Ashwin invited to Ayodhya: అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్టకు క్రికెటర్ అశ్విన్‌కు ఆహ్వానం-cricketer ashwin invited tor ayodhya ram mandir pran pratishta ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ashwin Invited To Ayodhya: అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్టకు క్రికెటర్ అశ్విన్‌కు ఆహ్వానం

Ashwin invited to Ayodhya: అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్టకు క్రికెటర్ అశ్విన్‌కు ఆహ్వానం

Hari Prasad S HT Telugu
Jan 19, 2024 02:30 PM IST

Ashwin invited to Ayodhya: క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కు అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట కోసం ఆహ్వానం అందింది. ఈ నెల 22న రామ మందిర ప్రారంభోత్సవం జరగనున్న విషయం తెలిసిందే.

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ ఆహ్వానం అందుకుంటున్న రవిచంద్రన్ అశ్విన్
అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ ఆహ్వానం అందుకుంటున్న రవిచంద్రన్ అశ్విన్

Ashwin invited to Ayodhya: అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట వేడుకకు రావాల్సిందిగా టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు ఆహ్వానం అందింది. వచ్చే సోమవారం (జనవరి 22) ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో ఈ మహోన్నత వేడుక జరగనున్న విషయం తెలిసిందే. దీనికోసం శుక్రవారం (జనవరి 19) అశ్విన్ ఈ ఆహ్వానం అందుకున్నాడు.

yearly horoscope entry point

తమిళనాడు బీజేపీ కార్యదర్శి ఎస్‌జీ సూర్య, ఉపాధ్యక్షుడు వెంకట్రామన్ అయోధ్య ఆహ్వానాన్ని అశ్విన్ కు అందజేశారు. అతడు ఆహ్వానాన్ని అందుకుంటున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఆరు వేల మంది ప్రముఖులకు మాత్రమే ఆహ్వానం పంపించారు. అయోధ్యలోని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఈ ఆహ్వాన బాధ్యతలు చూసుకుంటోంది.

ఆహ్వానం అందుకున్న క్రికెటర్లు వీళ్లే

అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్టకు రావాల్సిందిగా ఇప్పటికే కొందరు క్రికెటర్లకు ఆహ్వానం అందింది. టీమిండియా మాజీ కెప్టెన్లు సచిన్ టెండూల్కర్, ఎమ్మెస్ ధోనీ, విరాట్ కోహ్లిలు ఈ ఇన్విటేషన్ అందుకున్నారు. ఈ వారం మొదట్లోనే జార్ఖండ్ ఆరెస్సెస్ సెక్రటరీ ధనంజయ్ సింగ్ చేతుల మీదుగా ధోనీ అయోధ్య ఆహ్వానం అందుకున్నాడు.

ఈ సెలబ్రిటీల ఇళ్లకు వెళ్లి ఈ ఆహ్వానాలు అందజేస్తున్నారు. తాజాగా శుక్రవారం అశ్విన్ కూడా ఈ ఆహ్వానం అందుకున్నాడు. సోమవారం (జనవరి 22) ప్రాణ ప్రతిష్ట జరగనుండగా.. శుక్రవారమే బాల రాముడి విగ్రహాన్ని గర్భగుడిలోకి తీసుకెళ్లారు. ఈ 51 అంగుళాల పొడవున్న రాముడి విగ్రహాన్ని మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించారు.

టీమిండియా క్రికెటర్లు వస్తారా?

అయోధ్య ఆహ్వానం అందుకున్నా కూడా టీమిండియా క్రికెటర్లు ఈ వేడుకకి హాజరవుతారా లేదా అన్నది అనుమానంగా మారింది. జనవరి 22న ఈ కార్యక్రమం జరగనుండగా.. జనవరి 25 నుంచి హైదరాబాద్ లో ఇంగ్లండ్ తో తొలి టెస్టు జరగనుంది. ఈ మ్యాచ్ కోసం శనివారమే (జనవరి 20) టీమ్ హైదరాబాద్ చేరుకొని ప్రాక్టీస్ మొదలుపెట్టనుంది.

ఈ విషయాన్ని ఆఫ్ఘనిస్థాన్ తో మూడు టీ20ల సిరీస్ ముగిసిన తర్వాత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ చెప్పాడు. ఈ టీమ్ లో కోహ్లి, అశ్విన్ ఉన్నారు. ఆ లెక్కన వీళ్లు అయోధ్యకు వెళ్లడం సందేహమే. ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి టెస్టు హైదరాబాద్ లో జరగనుంది. జనవరి 25న ప్రారంభం కానున్న ఈ సిరీస్ మార్చి 11 వరకూ కొనసాగనుంది.

మరోవైపు అయోధ్య రామాలయంలో బాల రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేసే కార్యక్రమానికి ముందు చేసే వైదిక, మతపరమైన కార్యక్రమాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఈ వైదిక కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం ఉదయం 9 గంటలకు పవిత్ర అగ్నిని వెలిగించారు. ఈ రోజు గణపతి పూజ తో పాటు దేవతారాధన ఉంటుంది. అలాగే, అన్ని శాఖల వేద పారాయణం జరుగుతుంది.

Whats_app_banner