Harsha Bhogle at HPS: క్రికెట్ కామెంటేటర్, పూర్వ విద్యార్థి హర్షా భోగ్లేను సత్కరించిన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్
Harsha Bhogle at HPS: మన హైదరాబాదీ, ఒకప్పుడు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్న క్రికెట్ కామెంటేటర్ హర్షా భోగ్లేను ఆ స్కూలు ఘనంగా సత్కరించింది. గురువారం (జనవరి 25) ఇండియా, ఇంగ్లండ్ మ్యాచ్ కోసం వచ్చిన అతన్ని సన్మానించారు.
Harsha Bhogle at HPS: క్రికెట్ కామెంటేటర్ హర్షా భోగ్లేను ఎక్సలెన్స్ ఫర్ స్పోర్ట్స్ కామెంటరీ అండ్ జర్నలిజం అవార్డుతో సత్కరించింది అతడు చదువుకున్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. ఇండియా, ఇంగ్లండ్ తొలి టెస్టు కోసం హైదరాబాద్ వచ్చిన హర్షాను స్కూలు ప్రాంగణంలోనే సన్మానించారు. ఇందులో హెచ్‌పీఎస్ సొసైటీ అధ్యక్షుడు గుస్తీ నోరియా, ప్రిన్సిపల్ స్కంద్ బాలి పాల్గొన్నారు.
హర్షా భోగ్లే హెచ్‌పీఎస్ జ్ఞాపకాలు
క్రికెట్ కామెంటరీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన హర్షా భోగ్లే గతంలో ఈ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లోనే చదువుకున్నాడు. ఇప్పుడు అతడు స్కూలును సందర్శించినప్పుడు మూడు నుంచి ఎనిమిదవ తరగతి వరకూ విద్యార్థులతో మాట్లాడాడు. ఈ సందర్భంగా తన స్కూల్ లైఫ్ ను అతడు గుర్తు చేసుకున్నాడు. స్కూల్ మ్యాగజైన్ కోసం అప్పట్లో తాను ఎలా చురుగ్గా వ్యవహరించానో స్టూడెంట్స్ కు చెప్పాడు.
మొబైల్ ఫోన్లతో ప్రేమలో పడకూడదని ఈ సందర్భంగా తనదైన స్టైల్లో స్టూడెంట్స్ ను హెచ్చరించాడు. అకడమిక్స్, స్పోర్ట్స్ కు సమ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించాడు. తమ సమయాన్ని స్టూడెంట్స్ మెరుగ్గా ఉపయోగించుకోవాలని అన్నాడు. ఇక తాను చదువుకున్న స్కూలు తనకు ఈ అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని కూడా చెప్పాడు.
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో తాను చదువుకునే సమయంలో ఇక్కడి విలువలు, చదువు తన కెరీర్ ను రూపొందించుకోవడంలో ఎంతో తోడ్పడ్డాయని హర్షా భోగ్లే తెలిపాడు. ఇప్పుడీ స్కూలుకి రావడం తిరిగి తన ఇంటికి వచ్చినట్లే ఉందని అన్నాడు.
ఎవరీ హర్షా భోగ్లే?
మహారాష్ట్రకు చెందిన హర్షా భోగ్లే ఫ్యామిలీ చాలా ఏళ్ల కిందటే హైదరాబాద్ లో స్థిరపడింది. స్కూలింగ్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పూర్తి చేసుకున్న అతడు.. తర్వాత కెమికల్ ఇంజినీరింగ్ ను ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో చేశాడు. 19 ఏళ్ల వయసులోనే ఆలిండియా రేడియోలో కామెంటరీ మొదలు పెట్టాడు. 1991-92లో ఆస్ట్రేలియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ నుంచి పిలుపు అందుకున్న తొలి ఇండియన్ కామెంటేటర్ గా నిలిచాడు.
1992లో జరిగిన వరల్డ్ కప్ లో హర్షా భోగ్లే కామెంటరీ చేశాడు. ఆ తర్వాత 1996, 1999 వరల్డ్ కప్ లలోనూ కామెంటేటర్ గా చేసి మంచి పేరు సంపాదించాడు. హైదరాబాద్ లో పుట్టి పెరిగినా.. ప్రస్తుతం హర్షా ముంబైలో సెటిలయ్యాడు. ఐఐఎం అహ్మదాబాద్ లో చదివే రోజుల్లో తన క్లాస్ మేట్ అయిన అనితను అతడు పెళ్లి చేసుకున్నాడు.
ప్రస్తుతం ఇండియా, ఇంగ్లండ్ తొలి టెస్ట్ కోసం సొంతూరు హైదరాబాద్ వచ్చాడు. ఈ మ్యాచ్ లో హర్షా భోగ్లే కామెంటరీ చేస్తున్నాడు. తొలి రోజు ఇంగ్లండ్ 246 రన్స్ కు ఆలౌట్ కాగా.. ఇండియా వికెట్ నష్టానికి 119 రన్స్ చేసిన విషయం తెలిసిందే.