CSK vs LSG live: రుతురాజ్ సెంచరీ.. శివమ్ దూబె మెరుపు హాఫ్ సెంచరీ.. చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోరు-ipl 2024 csk vs lsg live score ruturaj gaikwad hundred shivam dube smashing fifty give chennai super kings huge score ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Csk Vs Lsg Live: రుతురాజ్ సెంచరీ.. శివమ్ దూబె మెరుపు హాఫ్ సెంచరీ.. చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోరు

CSK vs LSG live: రుతురాజ్ సెంచరీ.. శివమ్ దూబె మెరుపు హాఫ్ సెంచరీ.. చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోరు

Hari Prasad S HT Telugu
Apr 23, 2024 09:30 PM IST

CSK vs LSG live: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతరాజ్ గైక్వాడ్, ఆల్ రౌండర్ శివమ్ దూబె మెరుపు హాఫ్ సెంచరీతో లక్నో సూపర్ జెయింట్స్ పై ఆ టీమ్ భారీ స్కోరు చేసింది. సొంత మైదానంలో ఎల్ఎస్‌జీపై ప్రతీకారం కోసం చూస్తోంది.

రుతురాజ్ సెంచరీ.. శివమ్ దూబె మెరుపు హాఫ్ సెంచరీ.. చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోరు
రుతురాజ్ సెంచరీ.. శివమ్ దూబె మెరుపు హాఫ్ సెంచరీ.. చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోరు (AP)

CSK vs LSG live: లక్నో సూపర్ జెయింట్స్ పై కాస్త గట్టిగానే ప్రతీకారం తీర్చుకోవడానికి చెన్నై సూపర్ కింగ్స్ సిద్ధమైంది. ఆ టీమ్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సెంచరీ.. శివమ్ దూబె మెరుపులు సీఎస్కేకు భారీ స్కోరు అందించాయి. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 210 రన్స్ చేయడం విశేషం. రుతురాజ్ 108 పరుగులు, శివమ్ దూబె 66 రన్స్ చేశారు.

రుతురాజ్, శివమ్ విశ్వరూపం

లక్నో సూపర్ జెయింట్స్ కు రుతురాజ్, శివమ్ దూబె తమ విశ్వరూపం చూపించారు. ఇద్దరూ కలిసి ఆకాశమే హద్దుగా చెలరేగారు. రుతురాజ్ కేవలం 56 బంతుల్లోనే 11 ఫోర్లు, 3 సిక్స్ లతో సెంచరీ చేశాడు. అతనికి ఐపీఎల్లో ఇది రెండో సెంచరీ. మరోవైపు శివమ్ దూబె అయితే రుతురాజ్ ను మరిపించేలా చెలరేగిపోయాడు. అతడు కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు.

ఈ ఇద్దరూ నాలుగో వికెట్ కు 47 బంతుల్లోనే 104 పరుగులు జోడించడం విశేషం. శివమ్ దూబె చివరి ఓవర్లో రెండు బంతులు ఉండగా.. ఔటయ్యాడు. అతడు 27 బంతుల్లోనే 7 సిక్స్ లు, 3 ఫోర్లతో 66 రన్స్ చేశాడు. రుతురాజ్ గైక్వాడ్ చివరి వరకూ క్రీజులో ఉన్నాడు. అతడు చివరికి 60 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్ లతో 108 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

20వ ఓవర్ నాలుగో బంతికి శివమ్ ఔటవడంతో ధోనీ క్రీజులోకి వచ్చాడు. అతన్ని చూడగానే చెన్నై అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఈ సీజన్లో ప్రతి మ్యాచ్ లోలాగానే ఈ మ్యాచ్ లోనూ ధోనీ బౌండరీతో ఇన్నింగ్స్ ముగించాడు. ఈసారి అతనికి కేవలం ఒకే బంతి ఆడే అవకాశం వచ్చింది. చివరి బంతికి ఫోర్ కొట్టడంతో చెన్నై సూపర్ కింగ్స్ 4 వికెట్లకు 210 రన్స్ చేసింది.

అంతకుముందు ఓపెనర్ రహానే (1), డారిల్ మిచెల్ (11), జడేజా (17) విఫలమయ్యారు. దీంతో మొదట్లో చెన్నై 49 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. అయితే ఈ సమయంలో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. మొదట జడేజాతో కలిసి మూడో వికెట్ కు 52 పరుగులు.. తర్వాత శివమ్ దూబెతో కలిసి 104 పరుగులు జోడించాడు. దీంతో చెన్నై భారీ స్కోరు చేయగలిగింది.

లక్నో బౌలర్లలో అందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. మోసిన్ ఖాన్ 4 ఓవర్లలో 50, స్టాయినిస్ 49, యశ్ ఠాకూర్ 47 పరుగులు ఇచ్చారు. ఈ ఇన్నింగ్స్ తో రుతురాజ్ గైక్వాడ్ ఆరెంజ్ క్యాప్ లిస్టులో ఏకంగా రెండోస్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం అతడు 8 మ్యాచ్ లలో 349 రన్స్ చేశాడు. విరాట్ కోహ్లి 379 రన్స్ తో టాప్ లో ఉన్నాడు. అతని కంటే కేవలం 30 పరుగులు మాత్రం వెనుకబడి ఉన్నాడు.

Whats_app_banner