Memes on RCB: సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌కు ముందు ఆర్సీబీపై పేలుతున్న మీమ్స్.. చూస్తే నవ్వు ఆపుకోలేరు
Memes on RCB: సన్ రైజర్స్ హైదరాబాద్ తో సోమవారం (ఏప్రిల్ 15) జరగబోయే మ్యాచ్ కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో ఫ్యాన్స్ ఆడుకుంటున్నారు. ఆ టీమ్ పై వస్తున్న టాప్ మీమ్స్ ఇవే.
Memes on RCB: ఐపీఎల్ 2024లో ఆర్సీబీ టీమ్ మీమ్స్ కు బాగా పనికొస్తోంది. ఈ సీజన్లో ఆరు మ్యాచ్ లలో కేవలం ఒక మ్యాచ్ గెలిచి పాయింట్ల టేబుల్లో చివరి స్థానంలో ఉంది. చివరికి ఢిల్లీ క్యాపిటల్స్ కూడా మొన్న లక్నో సూపర్ జెయింట్స్ పై గెలవడంతో ఆర్సీబీ పదో స్థానానికి పడిపోయింది. దీంతో రెండు, మూడు రోజులుగా ఆర్సీబీ లక్ష్యంగా చేసుకొని తెగ మీమ్స్ చేసేస్తున్నారు. వాటిని చూస్తే నవ్వాపుకోలేరు.
ఆర్సీబీపై వచ్చిన మీమ్స్ ఇవే
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) 16 సీజన్లుగా ఐపీఎల్ ట్రోఫీ కోసం ఎదురు చూస్తోంది. 17వ సీజన్లో కోటి ఆశలతో అడుగుపెట్టింది. కానీ ఈ సీజన్లో ఆ టీమ్ పరిస్థితి మరింత దారుణంగా మారింది. ప్రతి టీమ్ 6 మ్యాచ్ లు ఆడే సమయానికి ఆర్సీబీ పాయింట్ల టేబుల్లో పదోస్థానానికి పడిపోయింది. లక్నోతో మ్యాచ్ లో ఢిల్లీ గెలిచిన తర్వాత 9వ స్థానంలో ఉన్న ఆర్సీబీ చివరి స్థానానికి దిగజారింది.
దీంతో ఆర్సీబీ లక్ష్యంగా ఫ్యాన్స్ ఫన్నీ మీమ్స్ చేస్తున్నారు. మూడు రోజులుగా ఈ మీమ్స్ ఇంటర్నెట్ ను ముంచెత్తుతున్నాయి. మొత్తానికి ఆర్సీబీ పాయింట్ల టేబుల్లో టాప్ లోకి వచ్చిందంటూ ఆ టేబుల్ ను తలకిందులుగా చేసి ఓ అభిమాని ఆ జట్టుపై ఉన్న కోపాన్ని ఇలా ఫన్నీగా మార్చేశాడు. అసలు అభిమానులు ఎంత వరకూ తమ ఫ్రస్ట్రేషన్ ను తట్టుకోగలరో చూడటానికే ఆర్సీబీ టీమ్ ను ఐపీఎల్లోకి తీసుకొచ్చారంటూ మరో అభిమాని గట్టిగానే వేసుకున్నాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ విజయంతో ఆర్సీబీ చివరి స్థానానికి పడిపోవడంతో మా తప్పు లేకున్నా శిక్ష మాత్రం మాకేనా అన్నట్లుగా ఆర్సీబీ అడుగుతున్న మీమ్ కూడా క్రియేట్ చేశారు. ఢీల్లీ క్యాపిటల్స్ గెలుపు చూసి ఆర్సీబీ ఫ్యాన్స్ ఏడుస్తున్నట్లు కూడా కొందరు మీమ్స్ వదలడం విశేషం.
ఆర్సీబీ vs సన్ రైజర్స్
ఐపీఎల్ 2024లో ఆడిన ఆరు మ్యాచ్ లలో ఐదు ఓడి చివరి స్థానంలో ఉన్న ఆర్సీబీ.. సోమవారం (ఏప్రిల్ 15) మరో కీలకమైన మ్యాచ్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఆడబోతోంది. ఈ సీజన్లో సొంత మైదానంలో ఆడిన మూడు మ్యాచ్ లలోనూ ఆ టీమ్ ఓడింది. ఇప్పుడు మరోసారి చిన్నస్వామిలోనే ఈ మ్యాచ్ జరగబోతోంది. ఇది నిజంగా డుప్లెస్సి సేనకు పరీక్షే.
ఆ టీమ్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి చెలరేగుతున్నా మిగతా బ్యాటర్ల నుంచి అతనికి సహకారం లభించడం లేదు. ఇక ఈ సీజన్లో అత్యంత చెత్త బౌలింగ్ కూడా ఆర్సీబీదే. స్టార్ బౌలర్ సిరాజ్ పరిస్థితి దారుణంగా తయారైంది. ఈ నేపథ్యంలో టాప్ ఫామ్ లో ఉన్న సన్ రైజర్స్ తో మ్యాచ్ అంటే వాళ్లకు పెద్ద పరీక్షే. పరుగుల వరద పారే చిన్నస్వామిలో హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్ లాంటి విధ్వంసకర సన్ రైజర్స్ బ్యాటర్లను ఆర్సీబీ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.