LSG vs DC IPL 2024: ఎట్టకేలకు ఢిల్లీకి సెకండ్ విక్టరీ - పాయింట్ల పట్టికలో టాప్ రాజస్థాన్ - లాస్ట్ ఆర్‌సీబీ
LSG vs DC IPL 2024: ఐపీఎల్‌లో ఢిల్లీ సెకండ్ విక్టరీని నమోదు చేసుకున్నది. పంత్, జేక్ ఫ్రెజర్ అద్భుత బ్యాటింగ్‌తో శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్‌పై ఆరు వికెట్ల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది.
LSG vs DC IPL 2024: ఐపీఎల్ 2024లో ఎట్టకేలకు ఢిల్లీ రెండో విజయాన్ని నమోదు చేసుకున్నది. ఆ జట్టు వరుస పరాజయాలకు శుక్రవారం బ్రేక్ పడింది. లక్నో సూపర్ జెయింట్స్‌ఫై ఢిల్లీ క్యాపిటల్స్ ఆరు వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకున్నది. బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్, బ్యాటింగ్‌లో కెప్టెన్ పంత్, జేక్ ఫ్రెజర్ మెక్ గార్గ్ రాణించి ఢిల్లీని గెలుపు బాట పట్టించారు.
రాహుల్ మినహా...
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 167 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్ రాహుల్ (22 బాల్స్‌లో ఐదు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 39 పరుగులు) మినహా మిగిలిన టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ దారుణంగా విఫలమయ్యారు. పడిక్కల్ మూడు, స్టోయినస్ 8 పరుగులు మాత్రమే చేశారు. హిట్టర్ నికోలస్ పూరన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఢిల్లీ స్పిన్నర్ కుల్దీప్ యాదశ్ ధాటికి 94 పరుగులకే లక్నో 94 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది.
ఆయుష్ బదోని మెరుపులు...
దాంతో లక్నో 120 పరుగులు అయినా చేస్తుందో? లేదో? నని క్రికెట్ అభిమానులు భావించారు. యంగ్ ప్లేయర్ ఆయుష్ బదోని, అర్షద్ ఖాన్ కలిసి లక్నోకు గౌరవప్రదమైన స్కోరు అందించారు. ఆయుష్ బదోని 35 బాల్స్‌లో ఐదు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 55 రన్స్ చేశాడు. అర్షద్ ఖాన్ 20 రన్స్‌తో ఆకట్టుకోవడంతో లక్నో 167 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3, ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు తీసుకున్నారు.
చెలరేగిన ఫ్రెజర్, పృథ్వీషా...
ఐపీఎల్‌లో 160 కంటే ఎక్కువ పరుగులు స్కోరు చేసిన ఏ మ్యాచ్‌లోనూ లక్నో ఓడిపోకపోవడంతో ఢిల్లీపై కూడా ఆ జట్టే గెలుస్తుందని ఐపీఎల్ ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ వారి ఆశలను ఢిల్లీ ఆటగాళ్లు పృథ్వీషా, జేక్ ఫ్రెజర్ వమ్ము చేశారు. సీనియర్ ప్లేయర్ వార్నర్ విఫలమైనా పృథ్వీషా, ఫ్రెజర్ ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడటంతో ఢిల్లీ స్కోరు పరుగులు పెట్టింది. 22 బాల్స్‌లో ఆరు ఫోర్లతో 32 రన్స్ చేసిన పృథ్వీషా ఔటయ్యాడు.
పంత్ ధనాధన్ బ్యాటింగ్...
ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన పంత్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. మరోవైపు ఫ్రెజర్ కూడా వరుస సిక్సర్లతో బ్యాట్ ఝులిపించడంతో ఢిల్లీ లక్ష్యానికి చేరువైంది.ఈ మ్యాచ్‌తోనే ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన ఫ్రెజర్ 35 బాల్స్‌లో ఐదు సిక్సర్లు, రెండు ఫోర్లతో 55 రన్స్ చేసి ఔటయ్యాడు. పంత్ 24 బాల్స్‌లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో 41 రన్స్ చేశారు. విజయానికి చేరువైన తరుణంలో పంత్, ఫ్రెజర్ ఔట్ అయ్యారు. స్టబ్స్, హోప్ కలిసి మరో పదకొండు బాల్స్ మిగిలుండగానే ఢిల్లీకి విజయం అందించారు. స్టబ్స్ సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. లక్నో బౌలర్లలో రవి బిష్టోయ్ రెండు వికెట్లతో ఆకట్టుకున్నాడు.
ఆర్‌సీబీ లాస్ట్...
ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో ఢిల్లీ ఓ స్థానం ముందుకొచ్చింది. ఆరు మ్యాచుల్లో రెండు విజయాలతో తొమ్మిదో స్థానానికి చేరుకుంది. ఢిల్లీ గెలుపుతో ఆర్‌సీబీ లాస్ట్ ప్లేస్‌కు పడిపోయింది. ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన ఆర్‌సీబీ కేవలం ఒకే ఒక మ్యాచ్‌లో మాత్రమేగెలిచింది.
రాజస్థాన్ టాప్...
పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది. ఐదు మ్యాచుల్లో నాలుగు విజయాలు, ఓ ఓటమితో ఎనిమిది పాయింట్లు దక్కించుకున్న రాజస్థాన్ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ రెండో స్థానంలో నిలవగా...సీఎస్‌కే మూడు, లక్నో నాలుగో ప్లేస్‌లలో కొనసాగుతోన్నాయి. సన్‌రైజర్స్ ఐదో స్థానంలో ఉండగా...గత ఏడాది రన్నరప్ గుజరాత్ టైటాన్స్ ఆరు ప్లేస్‌లో ఉంది. ఏడో స్థానంలో పంజాబ్, ఎనిమిదో ప్లేస్‌లో ముంబాయి ఉన్నాయి.