Bumrah Instagram Post: బుమ్రా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్.. అతని కోపం ఎవరిపైనో.. నంబర్ వన్ ర్యాంక్ సాధించిన తర్వాత ఇలా..
Bumrah Instagram Post: టెస్ట్ క్రికెట్ లో నంబర్ వన్ ర్యాంకు సాధించిన తొలి ఇండియన్ పేస్ బౌలర్ గా రికార్డు క్రియేట్ చేసిన తర్వాత బుమ్రా చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతోంది. అతని కోపం ఎవరిపైనో అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.
Bumrah Instagram Post: టీమిండియా స్టార్ పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా తాను టెస్టుల్లో వరల్డ్ నంబర్ వన్ ర్యాంకు సాధించిన కాసేపటికే ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. శుభాకాంక్షలు చెప్పడానికి వేల మంది రెడీగా ఉంటారు కానీ.. సపోర్ట్ చేయడానికి మాత్రం ఎవరూ ముందుకు రారు అని బుమ్రా అనడం గమనార్హం.
బుమ్రా పోస్ట్‌కు అర్థమేంటి?
బుధవారం (ఫిబ్రవరి 7) ఐసీసీ రిలీజ్ చేసిన లేటెస్ట్ టెస్టు ర్యాంకుల్లో జస్‌ప్రీత్ బుమ్రా నంబర్ వన్ అయిన విషయం తెలిసిందే. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ పేస్ బౌలర్ గా అతడు రికార్డు క్రియేట్ చేశాడు. అయితే ఆ కాసేపటికే తన ఇన్‌స్టా స్టోరీస్ లో బుమ్రా చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఓ ఇంట్రెస్టింగ్ ఫొటో షేర్ చేస్తూ అతడు ఈ పోస్ట్ చేశాడు.
స్టేడియంలోని గ్యాలరీలో ఒకే వ్యక్తి కూర్చున్న ఫొటోతోపాటు కింద స్టేడియం ఫుల్లుగా ఉన్న మరో ఫొటోను పోస్ట్ చేశాడు. సపోర్ట్ చేయడానికి ఎవరూ ముందుకు రారు కానీ.. శుభాకాంక్షలు చెప్పడానికి మాత్రం అందరూ వస్తారని కామెంట్ చేశాడు. తాను కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరూ మద్దతు చేయలేదని, అయితే ఇప్పుడు నంబర్ వన్ ర్యాంక్ రాగానే అందరూ కంగ్రాట్స్ చెబుతున్నారన్నది అతని ఉద్దేశంగా కనిపిస్తోంది.
బుమ్రా కోపానికి కారణం అదేనా?
సెప్టెంబర్, 2022 నుంచి గాయం కారణంగా బుమ్రా సుమారు ఏడాది పాటు టీమిండియాకు దూరంగా ఉన్నాడు. వెన్ను గాయం అతనిపై చాలా ప్రభావమే చూపింది. గతేడాది ఐర్లాండ్ సిరీస్ నుంచి మళ్లీ అతడు జట్టులోకి వచ్చాడు. వచ్చీ రాగానే తన సత్తా ఏంటో చాటుతున్నాడు. మునుపటి కంటే మరింత పదునైన బౌలింగ్ తో టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు.
తాజాగా విశాఖపట్నం టెస్టులో 9 వికెట్లతో ఇంగ్లండ్ పని పట్టి టెస్టుల్లో వరల్డ్ నంబర్ వన్ ర్యాంకు సాధించాడు. ఇప్పుడందరూ బుమ్రాను ఆహా ఓహో అంటూ పొగుడుతున్నారు కానీ గాయంతో జట్టుకు దూరమైన సమయంలో అతన్ని దారుణంగా ట్రోల్ చేశారు. ఎంతో మంది ప్లేయర్స్ గాయపడినా వెంటనే కోలుకొని తమ జట్లకు ఆడటాన్ని ప్రస్తావిస్తూ కాస్త సిగ్గు తెచ్చుకో బుమ్రా అనే హ్యాష్‌ట్యాగ్ కూడా అప్పట్లో ట్రెండింగ్ లోకి వెళ్లింది.
తాను కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరూ మద్దతివ్వలేదు కానీ.. ఇప్పుడు నంబర్ వన్ కాగానే కంగ్రాట్స్ మాత్రం చాలా మంది చెబుతున్నారన్నది బుమ్రా ఆగ్రహానికి కారణంగా తెలుస్తోంది. గతంలో కేఎల్ రాహుల్ కూడా ఇలాంటి కామెంట్సే చేశాడు. సౌతాఫ్రికాతో తొలి టెస్టులో అతడు వీరోచిత సెంచరీ చేయగానే అందరూ అతన్ని ఆకాశానికెత్తారు.
కానీ ఆ తర్వాత రాహుల్ మాట్లాడుతూ.. ఇప్పుడు పొగుడుతున్నారు కానీ తాను గాయంతో జట్టుకు దూరమైనప్పుడు దారుణంగా ట్రోల్ చేసిన విషయాన్ని గుర్తు చేశాడు. ఇప్పుడు బుమ్రా కూడా అదే ఫీలింగ్ తో ఉన్నట్లు స్పష్టమవుతోంది. తమ అభిమాన ప్లేయర్స్ టాప్ ఫామ్ లో ఉన్నప్పుడు నెత్తిన పెట్టుకోవడం కంటే.. వాళ్లు కష్టాల్లో ఉన్నప్పుడు వెన్ను తట్టి ప్రోత్సహించడమే తమకు కావాల్సింది అని ఈ ప్లేయర్స్ చెప్పకనే చెబుతున్నారు.