Dinesh Karthik: టీ20 వరల్డ్ కప్ 2024 జట్టులోకి దినేష్ కార్తీక్.. డిమాండ్ చేస్తున్న ఫ్యాన్స్-dinesh karthik in t20 world cup 2024 team fans demand after his innings against sunrisers hyderabad rcb vs srh ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Dinesh Karthik: టీ20 వరల్డ్ కప్ 2024 జట్టులోకి దినేష్ కార్తీక్.. డిమాండ్ చేస్తున్న ఫ్యాన్స్

Dinesh Karthik: టీ20 వరల్డ్ కప్ 2024 జట్టులోకి దినేష్ కార్తీక్.. డిమాండ్ చేస్తున్న ఫ్యాన్స్

Hari Prasad S HT Telugu
Apr 17, 2024 09:32 AM IST

Dinesh Karthik: ఆర్సీబీ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ ను టీ20 వరల్డ్ కప్ జట్టులోకి తీసుకోవాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ తో అతడు ఆడిన మెరుపు ఇన్నింగ్స్ తో సోషల్ మీడియా మొత్తం కార్తీక్ భజన చేస్తోంది.

టీ20 వరల్డ్ కప్ 2024 జట్టులోకి దినేష్ కార్తీక్.. డిమాండ్ చేస్తున్న ఫ్యాన్స్
టీ20 వరల్డ్ కప్ 2024 జట్టులోకి దినేష్ కార్తీక్.. డిమాండ్ చేస్తున్న ఫ్యాన్స్ (AFP)

Dinesh Karthik: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ రికార్డులు క్రియేట్ చేసి మరీ మ్యాచ్ గెలిచింది. కానీ చివరికి సోషల్ మీడియా మొత్తం దినేష్ కార్తీక్ ట్రెండింగ్ లో ఉన్నాడు. కొండంత టార్గెట్ కళ్ల ముందున్నా.. సహచరులంతా అప్పటికే పెవిలియన్ చేరినా.. చివరి వరకూ అతడు పోరాడిన తీరుకు అభిమానులు ఫిదా అవుతున్నారు. అతన్ని టీ20 వరల్డ్ కప్ జట్టులోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

దినేష్ కార్తీక్ ఉండాల్సిందే..

సోమవారం (ఏప్రిల్ 15) రాత్రి ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ ముగిసినప్పటి నుంచీ దినేష్ కార్తీక్ పేరు మరోసారి మార్మోగిపోతోంది. రెండేళ్ల కిందట తొలిసారి ఐపీఎల్ 2022లో తనలోని ఫినిషర్ ను చూపించాడు కార్తీక్. ఆ సీజన్లో ఆర్సీబీ తరఫున చివర్లో వచ్చి మెరుపులు మెరిపించి గెలిపించడం అలవాటుగా మార్చుకున్నాడు. అది చూసి అదే ఏడాది చివర్లో జరిగిన టీ20 వరల్డ్ కప్ కు సెలెక్టర్లు అతన్ని ఎంపిక చేశారు.

ఇప్పుడు మరోసారి టీ20 వరల్డ్ కప్ కు ముందు జరుగుతున్న ఐపీఎల్లో కార్తీక్ అదే పని చేస్తున్నాడు. అయితే ఈసారి తన ఫినిషర్ రోల్ కు సరైన న్యాయం చేయలేకపోతున్నా.. చివరి వరకూ పోరాడుతున్న తీరు మాత్రం అభిమానులను ఆకట్టుకుంటోంది. మొక్కవోని ధైర్యంతో మెరుపు ఇన్నింగ్స్ ఆడుతూ ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాడు.

దీంతో సన్ రైజర్స్ తో మ్యాచ్ ముగియగానే కార్తీక్ ను టీ20 వరల్డ్ కప్ జట్టులోకి తీసుకోవాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. బ్యాటర్, ఫినిషర్, వికెట్ కీపర్.. ఇంతకు మించిన అర్హతలు ఇంకేం కావాలని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఈ మెగా టోర్నీకి అతన్ని మించిన వికెట్ కీపర్ మరొకరు లేరని కూడా వాళ్లు తేల్చేశారు. వరల్డ్ కప్ కు ముందు కార్తీక్.. సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడని అంటున్నారు.

సన్ రైజర్స్‌పై మెరుపు ఇన్నింగ్స్

సన్ రైజర్స్ తో మ్యాచ్ లో ఆర్సీబీ ఓడినా.. నువ్వు మాత్రం మా మనసులు గెలుచుకున్నావని కార్తీక్ ను ఉద్దేశించి అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ మ్యాచ్ లో అతడు కేవలం 35 బంతుల్లోనే 83 రన్స్ చేశాడు. అందులో 7 సిక్స్‌లు, 5 ఫోర్లు ఉన్నాయి. అతని దూకుడుతో ఎప్పుడో ఆశలు వదులుకున్న ఆర్సీబీ అభిమానులు.. కనీసం చివరి వరకూ మ్యాచ్ ను ఎంజాయ్ చేయగలిగారు.

అంతేకాదు టీ20ల్లో రెండో బ్యాటింగ్ చేస్తూ అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టుగా ఆర్సీబీ రికార్డు క్రియేట్ చేయగలిగింది అంటే దానికి కారణం దినేష్ కార్తీకే. ఐపీఎల్ తప్ప మిగతా సమయాల్లో కామెంటేటర్ గా వ్యవహరిస్తూనే తన ఫిట్‌నెట్ కాపాడుకోవడం, ఇలా ఈ వయసులోనూ టీ20ల్లో ఫినిషర్ పాత్ర పోషించడం అతనికే చెల్లింది.

కార్తీక్‌కు ఛాన్స్ ఉందా?

దినేష్ కార్తీక్ బ్యాటింగ్ చూసి అతన్ని టీ20 వరల్డ్ కప్ జట్టులోకి తీసుకోవాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నా.. నిజంగా అసలు అతనికి ఆ ఛాన్స్ ఉందా అంటే మాత్రం కష్టమే అని చెప్పాలి. వికెట్ కీపింగ్ స్థానానికి ప్రస్తుతం చాలా పోటీ ఉంది. రిషబ్ పంత్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ లాంటి వాళ్లు పోటీ పడుతున్నారు.

నిజానికి తనను ఎంపిక చేస్తారన్న నమ్మకం కార్తీక్ కు కూడా అస్సలు లేదు. ఈ మధ్యే అతడు దీనిపై స్పందిస్తూ.. తాను వికెట్ కీపర్ల జాబితాలో ఏ 8వ స్థానంలో ఉంటానని అతడు అన్నాడు.

అలాగని కార్తీక్ ను కేవలం ఓ బ్యాటర్ గా, ఫినిషర్ గా జట్టులోకి తీసుకునే సాహసం సెలెక్టర్లు చేయకపోవచ్చు. రిషబ్ పంత్ ఎంపిక దాదాపు ఖాయం కాగా.. మరో వికెట్ కీపర్ ఎవరనేదానిపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. మరి సెలెక్టర్లు ఏదైనా సంచలన నిర్ణయం తీసుకుంటారా అన్నది చూడాలి.

Whats_app_banner