Jay Shah on Ponting: మేము పాంటింగ్‌ను అడగలేదు: టీమిండియా హెడ్ కోచ్ పదవిపై బీసీసీఐ సెక్రటరీ జై షా
Jay Shah on Ponting: టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం తనను సంప్రదించారని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ చేసిన కామెంట్స్ ను బీసీసీఐ సెక్రటరీ జై షా ఖండించారు. తాము ఎవరినీ అడగలేదని స్పష్టం చేశారు.
Jay Shah on Ponting: ప్రస్తుతం టీమిండియా తర్వాత హెడ్ కోచ్ వేటలో బీసీసీఐ ఉంది. ఈ నేపథ్యంలో ద్రవిడ్ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు అన్న ప్రశ్న వేధిస్తోంది. ఈ నేపథ్యంలో తనకు బీసీసీఐ నుంచి ప్రతిపాదన వచ్చినట్లు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అన్నాడు. అయితే తాజాగా దీనిపై బీసీసీఐ సెక్రటరీ జై షా స్పందిస్తూ అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు.
జై షా ఏమన్నారంటే..
టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం పాంటింగ్ ను సంప్రదించినట్లు వార్తల్లో నిజం లేదు అని జై షా తెలిపారు. "నేను లేదా బీసీసీఐ ఎప్పుడూ కోచింగ్ ఆఫర్ తో ఏ ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ దగ్గరికి వెళ్లలేదు. కొన్ని మీడియా సెక్షన్లలో వస్తున్న వార్తల్లో నిజం లేదు" అని జై షా శుక్రవారం (మే 24) ఒక ప్రకటనలో చెప్పారు. అయితే టీమిండియాకు హెడ్ కోచ్ ఎవరైనా ఆ వ్యక్తికి ఇక్కడి దేశవాళీ క్రికెట్ నిర్మాణ వ్యవస్థపై పూర్తి పట్టు ఉండాలని మాత్రం జై షా తేల్చి చెప్పారు.
"మన నేషనల్ టీమ్ కు సరైన కోచ్ ను కనిపెట్టడం అనేది చాలా సమగ్రమైన ప్రక్రియ. ఇండియన్ క్రికెట్ నిర్మాణంపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తుల కోసం మేము వెతుకుతున్నాము. టీమిండియాను మరో స్థాయికి తీసుకెళ్లడానికి మన దేశవాళీ క్రికెట్ నిర్మాణంపై పూర్తి పట్టు ఉండాలి" అని జై షా అన్నారు.
హెడ్ కోచ్ పదవి అంటే చాలా ప్రొఫెషనలిజం ఉండటంతోపాటు ఇండియన్ క్రికెట్ ను ముందుకు తీసుకెళ్లగలిగే ఓ విజన్ ఉండాలని కూడా ఈ సందర్భంగా జై షా చెప్పారు. "మనం అంతర్జాతీయ క్రికెట్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఇండియన్ క్రికెట్ టీమ్ హెడ్ కోచ్ పదవి కంటే ప్రతిష్టాత్మకమైనది మరొకటి ఉండదు.
టీమిండియాకు ప్రపంచంలోనే అత్యధిక మంది అభిమానులు ఉన్నారు. ఈ రోల్ లో ఉండేవారికి అత్యున్నత స్థాయి ప్రొఫెషనలిజం ఉండాలి. ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్లను తీర్చిదిద్దాలి. అందుకే దీనికి సరిగ్గా సరిపోయే వ్యక్తిని బీసీసీఐ ఎంపిక చేస్తుంది" అని జై షా స్పష్టం చేశారు.
హెడ్ కోచ్ ఎవరు?
టీ20 వరల్డ్ కప్ 2024తో ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగుస్తుంది. అతడు కావాలనుకుంటే మళ్లీ దరఖాస్తు చేసుకొని ఇంటర్వ్యూలో పాల్గొన వచ్చని బీసీసీఐ స్పష్టం చేసింది. అయితే ఈ పదవిపై ద్రవిడ్ ఆసక్తి చూపడం లేదు. దీంతో కొత్త కోచ్ వేట సాగుతోంది. ప్రస్తుతానికి ఈ రేసులో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ జస్టిన్ లాంగర్, టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్,న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే వీళ్లు దీనికోసం దరఖాస్తు చేసుకున్నారా లేదా అన్నది ఇంకా తెలియలేదు. ప్రస్తుతం ఈ ముగ్గురూ ఐపీఎల్లో వివిధ ఫ్రాంఛైజీల సపోర్టింగ్ స్టాఫ్ లో సభ్యులుగా ఉన్నారు. గంభీర్ పేరును బీసీసీఐ పరిశీలిస్తున్నా.. అతని కోచింగ్ స్టైల్ టీమిండియాలోని సీనియర్ క్రికెటర్లకు సరిపడకపోవచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.