అంచనాలు ఉన్నాయి.

ఇంగ్లండ్‍తో ఐదు టెస్టుల సిరీస్‍లో భారత్ 2-1తో ముందంజలో ఉంది. ఫిబ్రవరి 23వ తేదీన రాంచీలో నాలుగో టెస్టు మొదలుకానుంది.

Whats_app_banner