Bumrah Irreplaceable: బుమ్రాను ఎవరూ భర్తీ చేయలేరు.. పేసర్‌పై బౌలింగ్ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు-india bowling coach paras mhambrey says bumrah is irreplaceable ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Bumrah Irreplaceable: బుమ్రాను ఎవరూ భర్తీ చేయలేరు.. పేసర్‌పై బౌలింగ్ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Bumrah Irreplaceable: బుమ్రాను ఎవరూ భర్తీ చేయలేరు.. పేసర్‌పై బౌలింగ్ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Maragani Govardhan HT Telugu
Jan 20, 2023 08:31 PM IST

Bumrah Irreplaceable: బుమ్రా స్థానాన్ని టీమిండియాలో ఎవరూ భర్తీ చేయలేరని భారత బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అతడు గాయం నుంచి కోలుకుంటున్న తరుణంలో ప్రతి బౌలర్ కు ఇది మంచి అవకాశమని స్పష్టం చేశారు.

జస్ప్రీత్ బుమ్రా
జస్ప్రీత్ బుమ్రా (AP)

Bumrah Irreplaceable: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గత ఆరు నెలల నుంచి జట్టుకు దూరంగానే ఉంటున్నాడు. అతడు చివరిసారిగా గతేడాది జులైలో ఇంగ్లాండ్ పర్యటనలో పూర్తి స్థాయిలో ఆడాడు. ఆ తర్వాత గాయపడిన బుమ్రా.. సెప్టెంబరులో ఆస్ట్రేలియా సిరీస్‌కు వచ్చినప్పటికీ మళ్లీ గాయం బారిన పడటంతో జట్టుకు దూరమయ్యాడు. అప్పటి నుంచి ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ ఇలా వరుసగా ముఖ్యమైన టోర్నీలకు దూరమవూతూ వచ్చాడు. ఈ కాలంలో మహమ్మద్ సిరాజ్ లాంటి ఆటగాళ్లు ఆకట్టుకుంటున్నప్పటికీ బుమ్రా స్థానాన్ని భర్తీ చేయలేకపోయారు. అతడి లేని లోటు ఇంకా కనిపిస్తూనే ఉంది. శ్రీలంకతో వన్డే సిరీస్‌కు అతడు ఎంపికైనప్పటికీ.. చివరి క్షణంలో గాయం తిరగబెట్టడంతో తీసుకోలేదు. తాజాగా అతడి పరిస్థితిపై భారత బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే స్పందించారు.

"బుమ్రా ప్రత్యేకమైన బౌలర్. అతడి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. అతడి నైపుణ్యాలను పునరావృతం చేయడం చాలా కష్టమనే వాస్తవాన్ని అంగీకరించాలి. ఇది ఇతర బౌలర్లకు కూడా ఓ అవకాశం. ఎందుకంటే వివిధ పరిస్థితుల్లో పరీక్షను ఎదుర్కోవాలి. అప్పుడు మాకు కూడా వారు ఎలా బౌలింగ్ చేయగలరు, ఎలాంటి దశలో ప్రదర్శించగలరో అర్థమవుతుంది. ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ." అని పరాస్ మాంబ్రే తెలిపారు.

బుమ్రా గైర్హాజరుతో భారత బౌలింగ్ దళాన్ని సిరాజ్ నడిపిస్తున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో కూడా అతడు 4 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. సిరాజ్ గురించి మాట్లాడుతూ అతడిని భారత్-ఏ తరపున ఆడినప్పటి నుంచి చూస్తున్నామని, అతడి టెస్టు క్రికెట్‌లో బాగా రాణిస్తాడని పరాస్ స్పష్టం చేశారు. సీమ్ పొజిషన్‌పై అతడు చాలా ముఖ్యమైన ఆటగాడని తెలిపారు. న్యూజిలాండ్‌తో మొదటి వన్డేకు ఉమ్రాన్ మాలిక్ బదులు శార్దూల్ ఠాకూర్‌ను తీసుకోవడంపై పరాస్ మాట్లాడారు.

"ఉమ్రాన్ స్థానంలో ఠాకూర్‌ను తీసుకోవడం గల ఏకైక కారణంగా అతడి బ్యాటింగ్ నైపుణ్యమే. టెయిలెండర్లలో అతడు బాగా బ్యాటింగ్ చేయగలడు. అతడు టీమిండియా తరఫున మంచి ప్రదర్శన ఇచ్చాడు." అని పరాస్ మాంబ్రే తెలిపారు.

న్యూజిలాండ్‌తో భారత్ మూడు వన్డేల సిరీస్ ఆడుతుంది. బుధవారం హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ విజయం సాధించి సిరీస్‌ను 1-0 తేడాతో ఆధిక్యంలో నిలిచింది. ఇంక రెండో వన్డే రాయ్‌పుర్ వేదికగా జరగనుంది. వన్డేల తర్వాత టీ20 సిరీస్ ఆడనుంది భారత్.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్