RCB vs SRH all records: 549 పరుగులు, 43 ఫోర్లు, 38 సిక్స్‌లు.. అన్ని టీ20 రికార్డులు బ్రేక్ చేసిన సన్ రైజర్స్, ఆర్సీబీ
RCB vs SRH all records: ఐపీఎల్ 2024లో భాగంగా సన్ రైజర్స్, ఆర్సీబీ మ్యాచ్ లో అన్ని టీ20 రికార్డులు బ్రేక్ అయ్యాయి. ఈ మ్యాచ్ లో ఏకంగా 549 పరుగులు నమోదవడం విశేషం.
RCB vs SRH all records: హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్, ముంబై ఇండియన్స్ పారించిన పరుగుల వరదను మరవక ముందే బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలోనూ ఓ సునామీ వచ్చింది. ఈసారి సన్ రైజర్స్ హైదరాబాద్ తన రికార్డును తానే బ్రేక్ చేసుకోగా.. ప్రత్యర్థి ఆర్సీబీ కూడా తానేమీ తక్కువ కాదన్నట్లు చివరిదాకా పోరాడి అబ్బురపరిచింది.
ఐపీఎల్ చరిత్రలో 287 పరుగులతో సన్ రైజర్స్ హైదరాబాద్ మరోసారి అత్యధిక పరుగుల రికార్డును బ్రేక్ చేసింది. అటు చేజింగ్ లో ఆర్సీబీ 262 పరుగులతో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలో నమోదైన ఐదు అత్యధిక స్కోర్లలో నాలుగు ఈ సీజన్లో నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ లో గత రికార్డులన్నీ బ్రేక్ అయ్యాయి. అవేంటో మీరే చూడండి.
టీ20ల్లో అత్యధిక మ్యాచ్ టోటల్స్
సన్ రైజర్స్ హైదరాబాద్ (287/3), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (262/7) - 549 పరుగులు
సన్ రైజర్స్ హైదరాబాద్ (277/3), ముంబై ఇండియన్స్ (246/5) - 523 పరుగులు
సౌతాఫ్రికా (259/4), వెస్టిండీస్ (258/5) - 515 పరుగులు
ముల్తాన్ సుల్తాన్స్ (262/3), క్వెట్టా గ్లాడియేటర్స్ (253/8) - 515 పరుగులు
మిడిల్‌సెక్స్ (254/3), సర్రే (252/7) - 506 పరుగులు
టీ20ల్లో అత్యధిక స్కోర్లు
ఐపీఎల్ చరిత్రలో సన్ రైజర్స్ హైదరాబాద్ 3 వికెట్లకు 287 రన్స్ తో సరికొత్త చరిత్ర సృష్టించింది. మూడు వారాల కిందట ముంబై ఇండియన్స్ పై 277 రన్స్ తో రికార్డు క్రియేట్ చేయగా.. ఇప్పుడు ఆర్సీబీపై తన రికార్డును తానే బ్రేక్ చేసుకుంది. ఓవరాల్ గా టీ20ల్లో ఇది రెండో అత్యధిక స్కోరు. గతంలో నేపాల్ టీమ్ మంగోలియాపై 2023లో ఓ మ్యాచ్ లో 3 వికెట్లకు 314 పరుగులు చేసింది.
రెండో స్థానంలో 287 రన్స్ తో సన్ రైజర్స్ ఉంది. ఇక 2019లో ఐర్లాండ్ పై ఆఫ్ఘనిస్థాన్ 278 రన్స్, అదే 2019లో టర్కీపై చెక్ రిపబ్లిక్ 4 వికెట్లకు 278 రన్స్ చేశాయి. నాలుగో స్థానంలో మరోసారి 277 రన్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ నిలిచింది.
చేజింగ్‌లో అత్యధిక స్కోరు
సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ లో ఆర్సీబీ ఓడినా.. సెకండ్ బ్యాటింగ్ చేస్తూ అత్యధిక పరుగులతో సరికొత్త చరిత్ర సృష్టించింది. గతంలో 2023లో వెస్టిండీస్ పై సౌతాఫ్రికా 4 వికెట్లకు 259 పరుగులతో క్రియేట్ చేసిన రికార్డును ఇప్పుడు ఆర్సీబీ 262 పరుగులో బ్రేక్ చేసింది. ఇక గతేడాదే సర్రేపై మిడిల్‌సెక్స్ 254 పరుగులు, ముల్తాన్ సుల్తాన్స్ పై క్వెట్టా గ్లాడియేటర్స్ 253 పరుగులు చేశాయి.
టీ20 మ్యాచ్‌లో అత్యధిక బౌండరీలు
సన్ రైజర్స్, ఆర్సీబీ మ్యాచ్ లో మరో రికార్డు కూడా నమోదైంది. అది ఓ టీ20 మ్యాచ్ లో అత్యధిక బౌండరీల రికార్డు. ఈ మ్యాచ్ లో రెండు టీమ్స్ కలిపి ఏకంగా 81 బౌండరీలు బాదాయి. అందులో 43 ఫోర్లు, 38 సిక్స్‌లు ఉన్నాయి. చిన్నస్వామి స్టేడియం బౌండరీలు దగ్గరగా ఉండటంతో ఫోర్లు, సిక్సర్ల మోత మోగించారు. గతేడాది సౌతాఫ్రికా, వెస్టిండీస్ మ్యాచ్ లోనూ 81 బౌండరీలే నమోదు కాగా.. అందులో 46 ఫోర్లు, 35 సిక్స్ లు కొట్టారు.