KS Bharat: సెంచరీని శ్రీరాముడికి అంకితం ఇచ్చిన భారత ప్లేయర్ కేఎస్ భరత్.. వైరల్ అవుతున్న వీడియో-ks bharat dedicates his century to lord ram ahead of ayodhya ram mandir pran pratishtha ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ks Bharat: సెంచరీని శ్రీరాముడికి అంకితం ఇచ్చిన భారత ప్లేయర్ కేఎస్ భరత్.. వైరల్ అవుతున్న వీడియో

KS Bharat: సెంచరీని శ్రీరాముడికి అంకితం ఇచ్చిన భారత ప్లేయర్ కేఎస్ భరత్.. వైరల్ అవుతున్న వీడియో

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 21, 2024 02:54 PM IST

KS Bharat: ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన అనధికార టెస్టులో భారత్-ఏ తరఫున బ్యాటర్ కేఎస్ భరత్ అజేయ శతకం చేశాడు. వీరోచితంగా పోరాడు. అయితే, ఈ మ్యాచ్‍లో తన సెంచరీని శ్రీరాముడికి అంకితమిచ్చాడు భరత్. ఆ వీడియో వైరల్ అవుతోంది.

KS Bharat: సెంచరీని శ్రీరాముడికి అంకితం ఇచ్చిన భారత ప్లేయర్ కేఎస్ భరత్
KS Bharat: సెంచరీని శ్రీరాముడికి అంకితం ఇచ్చిన భారత ప్లేయర్ కేఎస్ భరత్

KS Bharat: భారత బ్యాట్స్‌మన్ కేఎస్ భరత్ అద్భుత అజేయ శతకం చేశాడు. ఇంగ్లండ్ లయన్స్ జట్టుతో జరిగిన అనధికార టెస్టులో శతకం బాది.. మ్యాచ్ డ్రా కావడంలో కీలక పాత్ర పోషించాడు. స్వదేశంలో ఇంగ్లండ్‍తో టీమిండియా ఐదు టెస్టుల సిరీస్ జనవరి 25న మొదలు కానుండగా.. అంతకంటే ముందే సన్నాహకంగా ఈ అనధికార టెస్టులు జరుగుతున్నాయి. ఈ అన్‍అఫీషియల్ టెస్టులో మ్యాచ్ ఆఖరి రోజైన శనివారం సెంచరీతో కదం తొక్కాడు కేఎస్ భరత్ (116 పరుగులు నాటౌట్). దీంతో భారత్-ఏ, ఇంగ్లండ్ లయన్స్ మధ్య జరిగిన ఈ అనధికార టెస్టు డ్రా అయింది.

కాగా, సెంచరీ చేరుకున్నాక కేఎస్ భరత్ చేసుకున్న సెలెబ్రేషన్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. శ్రీరాముడు విల్లుతో బాణం సంధిస్తున్నట్టుగా సంజ్ఞ చేశాడు కేఎస్ భరత్. రాముడికి తన సెంచరీని అంకితమిచ్చాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

జనవరి 22వ తేదీన రామ జన్మభూమి అయోధ్యలో శ్రీరామ మందిర ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఈ చరిత్రాత్మక ఘట్టం కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో తాను చేసిన శతకాన్ని ఇలా శ్రీరాముడికి అంకితమిచ్చాడు భరత్.

భరత్ వీరోచిత సెంచరీ

అహ్మదాబాద్ వేదికగా భారత్-ఏ, ఇంగ్లండ్ లయన్స్ మధ్య ఈ తొలి అనధికార టెస్టు జరిగింది. టీమిండియా-ఏకు రెండో ఇన్నింగ్స్‌లో 490 పరుగుల భారీ లక్ష్యం ముందుంది. అభిమన్యు ఈశ్వరన్ (0), రజత్ పటిదార్ (4) త్వరగా ఔటవటంతో భారత్-ఏ కష్టాల్లో పడింది. సర్ఫరాజ్ ఖాన్ (55), ప్రదోష్ రాజన్ పౌల్ (44) రాణించారు. అయితే, మ్యాచ్ చివరి రోజైన ఫోర్త్ డే కేఎస్ భరత్, సాయి సుదర్శన్ (97), మానవ్ సుతర్ (89 నాటౌట్) అద్భుతంగా ఆడారు.

సుదర్శన్ సెంచరీకి మూడు పరుగుల దూరంలో ఔటయ్యాడు. ఆ తర్వాత కేఎస్ భరత్ అదగొట్టాడు. మానవ్ సుతర్‌తో కలిసి పటిష్టంగా ఆడాడు. వికెట్లు పడకుండా బ్యాటింగ్ కొనసాగించారు. ఓ ఎండ్‍లో మానవ్ నిలకడగా ఆడితే.. కేఎస్ భరత్ కాస్త దూకుడు చూపాడు. దీంతో సెంచరీకి చేరాడు భరత్. 165 బంతుల్లో 116 పరుగులతో అజేయంగా నిలిచాడు. రోజు ముగిసే సరికి భారత్ 5 వికెట్లకు 426 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.

ఈ తొలి అనధికార టెస్టులో తొలి ఇన్నింగ్స్‌ను ఇంగ్లండ్ లయన్స్ 8 వికెట్లకు 553 పరుగులకు డిక్లేర్ చేసింది. భారత్-ఏ తొలి ఇన్నింగ్స్‌లో 227 పరుగులకే ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ లయన్స్ 6 వికెట్లకు 163 పరుగుల పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్‌ డిక్లేర్ చేసింది. దీంతో భారత్-ఏకు 490 పరుగుల కఠినమైన టార్గెట్ నిలిచింది. అయితే, భరత్, సాయి సుదర్శన్, మానవ్ అదరగొట్టడంతో రెండో ఇన్నింగ్స్‌లో సుమారు ఒకటిన్నర రోజుల పాటు నిలబడి భారత్-ఏ మ్యాచ్‍ను డ్రా చేసుకోగలిగింది.

భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ జనవరి 25వ తేదీన మొదలు కానుంది. ఈ సిరీస్‍కు భరత్ ఎంపికయ్యాడు. భారత్-ఏ తరఫున సెంచరీతో కదం తొక్కిన భరత్‍కు టీమిండియా తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు పెరిగాయి.

Whats_app_banner