Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు సారీ చెబుతున్న ముంబై ఫ్యాన్స్
Hardik Pandya: టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యాకు కొందరు ముంబై అభిమానులు క్షమాపణలు చెబుతున్నారు. టీ20 ప్రపంచకప్ 2024లో అద్భుత ప్రదర్శన చేసిన అతడికి సారీ చెబుతున్నారు. ఎందుకంటే..
టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్ కైవసం చేసుకున్న భారత జట్టు స్వదేశానికి వచ్చేసింది. గత శనివారమే ఫైనల్ ముగిసినా.. వెస్టిండీస్‍లో బెరిల్ తుఫాను ఉండటంతో టీమిండియా రాక ఆలస్యమైంది. ఎట్టకేలకు నేటి (జూలై 4) ఉదయం భారత ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది ఢిల్లీకి చేరారు. 17 ఏళ్ల తర్వాత భారత్ టీ20 ప్రపంచకప్‍ను కైవసం చేసుకుంది. టైటిల్‍తో భారత ప్లేయర్లు ఢిల్లీలో అడుగుపెట్టారు. అయితే, ఈ సందర్భంగా కొందరు ముంబై అభిమానులు స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు క్షమాపణలు చెప్పారు. టీవీ ఛానెళ్లతో లైవ్‍లో మాట్లాడుతూనే సారీ అడిగారు.
అప్పుడు ట్రోల్ చేసినందుకు..
ఈ ఏడాది ఐపీఎల్ 2024 సీజన్ కోసం ముంబై ఇండియన్స్ కెప్టెన్‍గా హార్దిక్ పాండ్యాను మేనేజ్‍మెంట్ నియమించింది. జట్టుకు ఐదు టైటిళ్లు సాధించిన రోహిత్ శర్మను తప్పించి అతడిని కెప్టెన్‍ను చేసింది. ఈ ఎఫెక్ట్ హార్దిక్‍పై పడింది. పాండ్యాను ముంబై అభిమానులు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు. మైదానంలోనూ బూ అంటూ అరుస్తూ అతడిని ఇబ్బంది పెట్టారు. ఈ ఏడాది ఐపీఎల్‍లో హార్దిక్ పాండ్యా విఫలం కాగా.. ముంబై పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. దీంతో పాండ్యాను ముంబై ఫ్యాన్స్ తీవ్రంగా ట్రోల్ చేశారు.
టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీలో సీన్ మొత్తం మారిపోయింది. భారత జట్టులో పాండ్యా అద్భుత ప్రదర్శన చేశాడు. 150కు పైగా స్ట్రైక్ రేట్‍తో 144 పరుగులు బాదాడు. 11 వికెట్లు తీశాడు. దక్షిణాఫ్రికాతో ప్రపంచకప్ ఫైనల్‍లో 17వ ఓవర్లో హెన్రిచ్ క్లాసెన్ వికెట్ తీసి మ్యాచ్‍ను మలుపు తిప్పాడు హార్దిక్. చివరి ఓవర్లోనూ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మొత్తంగా ఫైనల్ మ్యాచ్ 7 పరుగుల తేడాతో భారత్ గెలిచి.. ప్రపంచకప్ టైటిల్ కైవసం చేసుకుంది.
టీ20 ప్రపంచకప్‍లో అద్భుత ప్రదర్శన చేసిన హార్దిక్ పాండ్యాకు ముంబై అభిమానులు ఇప్పుడు సారీ చెబుతున్నారు. ఐపీఎల్ విషయంలో ట్రోల్ చేసినందుకు క్షమాపణలు అడుగుతున్నారు. అసలు అప్పుడు పాండ్యాను ఎందుకు ట్రోల్ చేశామో తెలియదంటూ ఓ మహిళ ఓ ఛానెల్‍తో ఉన్నారు. ఫైనల్‍లో చివరి ఓవర్ అద్భుతంగా వేశారంటూ ప్రశంసించారు. తాను హార్దిక్‍ను క్షమాపణ కోరుతున్నానని చెప్పారు.
సోషల్ మీడియా వేదికగా కూడా హార్దిక్ పాండ్యాకు ఇప్పటికే కొందరు ముంబై అభిమానులు క్షమాపణలు చెప్పారు. ప్రపంచకప్‍లో అద్భుత ప్రదర్శన చేశావని, అప్పుడు ట్రోల్ చేసినందుకు సారీ అంటూ పోస్టులు చేశారు.
ప్రధానిని కలిసిన టీమిండియా.. ముంబైలో పరేడ్
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని టీ20 ప్రపంచకప్ టైటిల్ కైవసం చేసుకున్న భారత జట్టు కలిసింది. నేటి (జూలై 4) ఉదయం ఢిల్లీ చేరిన టీమిండియా ఆటగాళ్లు.. ఆ తర్వాత ప్రధాని నివాసానికి వెళ్లారు. ప్లేయర్లు, కోచింగ్ సిబ్బందితో మోదీ సరదాగా మాట్లాడారు. ఫొటోలు దిగారు. ఢిల్లీ నుంచి ముంబైకు టీమిండియా బయలుదేరింది. ముంబైలో సాయంత్రం ప్రపంచకప్ టైటిల్‍తో భారీ స్థాయిలో విక్టరీ పరేడ్ ఉండనుంది. ఆ తర్వాత వాంఖడే స్టేడియంలో ప్రత్యేక కార్యక్రమం ఉండనుంది. అయితే, ఈ విజయోత్సవ వేడుకలు వర్షం వల్ల ఆలస్యంగా సాగే అవకాశం ఉంది.