Jasprit Bumrah: బుమ్రాకు ఐసీసీ వార్నింగ్.. అలా చేసినందుకే..-jasprit bumrah warned by icc india england first test cricket news in telugu ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Jasprit Bumrah: బుమ్రాకు ఐసీసీ వార్నింగ్.. అలా చేసినందుకే..

Jasprit Bumrah: బుమ్రాకు ఐసీసీ వార్నింగ్.. అలా చేసినందుకే..

Hari Prasad S HT Telugu
Jan 29, 2024 04:29 PM IST

Jasprit Bumrah: టీమిండియా పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాకు ఐసీసీ గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇంగ్లండ్ బ్యాటర్ ఓలీ పోప్ తో అనుచితంగా ప్రవర్తించిన కారణంగా బుమ్రాను హెచ్చరికతో వదిలేశారు.

టీమిండియా పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా
టీమిండియా పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా (AFP)

Jasprit Bumrah: హైదరాబాద్ లో టెస్టులో ఇంగ్లండ్ చేతుల్లో ఓటమితోపాటు జడేజా గాయం.. ఇప్పుడు పేస్ బౌలర్ బుమ్రాకు వార్నింగ్.. ఇలా టీమిండియాకు ఏదీ కలిసి రావడం లేదు. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఉల్లంఘించాడంటూ బుమ్రాకు ఐసీసీ వార్నింగ్ ఇచ్చింది.

ఇంగ్లండ్ బ్యాటర్ ఓలీ పోప్ తో బుమ్రా అనుచితంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆదివారమే (జనవరి 28) ముగిసిన ఈ తొలి టెస్టులో ఇండియా 28 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చేతుల్లో ఓడిన విషయం తెలిసిందే.

బుమ్రాకు వార్నింగ్.. అసలేం జరిగింది?

ఫీల్డ్ లో ఎప్పుడూ నవ్వుతూ, సరదాగా ఉండే పేస్ బౌలర్ బుమ్రాకు ఐసీసీ వార్నింగ్ ఇవ్వడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఇంగ్లండ్ బ్యాటర్ ఓలీ పోప్ పరుగు తీస్తున్న సమయంలో బుమ్రా కావాలనే అతనికి అడ్డుగా వెళ్లినట్లు గుర్తించారు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ 81వ ఓవర్లో ఈ ఘటన జరిగింది. పోప్ పరుగు తీయడానికి ప్రయత్నిస్తుండగా.. బుమ్రా అడ్డు వెళ్లడంతో అతనిని ఢీకొట్టాడు.

ఫీల్డ్ లో ఓ ప్లేయర్ ను అనుచితంగా ఢీకొట్టడం ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ లోని 2.12 ఆర్టికల్ ను ఉల్లంఘించడమే అవుతుంది. అయితే గత 24 నెలల్లో బుమ్రా ఎలాంటి తప్పిదాలు చేయకపోవడంతో అతనికి జరిమానా విధించలేదు. కేవలం హెచ్చరికతో సరిపెట్టింది. దీనికితోడు ఓ డీమెరిట్ పాయింట్ కూడా అతని ఖాతాలో నమోదైంది.

బుమ్రాపై ఫీల్డ్ అంపైర్లు పాల్ రైఫిల్, క్రిస్ గఫనీ, థర్డ్ అంపైర్ మరాయిస్ ఎరాస్మస్, నాలుగో అంపైర్ రోహన్ పండిట్ అభియోగాలు మోపారు. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ లెవల్ 1 తప్పిదానికి పాల్పడితే ఓ ప్లేయర్ హెచ్చరికతోపాటు గరిష్ఠంగా మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత, ఒకటి లేదా రెండు డీమెరిట్ పాయింట్లు ఇస్తారు. బుమ్రా తన తప్పిదాన్ని అంగీకరించాడు. అయితే జరిమానా నుంచి మాత్రం తప్పించుకున్నాడు.

రెండో టెస్టులో అయినా కుదురుకుంటారా?

ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్ లో హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగింది టీమిండియా. కానీ తొలి టెస్టులోనూ ఊహించని ఓటమితో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. రెండో ఇన్నింగ్స్ లో పోప్ (196) భారీ సెంచరీతోపాటు చేజింగ్ లో బ్యాటర్లు చేతులెత్తేయడంతో స్వదేశంలో అత్యంత అరుదైన ఓటమి చవిచూసింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలో దూసుకెళ్లింది.

ఇప్పుడు రెండో టెస్టు ఫిబ్రవరి 2 నుంచి విశాఖపట్నంలో జరగనుంది. ఈ మ్యాచ్ కు ఆల్ రౌండర్ జడేజా గాయం కారణంగా అందుబాటులో ఉండటం అనుమానంగా మారడం కూడా ఆందోళనకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో సిరీస్ ను సమం చేస్తారా లేక ఇంగ్లండ్ కు మరింత ఆధిక్యం ఇస్తారా అన్నది చూడాలి. ఈ రెండో టెస్టుకు కూడా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అందుబాటులో ఉండటం లేదు.

IPL_Entry_Point