Rishabh Pant on comeback: ఐపీఎల్ కమ్‌బ్యాక్‌పై రిషబ్ పంత్.. తొలి మ్యాచ్ ఆడబోతున్నట్లుగా ఉందన్న స్టార్
Rishabh Pant on comeback: కారు ప్రమాదం నుంచి బయటపడి, పూర్తిగా కోలుకొని మళ్లీ ఐపీఎల్లో అడుగుపెట్టబోతున్న రిషబ్ పంత్ తన కమ్‌బ్యాక్ పై స్పందించాడు. ఓ ప్రకటనలో పంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
Rishabh Pant on comeback: కారు ప్రమాదం తర్వాత 14 నెలల పాటు క్రికెట్ కు దూరమైన రిషబ్ పంత్ మళ్లీ ఈ సీజన్ ఐపీఎల్ ద్వారా క్రికెట్ లో అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన జీవితంలో తొలి మ్యాచ్ ఆడబోతున్నట్లుగా తనకు ఆందోళన కలుగుతున్నట్లు అతడు చెప్పడం గమనార్హం. తన కమ్‌బ్యాక్ పై పంత్ చేసిన ప్రకటనను ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ రిలీజ్ చేసింది.
తొలి మ్యాచ్ ఆడుతున్నట్లుగా ఉంది: పంత్
రిషబ్ పంత్ ఐపీఎల్ ఆడేందుకు పూర్తి సిద్ధంగా ఉన్నట్లు బీసీసీఐ మంగళవారం (మార్చి 12) వెల్లడించింది. 14 నెలల రీహ్యాబిలిటేషన్ తర్వాత పంత్ 100 శాతం ఫిట్‌నెస్ సాధించినట్లు తెలిపింది. దీంతో ఈ సీజన్లో అతడు ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు. మార్చి 23న ఢిల్లీ, పంజాబ్ మధ్య జరగనున్న తొలి మ్యాచ్ పంత్ కు కమ్‌బ్యాక్ మ్యాచ్ కానుంది.
ఈ నేపథ్యంలో పంత్ ఓ ప్రకటన విడుదల చేశాడు. "నేను చాలా ఉత్సాహంగా అదే సమయంలో కాస్త ఆందోళనగా కూడా ఉన్నాను. నేను కెరీర్లో మళ్లీ నా తొలి మ్యాచ్ ఆడబోతున్నానన్న ఫీలింగ్ కలుగుతోంది. నేను ఎదుర్కొన్న ప్రమాదం తర్వాత మళ్లీ ఇప్పుడు క్రికెట్ ఆడటం అనేది ఓ అద్భుతమనే చెప్పాలి. నా శ్రేయోభిలాషులు, అభిమానులు, బీసీసీఐ, ఎన్సీఏ సిబ్బందికి కృతజ్ఞతలు. వాళ్ల ప్రేమాభిమానాలు, మద్దతు నాకు బలాన్నిస్తూనే ఉంటాయి" అని పంత్ అన్నాడు.
డీసీ పూర్తి అండగా నిలిచింది
తాను 14 నెలలుగా క్రికెట్ కు దూరమైన సమయంలో ఐపీఎల్ ఫ్రాంఛైజీ ఢిల్లీ క్యాపిటల్స్ తనకు పూర్తి అండగా నిలిచిందని పంత్ తెలిపాడు. "నేను ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్, ఐపీఎల్ కు తిరిగి వస్తున్నందుకు సంతోషంగా ఉంది. నా టీమ్ ఓనర్లు, సపోర్ట్ స్టాఫ్ ఈ కష్టకాలంలో నాకు అండగా నిలిచారు. వాళ్లను నేను రుణపడి ఉంటాను. డీసీ ఫ్యామిలీతో మళ్లీ కలిసి అభిమానులు ఆడటానికి ఆతృతగా ఎదురు చూస్తున్నాను" అని పంత్ చెప్పాడు.
రిషబ్ పంత్ డీసీ కెప్టెన్ గా ఉన్నాడు. గత సీజన్లో అతడు లేకపోవడంతో డేవిడ్ వార్నర్ కెప్టెన్సీ చేపట్టాడు. ఈసారి సీజన్ మొత్తం పంతే కెప్టెన్ గా ఉంటాడా అన్నదానిపై ఆ ఫ్రాంఛైజీ ఇంకా నిర్ణయం వెల్లడించలేదు. అయితే గతేడాది వేలంలో మాత్రం డీసీ టేబుల్ దగ్గర పంత్ ఉన్నాడు. ఇక అతడు పూర్తి ఫిట్‌నెస్ సాధించినట్లు బీసీసీఐ అధికారికంగా వెల్లడించడంతో ఈ సీజన్ మొత్తం పంత్ ఆడనున్నాడు.
ఈసారి రాణిస్తే ఆ వెంటనే జరిగే టీ20 వరల్డ్ కప్ జట్టులోకి కూడా పంత్ వచ్చే అవకాశం ఉంది. రిషబ్ పంత్ ఇప్పటి వరకూ ఇండియా తరఫున 33 టెస్టులు, 30 వన్డేలు, 66 టీ20లు ఆడాడు. పంత్ డిసెంబర్ 30, 2022న కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. తృటిలో ప్రాణాలతో బయటపడిన అతడు తీవ్ర గాయాలతో మూడు సర్జరీలు చేయించుకోవాల్సి వచ్చింది. అయితే వాటి నుంచి త్వరగానే కోలుకొని నేషనల్ క్రికెట్ అకాడెమీలో రీహ్యాబిలిటేషన్ కు వెళ్లిన పంత్.. ఇప్పుడు పూర్తిగా కోలుకొని మళ్లీ ఐపీఎల్లో అడుగుపెట్టబోతున్నాడు.