IPL 2024 Duke Ball: ఐపీఎల్ 2024లో భారీ స్కోర్లు.. డ్యూక్ బాల్ వాడాలంటూ గంభీర్ బోల్డ్ సొల్యూషన్-gautham gambhir suggests using duke balls in ipl amid huge scores in ipl 2024 season ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ipl 2024 Duke Ball: ఐపీఎల్ 2024లో భారీ స్కోర్లు.. డ్యూక్ బాల్ వాడాలంటూ గంభీర్ బోల్డ్ సొల్యూషన్

IPL 2024 Duke Ball: ఐపీఎల్ 2024లో భారీ స్కోర్లు.. డ్యూక్ బాల్ వాడాలంటూ గంభీర్ బోల్డ్ సొల్యూషన్

Hari Prasad S HT Telugu
Apr 17, 2024 04:29 PM IST

IPL 2024 Duke Ball: ఐపీఎల్ 2024లో భారీ స్కోర్లు నమోదవుతున్న నేపథ్యంలో కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్ మెంటార్ గౌతమ్ గంభీర్ చెబుతున్న పరిష్కారం ఆసక్తి రేపుతోంది. ఐపీఎల్లో డ్యూక్ బాల్స్ వాడాలని అతడు అంటున్నాడు.

ఐపీఎల్ 2024లో భారీ స్కోర్లు.. డ్యూక్ బాల్ వాడాలంటూ గంభీర్ బోల్డ్ సొల్యూషన్
ఐపీఎల్ 2024లో భారీ స్కోర్లు.. డ్యూక్ బాల్ వాడాలంటూ గంభీర్ బోల్డ్ సొల్యూషన్ (AFP)

IPL 2024 Duke Ball: ఈ సీజన్ ఐపీఎల్లో బౌలర్లు బలవుతున్నారు. బ్యాట్స్‌మెన్ వీర బాదుడు బాదుతుంటే బౌలర్లంతా నిస్సహాయిలుగా మిగిలిపోతున్నారు. 200లకుపై టార్గెట్లను కూడా చేజ్ చేస్తున్న వేళ ఈ బ్యాటర్లకు ఊచకోతకు చెక్ పెట్టి బ్యాలెన్స్ తీసుకురావడానికి కేకేఆర్ మెంటార్ గౌతమ్ గంభీర్ ఓ పరిష్కారం చెబుతున్నాడు. అది ఐపీఎల్లో కూకాబుర్రా బదులు డ్యూక్ బాల్స్ వాడటం.

గంభీర్ సొల్యూషన్ ఇదీ

ఐపీఎల్ చరిత్రలో నమోదైన మూడు అత్యధిక స్కోర్లు ఈ సీజన్లో కావడం గమనించాల్సిన విషయం. సన్ రైజర్స్ హైదరాబాద్ మూడు వారాల వ్యవధిలో రెండుసార్లు రికార్డు స్కోర్లు సాధించింది. రాజస్థాన్ రాయల్స్ టీమ్ ఏకంగా 224 పరుగులను చేజ్ చేసేసింది. బౌలర్లపై అసలు కనికరం చూపకుండా బాదేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేకేఆర్ మెంటార్ గంభీర్ స్పందించాడు.

180 నాటౌట్ పాడ్‌కాస్ట్ లో అతడు మాట్లాడాడు. ప్రస్తుతం వాడుతున్న కూకాబుర్రా బాల్స్ నుంచి బౌలర్లకు అసలు ఏమాత్రం సహకారం లభించడం లేదని, బాల్ మాన్యుఫ్యాక్చరర్ ను మార్చాలని అతడు అనడం గమనార్హం. ఇన్నింగ్స్ మధ్యలోనే బంతి బాగా పాతబడిపోతోంది. "ఒకవేళ ఓ మాన్యుఫ్యాక్చరర్ 50 ఓవర్లపాటు దృఢంగా ఉండే బంతిని రూపొందించలేనప్పుడు ఆ మాన్యుఫ్యారర్ ను మార్చాలి. అందులో తప్పేమీ లేదు. కేవలం కూకాబుర్రా బంతులనే వాడాలన్న రూలేమీ లేదు కదా" అని గంభీర్ అన్నాడు.

డ్యూక్‌తో బౌలర్లకు మేలు

ఐపీఎల్లో డ్యూక్ బాల్స్ వాడాలని గంభీర్ సూచించాడు. ఇందులోని మన్నికగా ఉండే సీమ్, గాల్లో స్వింగ్ అయ్యే గుణం వల్ల బౌలర్లకు ఇది అనుకూలంగా ఉంటుందని అతడు చెప్పాడు. సాధారణ స్వింగ్, బౌన్స్ అందించని పిచ్ లపై ఆడే సమయాల్లో ఈ డ్యూక్ బాల్స్ బౌలర్లకు సాయపడతాయి. దీని కారణంగా బ్యాట్, బాల్ మధ్య బ్యాలెన్స్ ఉంటుంది.

అటు ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే కూడా డ్యూక్ బాల్స్ వాడాలని సూచిస్తున్నాడు. గంభీర్ వాదనతో అతడు ఏకీభవించాడు. డ్యూక్ బాల్స్ వల్ల బౌలర్లకు లభించే సహకారంతో మ్యాచ్ లు మరింత ఆసక్తికరంగా సాగుతాయన్నది అతడి వాదన. వీళ్లే కాదు క్రికెట్ విశ్లేషకులు ఐపీఎల్ మ్యాచ్ లలో బ్యాట్, బాల్ మధ్య బ్యాలెన్స్ కోసం పరిష్కారాల కోసం వెతుకుతున్నారు.

అందులో ఒకటి కూకాబుర్రా బదులు డ్యూక్ బంతి వాడటం. అయితే కేవలం బ్యాటర్లకు సహకరిస్తుందన్న ఉద్దేశంతో ఏకంగా బంతినే మార్చడం ఏంటన్న చర్చ కూడా మొదలైంది. మొత్తానికి దీనిపై భవిష్యత్తులో మరింత లోతైన అభిప్రాయాలు వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

క్రికెట్ బాల్స్

క్రికెట్ లో సాధారణంగా మూడు రకాల బాల్స్ ఉపయోగిస్తుంటారు. ఇండియాతోపాటు ఉపఖండంలో జరిగే అంతర్జాతీయ మ్యాచ్ లలో స్థానికంగా తయారయ్యే ఎస్‌జీ బాల్స్ వాడతారు. అదే ఆస్ట్రేలియాలో అయితే కూకాబుర్రా బంతులను వినియోగిస్తున్నారు. ఇక ఇంగ్లండ్ లాంటి దేశాల్లో అక్కడ తయారయ్యే డ్యూక్ బాల్స్ వాడతారు. క్రికెట్ లో వాడే మూడు రకాల బంతులను.. ఆయా కండిషన్స్ కు తగినట్లుగా తయారు చేస్తారు.

Whats_app_banner