IND vs ENG 3rd Test: ఇద్దరు భారత ప్లేయర్లు అరంగేట్రం చేయడం ఖాయమేనా!
IND vs ENG 3rd Test: ఇంగ్లండ్‍తో మూడో టెస్టు ద్వారా ఇద్దరు ప్లేయర్లు భారత జట్టులో అరంగేట్రం చేసే అవకాశాలు బలంగా ఉన్నాయి. టీమిండియా పరిస్థితులు చూస్తే ఇది ఖాయంగా కనిపిస్తోంది.
IND vs ENG 3rd Test: ఇంగ్లండ్‍తో మూడో టెస్టుకు టీమిండియా సిద్ధమవుతోంది. రాజ్‍కోట్ వేదికగా ఫిబ్రవరి 15వ తేదీన ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఐదు టెస్టుల సిరీస్‍లో రెండు మ్యాచ్‍లు ముగియగా.. చెరొకటి గెలిచి 1-1తో ఉన్నాయి టీమిండియా, ఇంగ్లిష్ జట్టు. దీంతో మూడో టెస్టులో గెలిచి ఆధిక్యం సాధించాలని భారత్ కసిగా ఉంది. అయితే, గాయాల బెడద మాత్రం తప్పలేదు. ఈ మూడో మ్యాచ్ నుంచి కేఎల్ రాహుల్ గాయం వల్ల అందుబాటులో ఉండడం లేదు. శ్రేయస్ అయ్యర్‌ను సెలెక్టర్లు పక్కన పెట్టేశారు. ఈ తరుణంలో ఈ మూడో టెస్టు ద్వారా ఇద్దరు ప్లేయర్లు.. టీమిండియా టెస్టు జట్టులోకి అరంగేట్రం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఇంగ్లండ్‍తో టెస్టు సిరీస్‍కు ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, యంగ్ వికెట్ కీపర్ ధృవ్ జురెల్ ఎంపికయ్యారు. తొలిసారి టీమిండియాలో చోటు దక్కించుకున్నారు. అయితే, తొలి రెండు రెండు టెస్టుల్లో తుది జట్టులో చోటు దక్కలేదు. అయితే, మూడో టెస్టులో సర్ఫరాజ్, జురెల్ ఇద్దరూ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. దీంతో వీరిద్దరూ టెస్టు అరగేట్రం చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
సర్ఫరాజ్‍కు ఎందుకంటే..
గాయంతో మూడో టెస్టుకు కూడా కేఎల్ రాహుల్ దూరమవడం, శ్రేయస్ అయ్యర్‌కు సెలెక్టర్లు ఉద్వాసన పలకడంతో మూడో టెస్టులో భారత తుది జట్టులో సర్ఫరాజ్ ఖాన్‍కు చోటు దక్కే అవకాశాలు అధికంగా ఉన్నాయి. బ్యాటింగ్ ఆర్డర్ ఐదో ప్లేస్‍లో అతడు బరిలోకి దిగొచ్చు. రాహుల్ గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమయ్యాకే జట్టుకు సెలెక్ట్ అయ్యాడు సర్ఫరాజ్.
దేశవాళీ క్రికెట్‍లో మూడేళ్లుగా సర్ఫరాజ్ భీకరమైన ఫామ్‍లో ఉన్నాడు. సుమారు 69 సగటుతో పరుగులు 45 రంజీ మ్యాచ్‍ల్లో 3,192 రన్స్ చేశాడు. అందులో 14 శతకాలు ఉన్నాయి. ఓ ట్రిపుల్ సెంచరీ కూడా ఉంది. ఇండియా-ఏ తరఫున కూడా అదరగొట్టాడు. దీంతో ఫుల్ ఫామ్‍లో ఉన్న సర్ఫరాజ్‍ను కీలకమైన మూడో టెస్టుకు తుది జట్టులో టీమిండియా మేనేజ్‍మెంట్ తీసుకునే ఛాన్స్ అధికంగా ఉంది.
భరత్ ఔట్.. జురెల్ ఇన్!
భారత వికెట్ కీపర్ బ్యాటర్, తెలుగు ఆటగాడు కేఎస్ భరత్ టీమిండియాలో వచ్చిన అవకాశాన్ని ఇప్పటి వరకు సద్వినియోగం చేసుకోలేకపోయాడు. 7 టెస్టులు ఆడి కేవలం 20 యావరేజ్‍తో 221 రన్స్ మాత్రం చేశాడు. ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. దేశవాళీ క్రికెట్‍లో, ఇండియా-ఏ తరఫున అదరగొట్టిన భరత్.. టీమిండియాలోకి వచ్చినప్పుడు మాత్రం స్థాయికి తగ్గట్టు ఆడలేకపోతున్నాడు. ఇంగ్లండ్‍తో తొలి రెండు టెస్టుల్లోనూ విఫలమయ్యాడు కేఎస్ భరత్. దీంతో మూడో టెస్టులో తుది జట్టులో కేఎస్ భరత్‍కు ఛాన్స్ ఉండదని తెలుస్తోంది. అతడి స్థానంలో యంగ్ వికెట్ కీపర్ ధృవ్ జురెల్‍ను టీమిండియా తీసుకుంటుందని తెలుస్తోంది.
ధృవ్ జురెల్ ఇప్పటి వరకు ఉత్తర ప్రదేశ్ తరఫున 15 రంజీ మ్యాచ్‍ల్లో 790 పరుగులు చేశాడు. ఓ సెంచరీ కూడా బాదాడు. వికెట్ కీపింగ్‍లో మంచి నైపుణ్యం ఉంది. గతేడాది ఐపీఎల్‍లో రాజస్థాన్ రాయల్స్ జట్టులోనూ మెరిశాడు. మరోవైపు, ఇండియా-ఏ తరఫున కూడా కొంతకాలంగా రాణిస్తున్నాడు. దీంతో ఇంగ్లండ్‍తో మూడో టెస్టులో ధృవ్ జురెల్‍ను టీమిండియా ప్రయోగించే ఛాన్సులు ఉన్నాయి. దీంతో ఈ 22 ఏళ్ల యంగ్ ప్లేయర్ భారత టెస్టు జట్టులోకి అరంగేట్రం చేయడం ఖాయంగా కనిపిస్తోంది.