SRH vs PBSK: దుమ్మురేపిన తెలుగు ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి.. సన్‍రైజర్స్ హైదరాబాద్ ఉత్కంఠ గెలుపు.. పోరాడి ఓడిన పంజాబ్
SRH vs PBSK IPL 2024 - Nitish Kumar Reddy: పంజాబ్ కింగ్స్‌పై సన్‍రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. తెలుగు ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి అద్భుత బ్యాటింగ్‍తో అదరగొట్టి గెలుపులో కీలకపాత్ర పోషించాడు. ఆ వివరాలు ఇవే..
SRH vs PBSK IPL 2024: తెలుగు ఆటగాడు, ఆంధ్రప్రదేశ్ దేశవాళీ ఆల్‍రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి హిట్టింగ్‍తో విజృంభించాడు. 39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి సన్‍రైజర్స్ హైదరాబాద్ (SRH) కష్టాల్లో ఉన్న సమయంలో 37 బంతుల్లోనే 64 పరుగులు చేసి అదరగొట్టాడు. 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో దుమ్మురేపాడు. ఐపీఎల్ 2024 టోర్నీలో ముల్లాన్‍పూర్ వేదికగా నేడు (ఏప్రిల్ 9) పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‍లో సన్‍రైజర్స్ హైదరాబాద్ 2 పరుగుల తేడాతో గెలువడంలో నితీశ్ ప్రధాన పాత్ర పోషించాడు. లక్ష్యఛేదనలో పంజాబ్ చివరి వరకు పోరాడి ఓడింది. ఉత్కంఠ పోరులో హైదరాబాద్ పైచేయి సాధించింది. ఈ సీజన్‍లో ఎస్ఆర్‌హెచ్‍కు ఇది మూడో గెలుపు. అవే స్టేడియంలో తొలి విజయం.
నితీశ్ మెరుపులు
టాస్ గెలిచి ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసింది సన్‍రైజర్స్ హైదరాబాద్. అభిషేక్ శర్మ (16), ట్రావిస్ హెడ్ (21), ఐడెన్ మార్క్ రమ్ (0) త్వరగా ఔటవటంతో ఎస్‍ఆర్‌హెచ్ కష్టాల్లో పడింది. 39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఆ తరుణంలో తెలుగు ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి (64) అదరగొట్టాడు. పంజాబ్ కింగ్స్ బౌలర్లపై కౌంటర్ అటాక్ చేశాడు. వరుసగా వికెట్లు పడినా జంకకుండా ధనాధన్ హిట్టింగ్‍తో దుమ్మురేపాడు. దీంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. రాహుల్ త్రిపాఠి (11), హెన్రిచ్ క్లాసెన్ (9) ఔటైనా.. నితీశ్ మాత్రం ఏ మాత్రం దూకుడు తగ్గించలేదు.
అదే హిట్టింగ్ కొనసాగించిన నితీశ్ కుమార్ రెడ్డి 32 బంతుల్లోనే అర్ధ శకతం పూర్తి చేసుకున్నాడు. అబ్దుల్ సమాద్ (12 బంతుల్లోనే 25 పరుగులు) కాసేపు మెరుపులు మెరిపించాడు. అయితే, 17వ ఓవర్లోనే నితీశ్, సమాద్ ఇద్దరూ ఔటయ్యారు. నితీశ్ అద్భుత ఇన్నింగ్స్‌తో సన్‍రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 189 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ నాలుగు వికెట్లతో రాణించగా.. సామ్ కరన్, హర్షల్ పటేల్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. రబాడకు ఓ వికెట్ దక్కింది.
పోరాడి ఓడిన పంజాబ్
ఈ లక్ష్యఛేదనలో పంజాబ్ కింగ్స్ పోరాడి ఓడింది. చివర్లో శశాంక్ సింగ్ (25 బంతుల్లో 46 పరుగులు నాటౌట్), అషుతోశ్ శర్మ (15 బంతుల్లో 33 పరుగులు నాటౌట్) చేసి ఆఖరి వరకు తీవ్రంగా పోరాడారు. అయితే, అంతకు శిఖర్ ధావన్ (14), జానీ బెయిర్ స్టో (0), ప్రభ్‍సిమ్రన్ సింగ్ (4) సహా మిగిలిన పంజాబ్ బ్యాటర్లు రాణించలేకపోయారు. శశాంక్ సింగ్, అషుతోశ్ వీర హిట్టింగ్‍తో హైదరాబాద్‍లో టెన్షన్ పెంచినా.. కాస్తలో పంజాబ్ ఓడింది. 20 ఓవర్లలో 6 వికెట్లకు 180 పరుగులు చేసింది పంజాబ్. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ రెండు, ప్యాట్ కమిన్స్, నటరాజన్, నితీశ్ కుమార్ రెడ్డి, జయదేవ్ ఉనాద్కత్ చెరో వికెట్ తీశారు.
లాస్ట్ ఓవర్ హైడ్రామా
పంజాబ్ జట్టు చివరి ఓవర్లో 29 పరుగులు చేయాల్సి ఉండగా.. హైదరాబాద్ పేసర్ జయదేవ్ ఉనాద్కత్ బౌలింగ్ చేశాడు. తొలి బంతికే అషుతోష్ సిక్సర్ కొట్టగా.. ఆ తర్వాత రెండు వైడ్లు, మరో సిక్సర్ వచ్చాయి. ఓ క్యాచ్ డ్రాప్ అయింది. అయితే, ఆ తర్వాత ఉనాద్కత్ స్లో బంతులతో అషుతోశ్‍ను కట్టడి చేశాడు. చివరి బంతికి 9 రన్స్ అవసరం కాగా శశాంక్ సింగ్ సిక్సర్ కొట్టాడు. మొత్తంగా ఈ ఉత్కంఠ పోరులో హైదరాబాద్ 2 పరుగుల తేడాతో గెలిచింది.
ఐపీఎల్ 2024 సీజన్‍లో హైదరాబాద్ జట్టు ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్‍ల్లో మూడు గెలిచింది. దీంతో ఆరు పాయింట్లతో పట్టికలో ప్రస్తుతం ఐదో స్థానంలో ఉంది. ఐదింట రెండు గెలిచిన పంజాబ్ ఆరో స్థానంలో ఉంది.