IPL 2024: ఐపీఎల్‍లో ఆ మ్యాచ్ వాయిదా పడనుందా? కారణం ఇదే
IPL 2024 - KKR vs RR Match: ఐపీఎల్ 2024 సీజన్‍లో ఓ మ్యాచ్ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కోల్‍కతా, రాజస్థాన్ మధ్య ఏప్రిల్ 17న జరగాల్సిన మ్యాచ్ పోస్ట్ పోన్ అవుతుందని తెలుస్తోంది. కారణమేంటంటే..
IPL 2024: ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2024 సీజన్‍లో ఓ మ్యాచ్ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. ఏప్రిల్ 17వ తేదీన కోల్‍కతా నైట్‍రైడర్స్ (KKR), రాజస్థాన్ రాయల్స్ (RR) మధ్య జరగాల్సిన మ్యాచ్ రీషెడ్యూల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఓ రిపోర్ట్ వెల్లడించింది. ఏప్రిల్ 17న కోల్‍తాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఆ మ్యాచ్ జరగాల్సి ఉంది. ఆ మ్యాచ్ వాయిదా పడడం లేకపోతే వేదిక మారడం జరుగుతుందని ఆ రిపోర్ట్ పేర్కొంది.
కారణం ఇదే
ఏప్రిల్ 17వ తేదీన శ్రీరామనవమి పండుగ ఉండటంతో ఆరోజన జరగాల్సిన కేకేఆర్, రాజస్థాన్ మ్యాచ్ తేదీ లేకపోతే వేదిక మారుతుందని క్రిక్ బజ్ రిపోర్ట్ వెల్లడించింది. కోల్‍కతాలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరగనుండటంతో ఆరోజున ఈడెన్ గార్డెన్స్ మైదానంలో మ్యాచ్ జరిగితే పూర్తిస్థాయిలో భద్రత కల్పించేందుకు ఇబ్బందులు ఉంటాయని అధికారులు చెబుతున్నట్టు పేర్కొంది. దీంతో బీసీసీఐ ఆ మ్యాచ్‍ను వాయిదా వేయాలని ఆలోచిస్తోందట.
త్వరలో తుది నిర్ణయం
ఈ మ్యాచ్ విషయంలో కోల్‍కతా పోలీసులతో బీసీసీఐ, క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) మాట్లాడుతోందని ఆ రిపోర్ట్ వెల్లడించింది. రెండు ఫ్రాంచైజీలు, బ్రాడ్‍కాస్టర్లతో కూడా చర్చించి ఆ మ్యాచ్ నిర్వహణకు సాధ్యాసాధ్యాలను పరిశీలించనుందట. ఆ తర్వాత ఈ మ్యాచ్ విషయంలో తుది నిర్ణయానికి భారత క్రికెట్ బోర్డు రానుంది. పోలీసు అధికారులతో చర్చించిన తర్వాత ఈ మ్యాచ్‍పై బీసీసీఐ అధికారిక ప్రకటన చేస్తుందని ఆ రిపోర్ట్ వెల్లడించింది.
కోల్‍కతా, రాజస్థాన్ మధ్య ఏప్రిల్ 17న జరగాల్సిన ఈ మ్యాచ్ వాయిదా వేయాల్సి వస్తే.. మళ్లీ ఎప్పుడు నిర్వహించాలన్నది బీసీసీఐకి తలనొప్పిగా మారే అవకాశం ఉంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఎన్నికలు ఉండటంతో ఐపీఎల్ 2024 సీజన్ షెడ్యూల్‍ను రెండు దశలుగా బీసీసీఐ ఖరారు చేసింది. ముందుగా 21 మ్యాచ్‍ల షెడ్యూల్ ప్రకటించిన బీసీసీఐ.. ఆ తర్వాత మిలిగిన 53 మ్యాచ్‍ల షెడ్యూల్ కూడా ఖరారు చేసింది.
ఇక, ఐపీఎల్ 2024 సీజన్‍లో ఇప్పటి వరకు తాను ఆడిన రెండు మ్యాచ్‍ల్లో గెలిచి పాయింట్ల పట్టికలో ప్రస్తుతం టాప్ ప్లేస్‍లో ఉంది కోల్‍కతా నైట్‍రైడర్స్. సన్‍రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లపై శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని కేకేఆర్ గెలిచింది. నాలుగు పాయింట్లతో ప్రస్తుతం పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఈ సీజన్‍లో తదుపరి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో ఏప్రిల్ 3న తలపడనుంది కోల్‍కతా.
ఈ సీజన్‍లో రాజస్థాన్ రాయల్స్ కూడా తాను ఆడిన రెండు మ్యాచ్‍ల్లో విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ టీమ్‍లపై గెలిచి సత్తాచాటింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. తన తదుపరి మ్యాచ్‍లో ముంబై ఇండియన్స్ జట్టుతో ఏప్రిల్ 1న రాజస్థాన్ తలపడనుంది.
ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22న మొదలైంది. లీగ్ దశలో 10 జట్లు చెరో 14 మ్యాచ్‍లు ఆడనున్నాయి. వాటితో పాటు ప్లేఆఫ్స్, ఫైనల్స్ కలిపి ఈ సీజన్‍లో మొత్తంగా 74 మ్యాచ్‍లు జరగనున్నాయి. మే 26వ తేదీన ఈ సీజన్ ఫైనల్ జరగనుంది.