Gautham Gambhir: గంభీర్‌కు షారుక్ ఖాన్ బ్లాంక్ చెక్.. కేకేఆర్, టీమిండియా మధ్య తేల్చుకోలేకపోతున్న మాజీ ప్లేయర్
Gautham Gambhir: టీమిండియా హెడ్ కోచ్, కేకేఆర్ మెంటార్ రోల్ మధ్య గౌతమ్ గంభీర్ ఎటూ తేల్చుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. ఓవైపు కేకేఆర్ రోల్ కోసం షారుక్ ఖాన్ అతనికి ఓ బ్లాంక్ చెక్ ఇచ్చినట్లు సమాచారం.
Gautham Gambhir: టీమిండియా హెడ్ కోచ్ పదవిపై ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోంది. రాహుల్ ద్రవిడ్ తర్వాత ఎవరు అన్నది ఇంకా తేలాల్సి ఉంది. ఈ పదవి కోసం చాలా మంది పేర్లే వినిపిస్తున్నాయి. అందులో గౌతమ్ గంభీర్ కూడా ఉన్నాడు. అయితే ఇప్పుడో సందిగ్ధ పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. కేకేఆర్ మెంటార్, టీమిండియా హెడ్ కోచ్ పదవులపై అతడు ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు.
గంభీర్‌కు షారుక్ బ్లాంక్ చెక్
శనివారం (మే 25) దైనిక్ జాగరన్ లో వచ్చిన ఓ రిపోర్టు ఆసక్తి రేపుతోంది. టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం బీసీసీఐ ఇప్పటికే గంభీర్ ను సంప్రదించినట్లు ఈ రిపోర్టు వెల్లడించింది. ఈ పదవిపై అతడు కూడా ఆసక్తి చూపినట్లు తెలిపింది. ఇక ఆదివారం (మే 26) ఐపీఎల్ 2024 ఫైనల్ సందర్భంగా బోర్డు పెద్దలతో గంభీర్ చర్చించే అవకాశాలు ఉన్నాయి.
గంభీర్ ఈ పదవి కోసం ఇంకా దరఖాస్తు అయితే చేయలేదు. బోర్డు పెద్దలతో మాట్లాడిన తర్వాత దీనిపై ఓ నిర్ణయానికి రావచ్చు. అయితే అతడు మరో సందిగ్ధ పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. ఈ ఏడాదే ఐపీఎల్లో కేకేఆర్ మెంటార్ గా అతడు వచ్చాడు. ఈ సందర్భంగా ఆ టీమ్ ఓనర్ షారుక్ ఖాన్ అతనికి ఓ బ్లాంక్ చెక్ ఇచ్చినట్లు ఆ రిపోర్టు వెల్లడించింది.
పదేళ్ల పాటు తన కేకేఆర్ టీమ్ చూసుకోవాల్సిందిగా గంభీర్ కు షారుక్ ఆఫర్ ఇచ్చాడట. దీనికోసం తాను ఎంత ఇవ్వడానికైనా సిద్ధమేనమంటూ ఓ బ్లాంక్ చెక్ ఇచ్చినట్లు ఆ రిపోర్టు తెలిపింది. దీంతో గంభీర్ ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు. ఒకవేళ టీమిండియాకు ఓకే చెబితే కేకేఆర్ కు గుడ్ బై చెప్పాల్సి వస్తుంది. మరి దీనిపై అతడు ఏం నిర్ణయం తీసుకుంటాడన్నది ఆసక్తికరంగా మారింది.
టీమిండియా హెడ్ కోచ్ ఎవరు?
టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం గంభీర్ తోపాటు పలువురు ఇతర మాజీ ప్లేయర్స్ కూడా రేసులో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ జస్టిన్ లాంగర్, న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కూడా ఈ పదవిపై కన్నేశారు. అయితే ఇప్పటి వరకూ ఎవరెవరు దరఖాస్తు చేసుకున్నారన్నది తెలియడం లేదు. టీ20 వరల్డ్ కప్ 2024తో ద్రవిడ్ పదవీ కాలం ముగుస్తుంది.
అయితే ఈ ఇద్దరి కంటే గంభీర్ మంచి ఛాయిస్ గా కనిపిస్తున్నాడు. అతడు ఇండియా తరఫున 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ లు గెలిచిన జట్టులో ఉన్నాడు. ఇక కేకేఆర్ కు 2012, 2014లలో కెప్టెన్ గా రెండు ఐపీఎల్ ట్రోఫీలు అందించాడు. ఇప్పుడు మెంటార్ గా ఫైనల్ చేర్చాడు.
పైగా బీసీసీఐ విధించిన అన్ని ప్రమాణాలకు గౌతీ సెట్ అవుతాడు. దేశవాళీ క్రికెట్ గురించి బాగా తెలిసిన వ్యక్తి. దీంతో గంభీర్ కు హెడ్ కోచ్ పదవి ఇస్తే మంచిదే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి అతడు ఏ నిర్ణయం తీసుకుంటాడన్నది ఆసక్తికరంగా మారింది.