Cricket: చరిత్ర సృష్టించిన నేపాల్ బ్యాటర్.. యువరాజ్, పొలార్డ్ తర్వాత అతడే..: వీడియో-dipendra singh airee hits 6 sixes an over and becomes third cricketer to achieve this feat after yuvraj and pollard ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Cricket: చరిత్ర సృష్టించిన నేపాల్ బ్యాటర్.. యువరాజ్, పొలార్డ్ తర్వాత అతడే..: వీడియో

Cricket: చరిత్ర సృష్టించిన నేపాల్ బ్యాటర్.. యువరాజ్, పొలార్డ్ తర్వాత అతడే..: వీడియో

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 13, 2024 07:35 PM IST

Dipendra Singh Airee: నేపాల్ బ్యాటర్ దీపేందర్ సింగ్ ఆరీ దుమ్మురేపాడు. ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టి చరిత్ర సృష్టించాడు.

Cricket: చరిత్ర సృష్టించిన నేపాల్ బ్యాటర్.. యువరాజ్, పొలార్డ్ తర్వాత అతడే..: వీడియో
Cricket: చరిత్ర సృష్టించిన నేపాల్ బ్యాటర్.. యువరాజ్, పొలార్డ్ తర్వాత అతడే..: వీడియో

Dipendra Singh Airee: నేపాల్ బ్యాటర్ దీపేంద్ర సింగ్ ఐరీ మరోసారి రెచ్చిపోయాడు. టీ20ల్లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ నమోదు చేసి గతేడాది దుమ్మురేపిన అతడు.. ఇప్పుడు మళ్లీ అదరగొట్టాడు. ఓ అంతర్జాతీయ టీ20 మ్యాచ్‍లో ఒకే ఓవర్లో ఆరు సిక్స్‌లు బాదాడు. ఏసీసీ ప్రీమియర్ కప్‍లో భాగంగా ఖతార్‌తో నేడు (ఏప్రిల్ 13) జరిగిన మ్యాచ్‍లో దీపేంద్ర సింగ్ ఐరీ.. ఒకే ఓవర్లో వరుసగా ఆరు సిక్స్‌లు సాధించాడు. భారత దిగ్గజ మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్, వెస్టిండీస్ స్టార్ కీరన్ పొలార్డ్ తర్వాత అంతర్జాతీయ టీ20ల్లో ఈ ఫీట్ సాధించిన మూడో ప్లేయర్‌గా ఐరీ చరిత్ర సృష్టించాడు. వివరాలివే..

చివరి ఓవర్లో విధ్వంసం

ఖతార్ బౌలర్ కమ్రాన్ ఖాన్ వేసిన 20వ ఓవర్లో నేపాల్ బ్యాటర్ దీపేంద్ర సింగ్ ఐరీ మెరుపులు మెరిపించాడు. ఆరు బంతులకు ఆరు సిక్స్‌లు కొట్టాడు. తొలి బంతిని మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్స్ బాదిన ఐరీ.. ఆ తర్వాతి బంతికి పాయింట్ మీదుగా సిక్స్ సాధించాడు. మూడో బాల్‍ను కూడా మిడ్ వికెట్ మీదుగా బౌండరీ లైన్ దాటించాడు. నాలుగో బంతికి హెలికాప్టర్ షాట్‍తో సిక్స్ కొట్టాడు ఐరీ. ఐదో, ఆరో బంతులకు కూడా లెగ్ సైడ్ భారీ షాట్లతో సిక్స్‌లు కొట్టాడు దీపేంద్ర సింగ్ ఐరీ.

ఆ ఓవర్ ముందు వరకు 15 బంతుల్లో 28 పరుగులు చేసిన దీపేంద్ర సింగ్ ఐరీ.. చివరి ఓవర్లో అన్ని బంతులకు సిక్స్‌లు కొట్టి 21 బంతుల్లోనే 64 పరుగులకు (నాటౌట్) చేరాడు. ఈ సిక్స్‌ల వరదలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా ఖతార్‌తో జరిగిన ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన నేపాల్ 7 వికెట్లకు 210 పరుగుల భారీ స్కోరు సాధించింది.

యువీ, పొలార్డ్ తర్వాత..

అంతర్జాతీయ టీ20ల్లో ఒకే ఓవర్లో ఆరు సిక్స్‌లు కొట్టిన తొలి బ్యాటర్‌గా 2007లో భారత స్టార్ బ్యాటర్ యువరాజ్ సింగ్ చరిత్ర సృష్టించాడు. 2007 టీ20 ప్రపంచకప్‍లో ఇంగ్లండ్‍తో జరిగిన మ్యాచ్‍లో పేసర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‍లో ఒకే ఓవర్లో ఆరు సిక్స్‌లు కొట్టాడు యువీ. దర్బన్‍లో జరిగిన ఆ మ్యాచ్‍లో చరిత్రలో నిలిచిపోయేలా వీరబాదుడు బాదాడు యువరాజ్.

2021లో శ్రీలంకతో జరిగిన టీ20లో వెస్టిండీస్ స్టార్ కీరన్ పొలార్డ్.. ఒకే ఓవర్లో వరుసగా ఆరు సిక్స్‌ల ఫీట్ సాధించాడు. ఆ మ్యాచ్‍లో శ్రీలంక స్పిన్నర్ అఖిల ధనంజయ బౌలింగ్‍లో ఆరు భారీ సిక్స్‌లు బాదాడు పొలార్డ్.

ఇప్పుడు, నేపాల్ స్టార్ దీపేంద్ర సింగ్ ఆరీ.. ఒకే ఓవర్లో ఆరు సిక్స్‌ల ఘనత దక్కించుకున్నాడు. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో ఈ ఫీట్ సాధించిన మూడో బ్యాటర్‌గా నిలిచాడు.

ఇక, అంతర్జాతీయ వన్డేల్లో ఇప్పటి వరకు ఒకే ఓవర్లో ఆరు సిక్స్‌లు కొట్టిన ప్లేయర్లుగా దక్షిణాఫ్రికా లెజెండ్ హర్సెల్ గిబ్స్, అమెరికా ఆటగాడు జస్కరణ్ మల్హోత్రా ఉన్నారు.

గతేడాది ఫాస్టెస్ట్ ఫిఫ్టీ

ఆసియా గేమ్స్‌లో భాగంగా 2023 సెప్టెంబర్ 27న జరిగిన టీ20 మ్యాచ్‍లో నేపాల్ ప్లేయర్ దీపేంద్ర సింగ్ ఐరీ చరిత్ర సృష్టించాడు. మంగోలియాతో జరిగిన మ్యాచ్‍లో కేవలం 9 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు ఐరీ. అప్పటి వరకు యువరాజ్ సింగ్ (12 బంతులు) పేరిట ఉన్న ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డును ఐరీ బద్దలుకొట్టాడు.

Whats_app_banner