IPL: అలా చేసే విదేశీ ఆటగాళ్లపై బ్యాన్ విధించాలి: బీసీసీఐకు ఐపీఎల్ ఫ్రాంచైజీల ప్రతిపాదన!-ipl franchises wanting bcci to impose ban on foreign players who withdraw ipl for invalid reasons reports ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ipl: అలా చేసే విదేశీ ఆటగాళ్లపై బ్యాన్ విధించాలి: బీసీసీఐకు ఐపీఎల్ ఫ్రాంచైజీల ప్రతిపాదన!

IPL: అలా చేసే విదేశీ ఆటగాళ్లపై బ్యాన్ విధించాలి: బీసీసీఐకు ఐపీఎల్ ఫ్రాంచైజీల ప్రతిపాదన!

Chatakonda Krishna Prakash HT Telugu
Jul 31, 2024 09:40 PM IST

IPL: ఐపీఎల్ 2025 సీజన్‍కు ముందు బీసీసీఐకు ఐపీఎల్ ఫ్రాంచైజీలు కీలక ప్రతిపాదనలు చేసినట్టు తెలుస్తోంది. సమావేశంలో ఈ విషయాలపై చర్చలు సాగనున్నాయి. ఇందులో విదేశీ ప్లేయర్ల గురించి ఓ కీలకమైన డిమాండ్‍ను కొన్ని ఫ్రాంచైజీలు వినిపిస్తున్నాయని తెలుస్తోంది.

IPL: అలా చేసే విదేశీ ఆటగాళ్లపై బ్యాన్ విధించాలి: బీసీసీఐకు ఐపీఎల్ ఫ్రాంచైజీల ప్రతిపాదన!
IPL: అలా చేసే విదేశీ ఆటగాళ్లపై బ్యాన్ విధించాలి: బీసీసీఐకు ఐపీఎల్ ఫ్రాంచైజీల ప్రతిపాదన!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో చాలా ఫ్రాంచైజీలు మొదటి నుంచి ఓ సమస్యను ఎదుర్కొంటున్నాయి. కొందరు విదేశీ ప్లేయర్లు సీజన్ ప్రారంభమయ్యే కొన్ని రోజుల ముందు ఆడలేమంటూ చెప్పేస్తున్నారు. సరైన కారణాలు చెప్పకుండా ఈ సీజన్‍ నుంచి తప్పుకుంటున్నామంటూ కొందరు చెప్పేస్తున్నారు. ఈ తంతు ఏళ్లుగా సాగుతోంది. దీంతో జట్టు కూర్పు సహా చాలా విషయాల్లో ఫ్రాంచైజీలు చేసుకున్న ప్లాన్‍లు తప్పుతున్నాయి. ఈ ఏడాది ఐపీఎల్ 2024 సీజన్‍లోనూ ఇది జరిగింది. జేసన్ రాయ్, అలెక్స్ హేల్స్, వనిందు హసరంగ సహా మరికొందరు ఆటగాళ్లు సీజన్ మొదలయ్యే కొన్ని రోజుల ముందే తాము ఆడబోమంటూ ప్రకటించారు. దీంతో ఈ విషయంపై బీసీసీఐ ముందు ఐపీఎల్ ఫ్రాంచైజీలు కీలక ప్రతిపాదనను ఉంచాయని సమాచారం బయటికి వచ్చింది.

సరైన కారణం లేకుంటే బ్యాన్ విధించాలి!

ఐపీఎల్ 2025 సీజన్‍ కోసం నిర్వహించే మెగా వేలం గురించి నేడు (జూలై 31) ఫ్రాంచైజీలతో బీసీసీఐ సమావేశం నిర్వహించింది. ఎంత మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకోవాలి, ఫ్రాంచైజీల పర్స్ ఎంతకు పెంచాలి సహా మరిన్ని విషయాలపై చర్చలు సాగనున్నాయి. అయితే, విదేశీ ఆటగాళ్ల వ్యవహారం కూడా కీలక అంశంగా ఉంది. సరైన కారణాలు లేకుండా సీజన్ నుంచి తప్పుకునే విదేశీ ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని బీసీసీఐను ఫ్రాంచైజీలు కోరాయని క్రిక్‍బజ్ రిపోర్ట్ పేర్కొంది.

బలమైన కారణం లేకుండా సీజన్ నుంచి తప్పుకునే విదేశీ ఆటగాళ్లపై ఐపీఎల్ నుంచి బ్యాన్ విధించాలని కూడా కొన్ని ఫ్రాంచైజీలు బీసీసీఐకి ప్రతిపాదనలు చేశాయని ఆ రిపోర్ట్ వెల్లడించింది. బీసీసీఐ సీఈవోతో ఫ్రాంచైజీలు వేర్వేరుగా మాట్లాడిన సమయాల్లో ఈ విషయంపై ప్రస్తావన వచ్చిందని వెల్లడించింది. ఫ్రాంచైజీలతో బీసీసీఐతో మీటింగ్‍లో ఈ విషయాన్ని కూడా అజెండాగా చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో ఎలాంటి నిర్ణయాన్ని బీసీసీఐ తీసుకుంటుందోననే ఉత్కంఠ నెలకొంది.

ఐపీఎల్‍లో ఇంగ్లండ్ ఆటగాళ్ల విషయంలో కొన్నేళ్లుగా ఫ్రాంచైజీలు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కొందరు ఆటగాళ్లు సీజన్ల నుంచి సడెన్‍గా తప్పుకున్నారు. అలాగే.. ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు కీలక సమయాల్లో ఆ జట్టు ప్లేయర్లను అంతర్జాతీయ మ్యాచ్‍ల కోసం వెనక్కి పిలుస్తోంది. ఈ ఏడాది కూడా అలాగే జరిగింది. టీ20 ప్రపంచకప్ 2024 సన్నాహకం కోసం అంటూ ఆటగాళ్లకు సమాచారం ఇచ్చింది. దీంతో ఇంగ్లండ్ కీలక ప్లేయర్స్ ఈ ఏడాది ప్లేఆఫ్స్ ఆడలేదు. ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఐపీఎల్ జరుగుతున్న సమయాల్లో ద్వైపాక్షిక సిరీస్‍లు లేకుండా ఈసీబీ ప్లాన్ చేసుకోవాలని అన్నాడు.

ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‍పైనా..

ఐపీఎల్‍లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‍పై కూడా ఈ సమావేశంలో ఫ్రాంచైజీలతో బీసీసీఐ చర్చించనుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి స్టార్ ప్లేయర్లు ఈ నిబంధన వద్దంటూ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. దీనివల్ల ఆల్‍రౌండర్ల పాత్ర తగ్గిపోతోందనే కామెంట్లు వచ్చాయి. దీంతో ఐపీఎల్ 2025 సీజన్‍లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉండాలా.. వద్దా అనేది కూడా బీసీసీఐ ఓ నిర్ణయానికి రానుంది.

Whats_app_banner