Yuvraj Singh: యువరాజ్ సింగ్‍తో చర్చలు జరుపుతున్న ఐపీఎల్ ఫ్రాంచైజీ.. కోచ్ స్థానం కోసం సంప్రదింపులు
Yuvraj Singh: గుజరాత్ టైటాన్స్ జట్టు కోచ్ పదవి కోసం మాజీ స్టార్ ఆల్‍రౌండర్ యువరాజ్ సింగ్ పేరు తెరపైకి వచ్చింది. ఇందుకోసం అతడితో ఆ ఫ్రాంచైజీ చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.
వచ్చే ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 కోసం కొన్ని ఫ్రాంచైజీలు కోచింగ్ స్టాఫ్‍లో భారీ మార్పులు చేసేందుకు రెడీ అవుతున్నాయి. మెగా వేలం ఉండటంతో ఎక్కువ మంది ఆటగాళ్లు జట్లు మారనుండగా.. కోచింగ్ సిబ్బందిలోనూ ఛేంజెస్ ఉండేలా ఉన్నాయి. కోల్‍కతా నైట్‍రైడర్స్ ఫ్రాంచైజీ నుంచి బయటికి వచ్చిన గౌతమ్ గంభీర్.. టీమిండియా హెడ్ కోచ్ అయ్యారు. అభిషేక్ నాయర్ కూడా భారత కోచ్ అయ్యారు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఇప్పటికే హెడ్ కోచ్ స్థానం నుంచి ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్‍కు గుడ్‍బై చెప్పింది. ఇక గుజరాత్ టైటాన్స్ టీమ్ కూడా కోచ్‍లను మార్చనున్నట్టు సమాచారం బయటికి వచ్చింది.
నెహ్రాకు గుజరాత్ గుడ్‍బై!
ఐపీఎల్ 2025 కంటే ముందే హెడ్‍కోచ్ ఆశిష్ నెహ్రా, క్రికెట్ డైరెక్టర్ విక్రమ్ సోలంకిని తప్పించాలని గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం నిర్ణయించుకుందని రిపోర్టులు బయటికి వస్తున్నాయి. వారిద్దరూ గుజరాత్ జట్టును వీడిపోనున్నారని న్యూస్18 క్రిక్‍నెక్స్ట్ రిపోర్ట్ పేర్కొంది. ఈ ఏడాది ఐపీఎల్ 2023 సీజన్‍లో గుజరాత్ నిరాశపరిచింది. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. హార్దిక్ పాండ్య జట్టును వదిలి ముంబై ఇండియన్స్ టీమ్‍కు వెళ్లాడు. దీంతో శుభ్‍మన్ గిల్ ఈ ఏడాది గుజరాత్‍కు కెప్టెన్సీ చేశాడు. అయితే, ఆ టీమ్ నిరాశపరిచింది.
ఐపీఎల్‍లో గుజరాత్ టైటాన్స్ టీమ్ 2022లో ఎంట్రీ ఇచ్చింది. ఆశిష్ నెహ్రా, సోలింకి ఆ ఫ్రాంచైజీతో ప్రయాణం మొదలుపెట్టారు. వారి దిశానిర్దేశంలో హార్దిక్ కెప్టెన్సీలో తన తొలి సీజన్‍లోనే టైటిల్ కొట్టింది గుజరాత్. 2023 సీజన్‍లో ఫైనల్ వరకు వెళ్లింది. అయితే, హార్దిక్ పాండ్యా.. ముంబైకి వెళ్లిపోవటం, షమీ కూడా ఈ ఏడాది సీజన్‍లో లేకపోవటంతో గుజరాత్ రాణించలేకపోయింది. ప్లేఆఫ్స్ చేరలేకపోయింది. ఈ తరుణంలో 2025 సీజన్‍కు ముందే నెహ్రా, సోలంకికి గుడ్‍బై చెప్పాలని గుజరాత్ యాజమాన్యం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.
యువరాజ్‍తో చర్చలు
భారత మాజీ ఆల్‍రౌండర్, దిగ్గజం యువరాజ్ సింగ్‍తో గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. నెహ్రా, సోలంకి బయటికి వెళ్లనున్న నేపథ్యంలో యువరాజ్‍తో యాజమాన్యం సంప్రదింపులు జరుపుతున్నట్టు ఆ రిపోర్ట్ వెల్లడించింది.
గుజరాత్ టీమ్‍లో భారీ మార్పులు తథ్యంగా జరగనున్నాయని ఈ ఫ్రాంచైజీ వర్గాలు చెప్పినట్టు ఆ రిపోర్ట్ వెల్లడించింది. “చాలా మార్పులు జరగనున్నాయి. ఆశిష్ నెహ్రా, విక్రమ్ సోలంకి బయటికి వెళ్లే అవకాశాలు అధికంగా ఉన్నాయి. యువరాజ్ సింగ్‍తో చర్చలు ఇప్పటికే మొదలయ్యాయి. ప్రస్తుతం ఏదీ ఫైనలైజ్ కాలేదు. అయితే గుజారాత్ టైటాన్స్ కోచింగ్ స్టాఫ్‍లో భారీ మార్పులు మాత్రం జరగనున్నాయి” అని సంబంధిత వర్గాలు పేర్కొన్నట్టు ఆ రిపోర్ట్ వెల్లడించింది.
మూడు సీజన్ల పాటు గుజరాత్ టైటాన్స్ అసిస్టెంట్ కోచ్‍గా చేసిన గ్యారీ క్రిస్టన్ ఇప్పటికే ఆ జట్టును వీడిపోయారు. పాకిస్థాన్ జట్టు హెడ్ కోచ్‍గా వెళ్లారు. ఒకవేళ నెహ్రా, సోలంకి వెళ్లిపోతే గుజరాత్ కోచింగ్ స్టాఫ్ నుంచి ఆశిష్ కపూర్, నయీమ్ అమీన్, నరేందర్ నేగీ, మిథున్ మన్‍హాస్ కూడా తప్పుకుంటారని అంచనాలు ఉన్నాయి.