IPL 2024 Playoffs: ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అయ్యే నాలుగు టీమ్స్ ఇవే.. ఆ రెండు టీమ్స్ పనైపోయినట్లే-ipl 2024 playoff scenario sunrisers hyderabad chennai super kings rajasthan royals kkr to qualify mi and rcb out ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ipl 2024 Playoffs: ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అయ్యే నాలుగు టీమ్స్ ఇవే.. ఆ రెండు టీమ్స్ పనైపోయినట్లే

IPL 2024 Playoffs: ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అయ్యే నాలుగు టీమ్స్ ఇవే.. ఆ రెండు టీమ్స్ పనైపోయినట్లే

Hari Prasad S HT Telugu
Apr 23, 2024 02:09 PM IST

IPL 2024 Playoffs: ఐపీఎల్ 2024 లీగ్ స్టేజ్ లో సగానికిపైగా మ్యాచ్ లు ముగిశాయి. మరి ప్లేఆఫ్స్ కు వెళ్లే ఆ నాలుగు జట్లు ఏవి అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఇప్పటికే ఆ నాలుగు టీమ్స్ పై ఓ స్పష్టత వచ్చేసినట్లే.

ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అయ్యే నాలుగు టీమ్స్ ఇవే.. ఆ రెండు టీమ్స్ పనైపోయినట్లే
ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అయ్యే నాలుగు టీమ్స్ ఇవే.. ఆ రెండు టీమ్స్ పనైపోయినట్లే (ANI )

IPL 2024 Playoffs: ఐపీఎల్ 2024లో సోమవారానికి (ఏప్రిల్ 22) 38 మ్యాచ్‌లు ముగిశాయి. లీగ్ స్టేజ్ లో మొత్తం 70 మ్యాచ్ లు ఉండగా.. అందులో సగానికిపైనే పూర్తయ్యాయి. దీంతో ఈసారి ప్లేఆఫ్స్ చేరే టాప్ 4 టీమ్స్ పై ఓ స్పష్టత వచ్చేసింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా ఏ రకంగా చూసినా.. ఆ నాలుగు టీమ్స్ మిగతా ఆరు జట్లతో పోలిస్తే అందనంత ఎత్తులో ఉన్నాయి.

ప్లేఆఫ్స్ చేరే జట్లు ఇవే

ప్రస్తుతం ఐపీఎల్ 2024 పాయింట్ల టేబుల్లో టాప్ 4లో ఉన్న జట్లే ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మొదటి 16 సీజన్లు చూస్తే మంచి బౌలింగ్ గణాంకాలు ఉన్న జట్లు ప్లేఆఫ్స్ చేరాయి. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. బ్యాటింగ్ లో మెరుపులు మెరిపిస్తున్న జట్లే టాప్ లో ఉన్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి ప్లేఆఫ్స్ చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ జట్ల బ్యాటింగ్ సగటును చూస్తే ఇదే తెలిసిపోతుంది. ఈ సీజన్లో అత్యధికంగా టీమ్ మొత్తం బ్యాటింగ్ సగటు విషయంలో సన్ రైజర్స్ 37.7తో టాప్ లో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో చెన్నై సూపర్ కింగ్స్ (36.5), రాజస్థాన్ రాయల్స్ (36.2), కోల్‌కతా నైట్ రైడర్స్ (35.3) ఉన్నాయి. ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్ సగటు కేవలం 30.6 మాత్రమే. పైనున్న నాలుగు జట్లకు మిగతా జట్లకు ఎంత తేడా ఉందో దీనినిబట్టే స్పష్టమవుతోంది.

సన్ రైజర్స్ హైదరాబాద్- తిరుగులేని బ్యాటింగ్

అసలు టీ20 క్రికెట్ ఎలా ఆడాలో ఈ సీజన్లో సన్ రైజర్స్ బ్యాటర్లు చూపిస్తున్నారు. ఇప్పటికే ఆ టీమ్ 11.2 రన్ రేట్ తో పరుగులు చేస్తుండటం విశేషం. అంతేకాదు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరును మూడు వారాల్లో రెండుసార్లు బ్రేక్ చేసింది. పవర్ ప్లేలో ఏకంగా 125 పరుగులతో టీ20 క్రికెట్ లో చరిత్ర తిరగరాసింది. ఇక ఓపెనర్లు హెడ్, అభిషేక్ ఏకంగా 254 స్ట్రైక్ రేట్ తో ఇప్పటి వరకూ 404 రన్స్ జోడించారు.

మిడిలార్డర్ లో క్లాసెన్ 198.5 స్ట్రైక్ రేట్ తో 268 రన్స్ చేశాడు. ఇవన్నీ మిగతా జట్లతో పోలిస్తే సన్ రైజర్స్ ను ఎవరికీ అందనంత ఎత్తులో ఉంచింది. బౌలింగ్ లో కమిన్స్, నటరాజన్ టాప్ పర్ఫార్మర్లుగా ఉన్నారు. ఈ ఇద్దరూ 8.2 ఎకానమీ రేటుతో 19 వికెట్లు తీశారు. సన్ రైజర్స్ ఊపు చూస్తుంటే.. ఈసారి ప్లేఆఫ్స్ కాదు కదా ఛాంపియన్స్ గా నిలిచినా ఆశ్చర్యం లేదు.

కోల్‌కతా నైట్ రైడర్స్ - బ్యాటింగ్‌లో కొత్త ఊపు

సన్ రైజర్స్ తర్వాత ఈ సీజన్లో 10.6 రన్ రేట్ తో పరుగులు సాధించిన ఘతన కోల్‌కతా నైట్ రైడర్స్ దే. ఆ టీమ్ లోని నరైన్, ఫిల్ సాల్ట్ లాంటి బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. నరైన్ 286, సాల్ట్ 249 రన్స్ చేశారు. అటు బౌలింగ్ లోనూ నరైన్ 9 వికెట్లతో ఆ టీమ్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ అయ్యాడు. అంతేకాదు అతడు కేవలం 7.1 ఎకానమీ రేటుతో రన్స్ ఇస్తున్నాడు.

రాజస్థాన్ రాయల్స్ - ఆల్ రౌండర్స్

రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్లో అత్యంత నిలకడగా ఆడుతూ కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఓడి టాప్ లో ఉన్న టీమ్. ముంబైతో మ్యాచ్ లో సెంచరీతో ఫామ్ లోకి వచ్చిన యశస్వితోపాటు జోస్ బట్లర్, రియాన్ పరాగ్, సంజూ శాంసన్ నిలకడైన బ్యాటింగ్ ఆ టీమ్ బలం. బౌలింగ్ లో బౌల్ట్, చహల్ రాణిస్తున్నారు. 8 మ్యాచ్ లలో ఏడు గెలిచిన రాజస్థాన్ ప్లేఆఫ్స్ కు అడుగు దూరంలో ఉంది. ఆరు మ్యాచ్ లలో కనీసం రెండు గెలిచినా ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయమవుతుంది.

చెన్నై సూపర్ కింగ్స్ - కెప్టెన్ మారినా..

ఈ మూడు టీమ్స్ తర్వాత ప్లేఆఫ్స్ అవకాశం ఉన్నది డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ కే. కెప్టెన్ మారినా ఆ టీమ్ జోరు కొనసాగుతోంది. సగం టోర్నీ ముగిసిన వేళ ఆ టీమ్ టాప్ 4లో నిలకడగా కొనసాగుతోంది. టాపార్డర్ మరీ ఆ స్థాయిలో రాణించకపోయినా.. మిడిలార్డర్ లో శివమ్ దూబె, చివర్లో ధోనీ మెరుపులు ఆ జట్టుకు విజయాలు సాధించి పెడుతున్నాయి. ఇక బౌలింగ్ లో మాత్రం తిరుగులేదు. పతిరన, ముస్తఫిజుర్ రెహమాన్ లాంటి వాళ్లు నిలకడగా రాణిస్తున్నారు.

గతేడాదితో పోలిస్తే ఈసారి సీఎస్కే, ఆర్ఆర్ తప్ప మిగతా రెండు జట్లు కొత్తగా టాప్ 4లోకి వచ్చాయి. గతేడాది సెకండాఫ్ లో పుంజుకున్న ముంబై ఇండియన్స్.. రాయల్స్ ను వెనక్కి నెట్టి ప్లేఆఫ్స్ చేరినా.. ఈసారి మాత్రం అలాంటి అద్భుతాలు జరిగే అవకాశం కనిపించడం లేదు.

IPL_Entry_Point